23-జనవరి-2009
లప్పంగిరిగిరి - 11
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* గత రెండు మూడు రోజులుగా ఫివరిష్‌గా, హెడ్ ఏకిష్‌గా, స్టమకేకిష్‌గా......ఇలా రకరకాలిష్‌గా ఉండడంతో డైరీ వడ్డీ రోజు రోజుకి పెరిగిపోతోందన్న టెన్షన్‌లో నేనుంటే, ఈ మధ్యే సిటీకి వలస వానరంలా వచ్చిన మా వడివేలుగాడు కాలాడు।

ఆడు: మామా వీకెండ్ బాగా ఎంజాయ్ చెయ్యాలంటే ఈ సిటీలో ఏమున్నాయో సిటికెలో చెప్పు...

నేను: రెయ్ నాకు బాలేదు, తర్వాత చెప్తా

ఆడు: అదేంటి మామా అలా అంటావ్. అయినా నీకేం అయ్యిందిరా ? నువ్వు బండ అని చెప్పుకుంటుంటావ్ కదా ?

నేను: నేనూ అలాగే అనుకునే వాడిని కాని ఇది పాలిష్ బండ అని ఇప్పుడే తెలుస్తోంది. నన్నొదిలెయ్ రా బాబు...

అని ఎంత చెప్పినా వినకుండ, నన్ను సతాయించడంతో సిటీలో మేము ఊరేగిన ప్రముఖ పర్యాటబుల్ ప్లేసెస్‌ని ఆడికి వివరించాను. అవ్వన్నీ ఇక్కడ రాసుకుందామనిపించింది.

* రన్ వే 9, కొంపల్లి:

హైదరాబాద్‌లో ఇప్పుడు మోస్ట్ ఎక్సైటింగ్ ప్లేస్ ఇదే. గో-కార్టింగ్ వల్లే ఇదంతా. మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా థ్రిల్ అయ్యాం. ఫార్ములా 1 రేస్ టైప్‌లో సామాన్యుడు సరదాగా రైడ్ చేసే సౌలభ్యం ఇక్కడుంది. Rs 175కు 4 లాప్స్ (రౌండ్లు) నుంచి 20 లాప్స్ - Rs 600/- వరకు టికట్స్ ఉంటాయి. మా మిత్రబృందంలో మొదట నేనే ధైర్యం చేసి ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యా. లెఫ్ట్ కాలు సైడ్ బ్రేక్ ఉంటుంది, రైట్ కాలు సైడ్ ఆగ్జిలరేటర్ ఉంటుంది, స్టీరింగ్....అని అక్కడ బాయ్ సెప్తుంటే, మావాడొకడు, 'మా మొఖం ముందుంటుంది ' అన్నాడు. వావ్ ఇంతేనా అనుకుని, నేను బయలుదేరా. స్లోగా వెళ్తుంటే ఈజీగా వెళ్లొచ్చు. కాస్త స్పీడ్ పెంచుదామని ట్రై చేసి ఫాస్ట్‌గా పోతుంటే మధ్యలో కొంచం కన్‌ఫ్యూజ్ అయ్యాను. అంతే మైండ్ బ్లాక్ అయ్యింది, దభేల్ మని ఆ ట్రాక్ ఇరువైపులా వున్న టైర్లను గుద్దేసా ! రేస్‌లో వెహికిల్‌ని నడుపుతుంటే ఎంత థ్రిల్ ఉంటుందో గుద్దితే దానికి డబుల్ థ్రిల్ ఉంటుంది అని అప్పుడే తెలిసింది. వాళ్ళ స్టాఫ్ అతను వచ్చి గాడీని గడిలో పెట్టాడు అంతే ఈ సారి మళ్ళీ రయ్ మని పోనిచ్చా. 1 లాప్ బాగానే వెళ్ళాను, అప్పుడంటుకుంది మన పరధ్యానపు రోగం, 'ఛ ఇంత ఈజి అని తెలుసుంటే చిన్నప్పుడే మా బాబుని అడిగి ఇందులో ఎంటర్ అయ్యుంటే బావుండేది, ఇండియా మొత్తంలో నారాయణ్ కార్తికేయన్ ఒక్కడే ఉన్నాడు, అస్సలు కాంపిటిషన్ లేదు. నేనూ ఒక మైఖల్ షూ మేకరో, మైఖల్ మధన కామ రాజో అయ్యుండే వాడిని.....ఛ ' అని అనుకుంటుండగా......దభేల్ మని ఈ సారి తెలియకుండా రెండో సారి గుద్దేసాను. తర్వాత ఈ లోకంలోకి వచ్చి మిగతా లాప్స్ కేర్‌ఫుల్‌గా ఫినిష్ చేసాను. మొత్తానికి మంచి ఎక్స్‌పీరియన్స్.

నెక్స్ట్ మావాడొకడు వెళ్ళాడు. ఎద్దులబండిని ఫార్ములా 1 ట్రాక్ పైన తీసుకొస్తే ఎలా ఉంటుందో ఆడు లైవ్‌గా, లవ్లీగా చూపించాడు. ఆడి డ్రైవింగ్ చూసి నవ్వనోడు లేడు. ఆ స్టాఫ్ వాళ్ళైతే నోరు తెరిచి మరీ, ఇంత వరకు వాళ్ళే ఇలాంటి డ్రైవింగ్ చూల్లేదు అన్నంత రేంజ్లో వెళ్ళాడు మావాడు.

తర్వాత వెళ్ళిన ఇద్ధరు పోటి పెట్టుకుని మరీ పాల్గొన్నారు.

మాలాంటి బ్యాచిలర్ బ్యాచ్‌లే కాకుండా చిన్న చిల్డ్రన్, పెద్ద పేరంట్స్, పెద్ద చిల్డ్రన్, చిన్న పేరంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చెయ్యడం కనిపించింది. గో-కార్టింగ్ కోసమైనా అప్పుడప్పుడు విజిట్ చెయ్యాల్సిన ప్లేస్ అని అందరం అనుకున్నాం.

తర్వాత ఇంకేమున్నాయా అని చూస్తే, ఆర్చరీ కనిపించింది. అది కూడా ట్రై చేసాం, మా ఫ్రెండ్ ఒకడు ఫస్ట్ ట్రై చేస్తే ఎగ్జాట్‌గా టర్గెట్‌లో బాణం పడింది. అందరం భలే నవ్వుకున్నాం, ఎందుకంటే ఆడు ఎయిమ్ చేసింది ఆర్చరీ టార్గేట్ కైతే, బాణం తగిలింది పక్కనే ఉన్న షూటింగ్ స్టాల్ టార్గెట్ పైన. స్విమ్మింగ్‌లో పార్టిసిపేట్ చేస్తే, రన్నింగ్‌లో గోల్డ్ మెడల్ కొట్టే నీలాంటోళ్లని తప్పక ఒలంపిక్స్‌కు పంపాల్సిందే అని ఆడ్ని ఆడుకున్నాం. స్టాల్ అతను చెప్పే డైరెక్షన్స్ ఫాలో ఐతే టార్గెట్ దరిదాపుల్లోనే బాణం వెయ్యొచ్చు అనిపించింది. మొత్తానికి ఈ ఆర్చరీ స్టాల్ కూడా నచ్చింది. షూటింగ్ స్టాల్ ఎందుకనో అవేలబుల్‌గా లేదన్నారు.

స్కేటింగ్ కోర్ట్‌కూడా ఉండడంతో చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది కొంచం డేంజరస్ అని ఫ్రెండ్స్ చెప్పారు. అయినా సరే ట్రై చేద్దాం అనిపించింది. కాని మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అని చెప్పడంతో నిరుత్సాహపడ్డాను.

ట్రెక్కింగ్, నడుముకు ఎదో గట్టి గాల్లో లేపేది లాంటి పిల్లాటలు ఉన్నాయి. అవి కూడా మధ్యాహ్నం 3 తర్వాతే అన్నారు.

ఇండోర్ గేమ్స్‌లో స్నూకర్స్, సెంట్రల్ లాంటి ప్లేసస్‌లో కిడ్స్ జోన్‌లో ఉండే గేమ్స్ ఉన్నాయి. వర్చువల్ రియాలిటి మీద ఏదో గేమ్ ఉన్నింది కాని ట్రై చెయ్యలేదు.

గో-కార్టింగ్ కోసమైతే తప్పక దర్శించాల్సిన ప్లేస్.

ఇదంతా బానే ఉంది కాని రన్ వే 9 ఉండే లోకేషన్ మాత్రం సిటీకి చాలా దూరంగా ఉంది. సికంద్రాబాద్ నుంచి వెళ్తే చాలా చుట్టూ అవుతుంది. ఒక స్నేహితూడు మూసాపేట్ దగ్గర ఉన్న కూకట్‌పల్లి Y జంక్షన్ నుంచి వెళ్లే రోడ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పడంతో గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించా. భలే నచ్చింది రూట్. కూకట్‌పల్లి Y జంక్షన్ నుంచి దిక్కులు చూడకుండా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవడమే. న్యూ బోయిన్‌పల్లి బస్ స్టాప్ వస్తుంది. అక్కడ ఒక లెఫ్ట్ తీసుకుని మళ్ళీ చాలా సేపు దిక్కులు చూడకుండ స్ట్రెయిట్‌గా వెళ్తూ...... ఉంటే, లెఫ్ట్ సైడ్ కొంపల్లి సినీ ప్లానెట్ మల్టిప్లెక్స్ వస్తుంది. ఇదో మంచి లాండ్ మార్క్ అక్కడ. అక్కడ నుంచి లెఫ్ట్ దిక్కు మాత్రమే చూస్తూ వెళ్తే కాసేపయ్యాక రన్ వే 9 వస్తుంది.

సొంత వెహికిల్‌లో వెళ్ళడం బెస్ట్. మేము చాలా మందిమి ఉండడంతో షేర్డ్ ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. అయినా వీజీ గా కూకట్‌పల్లి Y జంక్షన్ నుంచి ఒక ఆటో, న్యూ బోయిన్‌పల్లి బస్ స్టాండ్ నుంచి ఇంకో ఆటో తో చాలా ఈజీగా వెళ్ళిపోయాం.

ఒక వీకెండ్ సొంత వెహికిల్ తీసుకుని, మొదట కొంపల్లి మల్టిప్లెక్స్‌లో మార్నింగ్ షో చూసుకుని (ఇక్కడ టికట్స్ అరౌండ్ 40-50 అంతే అనుకుంటా అన్‌లైక్ 100 ఇన్ అదర్ మల్టిప్లెక్సెస్ మరియూ చాలా ఈజీగా దొరుకుతాయి), ఆ తర్వాత, కొంచం ముందుకు వెళ్తే వచ్చే రన్ వే 9కు 3 గంటల తర్వాత వెళ్ళి అన్నీ గేమ్స్ ఆడేసుకుని, ఇంకొంచం ముందుకు వెళ్తే వచ్చే ధోలా-రి-ధాని, రాజస్థాని హాంగ్ అవుట్ (దీని గురించి నాకు ఏమియును తెలియదు. కాని అక్కడక్కడ వినడం జరిగినది)ని ఒక లుక్కేసుకుని వచ్చెయ్యొచ్చనుకుంటా !!!

మరి కొన్ని ఊరేగే స్పాట్స్ చిన్న బ్రేక్ తర్వాత !!!

22-జనవరి-2009
లప్పంగిరిగిరి - 10
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* కొద్ది రోజుల క్రితం లేక లేక gtalkలో లాగిన్ ఐతే ఒక వింత అనుభవం ఎదురయ్యింది.
(బాగా తెలిసిన వాడిలా...)
ఒకతను: హాయ్ అశోక్.
నేను: హాయ్
అతను: మీరు నా లిస్ట్‌లో ఉన్నారు. మీరు ఎవరో గుర్తు రావడంలేదు. మీరు ఎవరో తెలుసుకోవచ్చా ?'
(కొంచం షాక్ తిని...నేను)
నేను: మీరు నన్ను ఆర్కుట్‌లో యాడ్ చేసుకున్నట్టు ఉన్నారు.
అతను: ఓ ఓ.కె ఓ.కె మీరేం చేస్తుంటారు ?
నేను నా ప్రొఫెషన్, కంపని పేరు చెప్పా. కాజువల్‌గా ఆయన కంపెని గురించి అడగగా డైరెక్ట్‌గా చెప్పకుండా ఒక లింక్ ఇచ్చాడు. ఇంక నెక్స్ట్ క్వెషన్ నేను అడగకుండా బ్లాక్ అయినట్టు అనిపించింది. నాకు వెంటనే బుర్ర 270 డిగ్రీస్ సెల్సియస్‌కు, బాడి 180 డిగ్రీస్‌కు మూవ్ అయ్యాయి. నేను వెంటనే gtalk నుంచి జంప్. ఈ చాటింగ్‌తో ఒక బృహత్తరకోణం వెలుగులోకి వచ్చింది. నెక్స్ట్ ఎవరిపైనన్నా ఇది ప్రయోగించాలన్న కుతూహలం ఎక్కువయ్యింది.

ఈ రోజు మా ఫ్రెండ్ గాడి పుట్టిన రోజు కావడంతో వాడికో జెర్క్ ఇద్దామని...అఙ్ఞాత ఐ.డి తో...gtalkలో

నేను: (బర్త్‌డే గ్రీటింగ్ కార్డ్ లింక్ ఇచ్చాను)

ఆడు: థ్యాంక్స్...మీరు ?

నేను: (నా అఙ్ఞాత బ్లాగర్ ప్రొఫైల్, ఆర్కుట్ ప్రొఫైల్, యాహూ ప్రొఫైల్ లింక్స్ ఇచ్చాను)

ఆడు: (నవ్వుతున్న స్మైలీ) ఎలా వున్నారు ?

నేను: (బ్రహ్మానందం నవ్వుతూ ఉన్న ఫోటో లింక్ ఇచ్చాను)

ఆడు: హ హ...మీరు ఎక్కడుంటారు ?

నేను: (హైదరాబాద్ గూగుల్ మ్యాప్ లింక్ ఇచ్చాను)

ఆడు: ROFL (మీరు ఏం చేస్తుంటారు ?)

నేను: (సాఫ్ట్‌వేరోడిని అన్న ఇమేజ్ లింక్ ఇచ్చాను)

ఆడు: మీరు భలే ఇంటరెస్టింగ్‌గా చాటుతున్నారు, ఏ కంపెనీ ?

నేను: (ఒక కంపెని లింక్ ఇచ్చాను)

ఆడు: ........ సినిమాలు ఏవన్నా చూసారా ?

నేను: (కింగ్, మస్కా రివ్యూల లింక్స్ ఇచ్చాను...)

ఆడు: (ఏదో విచిత్రమైన స్మైలీ....) ఇంకేంటి కబుర్లు ?

నేను: (ఈనాడు, సాక్షి, టైమ్స్ ఆఫ్ ఇండియా.......మొదలగు పది న్యూస్ పేపర్ల లింక్స్ ఇచ్చాను.......)

ఆడు: (గుర్ర్ గుర్ర్ అని ఉన్న ఎమోటికాన్ తో ఆడు జంప్....)

* ఆపీస్‌కు పోయే దార్లో ఒక అబౌట్ టు ఓపన్ షాప్ నన్ను బాగా ఇంప్రెస్ చేస్తోంది. ' గెస్ ద స్టోర్ ' అన్న కాంటెస్ట్ పెట్టి షాప్ మొదలవకుండానే ఇంటరెస్ట్ క్రియేట్ చెయ్యగలిగారు.

సిటీలో అక్కడక్కడా, 'ఫిబ్రవరి 1 హాసిని ఎక్కడుంటుంది ?' అని జెనీలియా ఫోటోతో, 'ఫిబ్రవరి 1 చింతకాయల రవి ఎక్కడుంటాడు ?' అని వెంకటేష్ ఫోటోతో..ఇలా ఒక ఇంటరెస్టింగ్ యాడ్ క్యాంపెయిన్ నడుస్తోంది. ఆరా తీస్తే అది కొత్తగా లాంచ్ అవ్వబోతున్న సితార ఛానల్ వారిది అని తెలిసింది.

ఇది చూసాక మా టి.వి వారు లోగో మార్చినప్పుడు చేసిన క్యాంపెయిన్ గుర్తొచ్చింది. 'మా టి.వి ఇప్పుడు maaరింది ' అని 'మా' వచ్చే పదాలన్నింటిలో maa అని వాడి వెరైటీ పోస్టర్స్ వేసారు.

maytas వారి యాడ్స్ కూడా చాలా బాగుండేవి. కరిగిపోతున్న చాకోబార్‌ను చూపించి, త్వరపడండి లేదా ఫ్లాట్స్ దొరకవు అని యాడ్ వేసి చాలా మందిని ఫ్లాట్స్‌ల విషయంలో ఫ్లాట్ చేసారు. కాని అందులో చాలా ఇన్నర్ మీనింగ్ ఉందని, కరిగిపోతున్నది నిధులు అని ఎవరూ ఎక్స్పెక్ట్ చెయ్యకపోవడంతో చివరకి ఐస్ క్రీం పోయి పుల్ల మాత్రం మిగిలిందన్నది వేరే విషయం అనుకోండి. కాని యాడ్ మాత్రం గుడ్ క్రియేషన్.

* నచ్చావులే సినిమా ప్రొమోషన్ కోసం కోతులు, కుక్కలు, ఉడతలను ఉపయోగించిన ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తున్నట్టుంది. ఎక్కడ చూసినా సి.డిలు, చీమలతో ఉన్న ' మస్త్ ' సినిమా పోస్టర్స్ కనిపిస్తున్నాయి.

ఈ ట్రెండ్ మిగతా సినిమాలకు కూడా పాకితే ఎలా వుంటుందో అని అలోచిస్తుంటే, ఇలా పోస్టర్స్ వేస్తారెమో అనిపించింది:

-- పవర్‌ఫుల్ విలేజ్ డ్రామా మూవీ:

ఆల్సేషన్ కుక్క
డాబర్-వుమన్ కుక్క
బొచ్చు కుక్క అలీస్ జూలు కుక్క,
హచ్ కుక్క

వీళ్ళది ఒక అందమైన ఫ్యామిలీ. హీరో కుక్క కండువా లాగా ఖర్చీఫ్‌ను భుజం పైన వేసుకుని ఉంటుంది. ఫ్రెష్ కుక్క బిస్కట్లను లైన్‌లో వస్తున్న వీధి కుక్కలకు పంచి పెడుతుంటుంది.

ఆ కంపౌండ్‌లో అసెంబుల్ అయిన ఊర కుక్కలు, ఊరి కుక్కలు అన్నీ నిల్చుని ఉంటాయి. హీరో కుక్కను చూస్తూ రెస్పెక్ట్ ఇస్తుంటాయి. ఎంతగా అంటే వాటి తోకలన్నీ స్ట్రెయిట్‌గా ఉంటాయి. రాబీస్‌లెస్ రాజ్యంగా కుక్కలు గొనుగుతూ పొగుడుతున్నట్టు వేస్తాం....

దూరంలో ఒక పిచ్చి కుక్క నిల్చుని, ఇది గమనిస్తుంటుంది. ఇది విలన్.

ఇదంతా కవర్ అయ్యేట్టు పోస్టర్ ఉంటుంది.

-- హై వోల్టేజ్ యాక్షన్ ఫిలిం:
కొన్ని వేల లక్షల చీమలు ఆపొజిట్ ఎండ్‌లో, ఎండలో వస్తుంటాయి....ఇటు వైపు మన హీరో చీమ హ్యాట్ పెట్టుకుని చేతిలో చిన్నెస్ట్ చీపురు పుల్లను స్టైల్‌గా పట్టుకుని వుంటుంది. దాని పక్కన బాబాయి/మామయ్య లాంటి 50 గంటల (సంవత్సరాల అంటే బాగోదని...) చీమ, ఒక కాలితో మీసం మెలేస్తూ, ఇంకో కాలితో తొడ గొడుతూ హీరో చీమను చూపిస్తూ ఈ డైలాగ్ అంటుంది - 'ఇది సీమ చీమ రా !!!' అని సవాల్ చేస్తున్నట్టు పోస్టర్ వేస్తాం.

టైటిల్: చచ్చావులే...!!!

-- లో బడ్జెట్ లవ్ స్టోరి:

రెండు క్యూట్ కోతుల నడుమ ఒక భయంకరమైన కోతి ఉంటుంది.

టైటిల్ : టాటా బిర్లా మధ్యలో గొరిల్లా !!!

-- వెరీ హై బడ్జెట్ ఫిలిం:

సి.డిలను ముక్కముక్కముక్కముక్కముక్కల్‌గా పగలగొట్టినట్టు పోస్టర్ అంతా పీసెస్ కనిపిస్తుంటాయి...

ఒక పక్కన - 'రికార్డులన్నీ ఇలా బ్రేకై పోతాయంతే..........' అని ఉంటుంది

-- స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం:

దేశీ కోతులు, ఫారన్ కొండముచ్చులు ఖో-ఖో అడుతున్న సీన్ చూపిస్తూ పోస్టర్ వేస్తాం.

21-జనవరి-2009
లప్పంగిరిగిరి - 9
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!


* ఎప్పటినుంచో చూడాలనుకుంటున్న సినిమా 'సుబ్రమణియపురం' చూసేసా. ఒక్క byte తమిళ్ రాకపోయినా అత్యంత కష్టపడుతూ సినిమా చూడటం మొదలెట్టా. మొదటి 30 నిమిషాలు నాకు సినిమా అస్సలు అర్థం కాలేదు. 2008 అని చూపించి సెంట్రల్ జెయిల్ నుంచి ఒకతను విడుదల అవుతాడు. అతనిని ఇంకోడు జెయిల్ బయటే కత్తితో పొడుస్తాడు(అనుకుంటా ఆ చీకటిలో అది కత్తో, బాకో, చాకో, కత్తి పీటో సరిగ్గా కనిపించలేదు). సినిమా 1980s కు వెళ్తుంది. 4-5 స్నేహితులు. ఏవో గాలి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అందులో ఒకతనికి మన కలర్స్ స్వాతి అంటే ఇష్టం. తనకు కూడా అతనంటే ఇష్టం. ఈళ్ళ మధ్య సీన్స్ బావున్నాయి. ఎక్సెలెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో స్వాతి కళ్ళను, హీరో మూతిని తిప్పడంతోనే చాలా రీళ్ళు తిప్పేసాడు దర్శకుడు.

30 నిమిషాల తర్వాత కూడా నాకు ఇది ఏ టైప్ సినిమానో అర్థం కాలేదు. కాని ఆ తర్వాతే అస్సలు సినిమా మొదలయ్యింది. ఇక చూస్కో నా రంగ సామి ('సామి రంగా' కన్నా ఇది ఎఫెక్టివ్‌గా ఉంటుందనీ...) హత్యలే హత్యలు. టూ మచ్ యాక్షన్ ఫిలిం. 2 కోట్ల బడ్జెట్‌తోనే 20 కోట్ల సినిమా ఎఫెక్ట్ తీసుకురాగలిగారు. 5 మంది బ్యాచ్‌లో ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అతను మాత్రమే మిగిలి హీరో, తన ఫ్రెండ్ తో సహా అందరూ మగ జెంట్స్ చనిపోవడం ఈ సినిమా ప్రత్యే-కథ.

హీరోయిన్‌ను అడ్డు పెట్టుకుని హీరో్‌ని ట్రాప్ చేసే సీన్ హిందీ సినిమా ' గ్యాంగ్‌స్టర్ 'ను గుర్తుకు తెచ్చింది. ఆ సీన్‌లో స్వాతి చూపిన నటన అమోఘం. ఎప్పుడూ 37 పళ్ళు (తనకి ఒక ఎత్తు పన్ను ఎక్స్‌ట్రాగా వుంది) చూపిస్తూ తెగ నవ్వుతూ ఉండే స్వాతి అంతలా ఏడ్వడం ఇదే ఫస్ట్ టైం అనుకుంట. చెయ్యిని తలకు కొట్టుకుంటూ, 'అయ్యో అయ్యో...' అని ఏడ్చే సీన్ చూస్తే భలే నవ్వొచ్చింది. పక్కనే బండ రాయి ఉంది దానికి కొట్టుకుని ఉంటే ఇంకా ఎఫెక్ట్ బావుండేది అనిపించింది.

హీరో ఫ్రెండ్‌గా డైరెక్టర్ శశికుమార్ చేసాడనుకుంటా. చాలా బాగా చేసాడు. ఈళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ సీన్‌లు బావున్నాయి. ఈళ్ళు ఫ్రెండ్స్ కాదు అన్న దమ్ములు లాంటి అణు బాంబులు పేల్చకండి. బదిరులకు వార్తలు చూస్తున్న ప్రేక్షకుడిలా యమ కాన్సెంట్రేషన్‌తో చూసి అర్థం చేసుకున్నది సెప్తున్నా.

ఇంకో ఫ్రెండ్ హ్యాండ్ ఇవ్వడం చాలా సినిమాల్లో చూసిందే. ఓవరాల్‌గా చూస్తే ఇదేమంత డిఫరెంట్ స్టోరి కాదు కాని కచ్చితంగా డిఫరెంట్ సినిమా అనిపిస్తుంది. హీరో,డైరెక్టర్ మొదటి హత్య చేసాక సినిమా చాలా ఊపుతో వెళ్తుంది.

అవలీలగా ఇతరుల ప్రాణాలు తీసిన హీరో తన ప్రాణం డేంజర్‌లో పడడంతో కాపాడమని ఒక గృహిణి కాళ్ళమీద పడే సీన్, హీరో చావుకి ఫ్రెండ్ ప్రతీకారం తీర్చుకునే సీన్, ఇంకో ఫ్రెండ్ ఈడికి హ్యాండ్ ఇచ్చే సీన్ చాలా బాగా తీసారు.

హీరో, హీరోయిన్ మధ్య వున్న ఒక సాంగ్ చాలా బావుంది. అది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా వస్తూంటుంది. 'సుబ్రమణియపురం' టైటిల్ సాంగ్ కూడా బావుంది. ఇది చూసినప్పటినుంచి 'సుబ్రమణియపురం..సుబ్రమణియపురం' అనే పాడుకుంటున్నాను.

1980s బ్యాక్‌డ్రాప్ భలే చూపించారు. మాసిన గడ్డాలు, లుంగీలతో సాహా చాలా కేర్ తీసుకున్నారు.

ఇంతక ముందు తమిళ్‌లో సూపర్ హిట్ అని మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎందుకో కూడా తెలిసింది.

* నాదొక త్రిశంకు డి.వి.డి ప్లేయర్. మంచి సినిమా డి.వి.డి లు తప్ప చెత్త సినిమా అని తెలిస్తే చాలు ఫార్మాట్ ఏంటా అని పట్టించుకోకుండ వెంటనే పనిచేస్తుంది. దీనితో విడాకులు తీసుకుందామంటే అత్తయ్యకు (మదర్ బోర్డ్) సరిపోయే కొత్త కోడలు దొరకట్లేదు.

ఇందులో వి.సి.డిలను మాత్రం ఫార్మాట్ ఫీలింగ్ లేకుండా యాక్సెప్ట్ చేస్తుంది. బయట డి.వి.డి/వి.సి.డి స్టోర్స్‌లో నాకు కావాల్సిన సినిమాలు తప్ప అన్నీ వి.సి.డి ఫార్మాట్‌లో ఉంటాయి, అవి మాత్రం DVDల్లోనే ఉంటాయి.

ఇలా రకరకాల VCD షాప్‌లు తిరగడం వల్ల మరియూ కొందరు గురూజీల సౌజన్యంతో సిటీలో అతి పెద్ద కలెక్షన్ ఉన్న డి.వి.డి/వి.సి.డి షాప్‌ల గురించి తెలిసింది. అవి ఇక్కడ వ్రాసుకుందామనిపించింది.

- కరిజ్మా, యూసఫ్‌గూడా: వీళ్ళ దగ్గర పేరున్న ఏ టాలీ/బాలీ/హాలీ/కోలి..ఏ వుడ్ సినిమా అన్నా లభిస్తుంది. యూసఫ్‌గూడా బస్తి జంక్షన్ దగ్గర నుంచి ఎల్లారెడ్డిగూడా వెళ్లే రోడ్లో మొదట్లోనే రైట్ సైడ్‌లో వుంటుంది ఈ షాప్.

- Fribji, బంజారా హిల్స్: మొదట్లో ఈ షాప్ కరిజ్మాకు దగ్గర్లోనే ఉండేది. ఈ మధ్యే మార్చినట్టున్నారు. పంజాగుట్ట నాగార్జున హిల్స్ నుంచి బంజారా హిల్స్‌కు వెళ్లే రోడ్లో మొదట్లోనే లెఫ్ట్ సైడ్ వస్తుంది. వీళ్ళ కలెక్షన్ చూసి నా కళ్ళు తిరిగిపోయాయి. బహుశా ఇంగ్లిష్ మూవీ ఏదీ ఇక్కడ దొరకకుండా ఉండదేమో అనిపించింది. అక్కడున్న క్యాటలాగ్‌లు చదవడానికే సంవత్సరాలు పడుతుంది. ఇక అన్ని సినిమాలు చూడాలంటే మూడు జన్మలు కూడా సరిపోకపోవచ్చు.

ఎక్సెలెంట్ రీసోర్స్ ఫర్ ఇంగ్లిష్ మూవీ ఫ్రీక్స్.

- సినిమా పారడిసో: ఇది జూబ్లీ హిల్ల్స్ నుంచి పంజాగుట్ట, నాగార్జున హిల్స్ వైపు వస్తున్నప్పుడు చట్నీస్ రెస్టారెంట్ పక్కనే కనిపిస్తుంది. ' సఖి ' ఫిలిం హీరోయిన్ షాలిని, అంజలి షామిలి సోదరుడైన రిచర్డ్స్ అలియాస్ ' ఎ ఫిలిం బై అరవింద్ ' రిషి మరియు సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ కలిసి పెట్టినదే సినిమా పారడిసో. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమయ్యే ఇరాన్, కొరియన్...లాంటి వరల్డ్ సినిమా కలెక్షన్ ఉన్న స్టోర్ ఇది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో పుర ప్రముఖులు దీనికి రెగులర్ కస్టమర్స్. ఇక్కడ మెంబర్‌షిప్, రెంటల్స్ కొంచెం కాస్ట్లీ.

- న్యూ భారత్ ఎంటర్‌ప్రైజెస్, అబిడ్స్: ఈ స్టోర్‌కు ఒక్క సారే వెళ్ళాను. మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక సగటు మూవీ బఫ్ గెస్ చెయ్యలేనంత కలెక్షన్ వుంది వీళ్లదగ్గర. వీళ్లది పక్కా లోకలైజ్డ్ మార్కెట్.

తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిష్ సినిమాల్లో ఏదన్నా సినిమా వి.సి.డి/డి.వి.డి రిలీజ్ అయ్యిందని మీకు తెలుసుంటే చాలు కళ్ళుమూసుకుని ఈ షాప్‌కు వస్తే అది ఉంటుంది. ఇది రెంటల్ షాప్ కాదు కొనుక్కోవాలి.

నేను ఈ షాప్ కలెక్షన్ చూసి సరదాగా, ఫలానా సినిమా వి.సి.డి ఉండే చ్యాన్సెస్ ఏ లేవు అని నోటికొచ్చిన రెండు మూడు సినిమా పేర్లు సెప్తే, గబుకున్న ఆ షాప్ బాయ్ వెళ్ళి లటుకున్నా తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఈళ్ల ముందు మనమింకా బాల నటులమని అర్థమయ్యింది.

అబిడ్స్ బిగ్ బజార్ దగ్గర వున్న, హాలీవుడ్ ఫుట్ వేర్ షాప్ పక్క వీధిలో లో.......పలికి వెళ్లి ఆల్‌మోస్ట్ డెడ్ ఎండ్‌కు వెళ్లాక రైట్ టర్న్ తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. ఆ వీధి గుండా వెల్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఈ షాప్. ఇందులో మంచి డిస్కౌంట్లు కూడా వున్నాయి.

పూర్తి చిరునామా:

న్యూ భారత్ ఎంటర్ప్రైజెస్,
4-3-51/72/5,
హెచ్.వి.ఎస్ కాంప్లెక్స్,
కందస్వామి లేన్,
హైదరాబాద్ - 95

ఫోన్ నంబర్: 24752067, 24750038

- మోజర్ బేయర్, మెహదీపట్నం: నాణ్యమైన సినిమా వి.సి.డి/డి.వి.డి లను అత్యంత తక్కువ ధరలలో ఇవ్వాలన్న కాన్సెప్ట్ మీద వచ్చిన మోజర్ బేయర్ కంపెనీ కొంత వరకు సఫలీకృతమైందనే చెప్పాలి. 'నీ స్నేహం' లాంటి కొన్ని సినిమాల క్వాలిటీ బాలేకున్నా చాలా మటుకు మంచి క్వాలిటీనే ఇస్తున్నారు.

వీళ్ళ ముఖ్య బ్రాంచ్ ఒకటి మెహదీపట్నంలో ఉంది. అంబా ధియేటర్ ఆపోజిట్‌గా ఉంటుంది. కరెక్ట్‌గా ఎలా చేరుకోవాలో నాకు గుర్తులేదు. అంబా, అంబా....అని అడుగుతూ వెళ్తె కనుక్కోవచ్చనుకుంటా. ఈ కంపెనీ నుంచి రెలీజ్ అయిన ఏ సినిమా వి.సి.డి/డి.వి.డి అయినా ఇక్కడ లభిస్తుంది.

హమ్మయ్య అన్నీ చెప్పేసానోచ్ !!!

20-జనవరి-2009
లప్పంగిరిగిరి - 8
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* సుబ్బు గాడితో పిచ్చాపాటిగా జోకుతుండగా ఆడికి ఒక SMS వచ్చింది. చూస్తే కలెక్టర్ నవీన్ మిట్టల్ నుంచి.

ఆడు: ఏంటోరా ఈ మధ్య పెద్ద పెద్ద వాళ్ళనుంచి చిన్న చిన్న SMSలు వస్తున్నాయి. నా నంబర్ ఎవరిచ్చారో తెలియడం లేదు.
నేను: జెమిని మ్యూజిక్ లాంటి ఛానెల్స్‌లో రోజుకు ఒక్కసారన్నా 'ప్లీజ్ కాల్ మీ ప్లీజ్ కాల్ మీ' అని మెసేజ్ చేస్తుంటావు కదా, అది చూసి చేసారేమో.
ఆడు: అంతే నంటావా ? ఈ మధ్య రెండు సార్లు చంద్రబాబు నాయుడు నుంచి కూడా వచ్చిందిరా. అంతలా మన పేరు ఎలా పాకిందబ్బా ? నీకు నా కన్నా ఎక్కువ పరిచయాలు వున్నాయి కదా మరి నీకు రాలేదా ?
నేను: నీకున్న circle ముందు నా rectangle ఎంతరా ? నాకంత సీన్‌లేదు.
అప్పుడే ఎంటర్ అయిన ఇంకోడు: 'నాకూ చంద్రబాబు నుంచి న్యూ ఇయర్, సంక్రాంతి విషెస్ అని మెసేజ్ వచ్చింది ' అనడంతో సుబ్బుగాడు నా వంక డవుట్-full గా చూసి, నా ఫోన్ లాక్కొని మెసేజస్ చూసాడు. అందులో చంద్రబాబు నాయుడు SMS చూసి,
సుబ్బు: ఎదవా...అచ్చిందని చెప్పొచ్చుగా ?
నేను: నువ్వేదో గొప్పోడి వన్న ఫీలింగ్‌లో వున్నావని కంటిన్యూ చేసా మామా. నీ అంతకు నువ్వే నీ రేంజ్‌ని తగ్గించుకున్నావ్.

ఈ సుబ్బు గాడికి విపరీతమైన ఫోన్ పిచ్చి. ఈడు, ఈడి పంచేంద్రియాలు పని చెయ్యకపోయినా పట్టించుకోడు కాని ఆరో ఇంద్రియం అయిన సెల్ ఫోన్ పనిచెయ్యక పోతే మాత్రం తట్టుకోలేడు. యెప్పుడూ ఎవరితో ఒకరితో మాట్లాడుతుంటాడు, అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురితో కూడా మాట్లాడుతుంటాడు. ఛార్జింగ్ ఐపోతే ప్రోబ్లమని ఎప్పుడూ రెండు fully ఛార్జ్‌డ్ బ్యాటరీలు క్యారీ చేస్తుంటాడు.

రోజుకి ఎన్ని ఇన్‌కమింగ్ కాల్స్ వస్తే సమాజంలో అంత క్రేజ్ ఉన్నట్టు అని ఫీల్ అవుతుంటాడు. ఈడు ఎవరికీ ఫోన్ చెయ్యడు. 'ప్లీజ్ కాల్ మీ' అని మెసేజ్ మాత్రం చేస్తుంటాడు. అదేదో 1000 ఫ్రీ SMSలు వున్న ఆఫర్ తీసుకుంటాడు. బహుశా అవన్నీ అవ్వగొట్టే ఏకైక కస్టమర్ ఈడే అయ్యుండొచ్చు. వీడికి స్కూల్/కాలేజ్/ఆపీస్/ఇంటర్నెట్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా కస్టమర్ కేర్ వాళ్ళు ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఈడి మెసేజ్‌లకి బదులుగా ఎవ్వరు ఫోన్ చెయ్యకపోతే వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఏ దీపా నో, రూపా నో పిలవమంటాడు. అలా గంటలు గంటలు మాటాడుతుంటాడు. అలాంటిది ఈ మధ్య ఈడికి ఫోన్ కాల్స్ బాగా తగ్గాయి. ఈడి సర్కిల్‌లో అందరికీ వీడి గురించి తెలిసిపోవడమే రీజన్. దీని వల్ల చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. ఈడి మైండ్‌లో మినుక్కు మినుక్కు మంటు ఒక బుల్లి ఐడియా వచ్చింది.

ఆడు: మామా నా కొక ఎక్సెలెంట్ ఐడియా వచ్చింది. ఇప్పుడు మనమే ఏ పవన్ కళ్యాణ్/మహేష్ బాబు పేరుతో ఇలా మెసేజ్ పంపితే ?
నేను: బాబోయ్ వద్దురా, అయిపోతావ్.
ఆడు: మనం చేసినట్టు తెలుస్తుందా ఏంటి ?
నేను: ఇలాంటి తిక్క తిక్క పనులు చెయ్యకురా.
అని ఎంత చెప్పినా వినకుండ, 'బి లేటెడ్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి విషెస్, అడ్వాన్స్‌డ్ విషెస్ ఫొర్ హేపీ రిపబ్లిక్ డే' అని చివర్లో పవన్ కళ్యాణ్ పేరుతో ఈడి అఙ్ఞాత సిమ్ నుంచి తెలిసిన నంబర్‌లన్నింటికీ పంపించాడు.

అంతే వెంట వెంటనే చాలా కాల్స్ వచ్చాయి। కొందరేమో 'పవర్ స్టార్ ' అని మొదలెట్టగా సుబ్బుగాడు తెగ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. రిప్లైగా ఏమీ మాట్లాడలేదు. కాని ఈడి ఆనందం ఎక్కువ సేపు లేదు, కొందరు మొదలుపెట్టడమే, '@$%్!*...' అని un-blog-mentary లాంగ్వేజ్‌లో ఆడుకున్నారు. కొందరు డైరెక్ట్‌గా 'రే సుబ్బు-గబ్బు నీకింకేం పని పాటా లేవురా ?' అని డైరెక్ట్‌గా పేరు చెప్పడంతో ఈడు షాక్ అయ్యాడు.
క్షణాల్లో ఈడి SMS పాకిపోయింది. ఆర్కుట్ లాంటి ఫోరమ్స్‌లో కొంత మంది పోస్ట్ చేసారంట, 'మామ్స్ మన పవర్ స్టార్ పేరు మీద ఈడెవడో ఫేక్ SMS పంపిస్తున్నాడూ అనీ. ఇలా వాడు చేసిన సిల్లి పనికి ఇన్ని కాల్స్ రావడం చూసి సర్‌ప్రైజ్ అయ్యాడు. అసలీళ్ళకి, నేను ఫేక్ అని ఎలా తెలుసు ? కొందరు డైరెక్ట్‌గా నా పేరు చెప్పారు. ఎలా గుర్తుపట్టారు ? అన్న విషయం అర్థం కాక చస్తుంటే మేము ఆడు పంపిన SMS చూసాం,
చివర్లో పవన్ కళ్యాణ్ పేరు కింద ఈడు అలవాటులో పొరపాటుగా 'ప్లీజ్ కాల్ మీ ' అని టైప్ చేసేసాడు !!!

* న్యూస్ పేపర్‌లు తిరగేస్తుంటే, 'maytas' ను 'maYtaS' అని వ్రాసున్న సాక్షి కార్టున్ బాగా నచ్చింది. ఎక్కడ ఈనాడు వాళ్ళు ఈ విషయం గమనించి వాడేస్తారేమో అని, సాక్షి వాళ్ళే, YS కు maytas తో సంబంధం ఉందని విపక్షాలు ఇలా చెప్తారేమో అని యూజ్ చేసిన ఐడియా సూపర్ !!!
ఇది చూస్తుంటే నా ఆల్ టైం ఫేవరెట్ అడ్వర్టైజ్మెంట్స్‌లో ఒకటైన జండూ బామ్ యాడ్ గుర్తొచ్చింది.
'Head Ache Head Ache' అన్న wordsలో 'HA HA' పెద్ద సైజ్‌లో పెట్టి, జండూ బామ్ వాడే వాళ్ళు head ache అంటే నవ్వుకుంటారని ఎంతో అద్భుతంగా చెప్పారు...!!!
ఆ యాడ్ ఇక్కడ చూడొచ్చు: జండూ బామ్ యాడ్
ఈ యాడ్ మొదటి సారి చూసినప్పుడు ఎంతగా ఎగ్జైట్ అయ్యానంటే ఆ క్రియేటర్ ఎవరో తెలిస్తే నా మనవడి ఆస్తిలో అర-వాటా ఇచ్చెయ్యాలనిపించింది !!!


19-జనవరి-2009
లప్పంగిరిగిరి - 7
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* ఎవరితోనో gtalk లో ఇంపార్టంట్ విషయం చాటుతుంటే, ఎప్పుడూ పగటి పూట ఆన్‌లైన్ రాని సనత్‌గాడు రావడంతో షాక్ అయ్యా.
సనత్: ఏరా ఫోటోస్ చూసావా ?
నేను: ఏ హీరోయిన్‌వి, ఎక్కడ ?
సనత్: నీ ఎంకమ్మ. అవి కాదు, నేను తీసిన ఫోటోస్ అప్‌లోడ్ చేసి లింక్ ఇచ్చాను కదరా, ఇంకా చూల్లేదా ?
నేను: ఓ అవా, సారీ మర్చిపోయా.
సనత్: సర్లే, ఇప్పుడు చూడు.
నేను: ఇప్పుడా ?
సనత్: ఏంటి ఇంకా లంచ్‌కు ఎళ్లలేదా ?
నేను: ఇప్పుడే మేసి వస్తున్నా, అందుకే...
సనత్: అంటే...నిన్నూ...ఇప్పుడు చూస్తావా సాయంత్రం నన్నే చూపించమంటావా ?
నేను: అమ్మో వద్దు, నేనే చూస్తా.
అని చూడ్డం మొదలెట్టా
ప్రతి ఫోటో్‌కు ఈడు ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ చూసి భలే నవ్వొచ్చింది, మా ఫోటోగ్రఫి కోర్స్ రోజులు గుర్తొచ్చాయి. సనత్‌గాడు ఫోటోగ్రఫి పిచ్చోడు, అర్జున్ కచ్చోడు, నేను పిచ్-కచ్-చోడిని.

ఒకరోజు ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్ గుండా పోతుంటే అర్జున్ గాడికి ఏదో ఫోన్ కాల్ వచ్చింది, సరిగ్గా వినిపించడంలేదని బండాపమన్నాడు. ఆడు పక్కకెళ్లి మాటాడుతుంటే అక్కడ ఉన్న ఒక స్టాల్‌ను చూసా. అంతే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి, "మీకు కశ్యప్ తెలుసా ?" అన్నాడు. ఇదేదో ఆకస్మిక G.K తనిఖీ కేంద్రంలా వుంది అనుకుని, "హిరణ్య కశ్యప్ తెలుసు" అని ఠక్కున సమాధానం చెప్పాను. ఆడి ఫేస్‌లో క్రాకర్స్ కనిపించాయి.
ఆడు: ఆయనకాదు సార్. ద గ్రేట్ ఫోటోగ్రాఫర్ కశ్యప్ గారు ఫోటోగ్రఫి కోర్స్ పెడుతున్నారు. మీకు ఇంటరెస్ట్ ఉందా ?
నేను: ఓహో, నాకు అంత ఇంటరెస్ట్‌లేదు లేండి.
అని చెప్తే, చాలా మంచి చ్యాన్స్ సార్. ఆయన గోడలు మేడలు దూకి ఫోటోలు తీసి గోల్డ్ మెడల్ సాధించారు, డిస్టింక్షన్ ఇన్ డిప్లొమ ఇన్ ఫోటోగ్రఫి, Powerpoint లో పట్టాదారు పాసు పుస్తకం, MS Word లో వైట్ కార్డ్ (రేషన్ కార్డ్) హోల్డర్ అని ఏవేవో చెప్పాడు. నాకు ఇంటరెస్ట్‌లేదని చెప్పినా వినకుండ పాంప్లెట్ నా చేతిలో పెట్టాడు. అప్పుడే అర్జున్ గాడు రావడంతో వెంటనే బయలుదేరా. లక్కీలీ ఆడికి పాంప్లెట్ ఇవ్వలేదు, ఇచ్చుంటే, '101 ways on how not to use a paper' కోర్స్ లైవ్ డెమో చూపించేవాడు.

రెండు మూడు రోజుల తర్వాత ఎలాగో సనత్ చేతిలో ఆ పాంప్లెట్ పడడంతో భలే ఎగ్జైట్ అయ్యాడు. అలాంటి కోర్స్ కోసమే ఎదురుచూస్తున్నాడంట. ఆడు ఫోటోగ్రఫి గురించి, అర్జున్‌గాడు ప్రియమణి గురించి చెప్పిన రేంజ్‌లో చెప్పడంతో వినలేక చచ్చాను. ఎలాగన్నా నన్ను కూడా ఆ కోర్స్‌కు తీసుకెళ్తే ఆడికో తోడుంటుందని ఆడి తాపత్రయం.
నేను: నీకు చాలా ఇంటరెస్ట్ ఉందిరా, గుడ్.
సనత్: పాషన్ మామా పాషన్. అది ఉంటే చాలు రా. నీకూ పాషన్ ఉంటే రా లేదంటే వద్దు.
అర్జున్: మరి పల్సర్ ఉంటే రాకూడదా ?

అని బైక్‌ల గురించి చెప్పడంతో సనత్‌గాడికి పట్టపగలే తారే జమీన్ పర్ !!!

కట్ చేస్తే నేను, సనత్ ఫోటోగ్రఫి క్లాస్‌లో వున్నాం. నా ఇంటెన్షన్ ఆ కోర్స్ నేర్చేసుకుందామని కాదు, అస్సలు దీన్ని బిజినెస్‌గా ఎలా నడుపుతారు, అసలేం చెప్తారు, ఎంత మంది వస్తారు, ఆళ్ళ రియాక్షన్‌లు ఏంటి...మొదలగు విషయాలు తెలుసుకోవచ్చు అని జాయిన్ అయ్యాను. ఇంకో ముఖ్య కారణం థీరీ అయ్యాక రెండు సార్లు అవుటింగ్ కూడా వుంటుందని చెప్పడంతో ఇంటరెస్ట్ వచ్చింది.

మొదటి క్లాస్‌లోనే నేను జీవితంలో మరచిపోలేని జెర్క్ వచ్చింది. సదరు మాష్టారు గారిది మామూలు తెలివి కాదు. లెస్సన్ మొదలెట్టాక, 'వాట్ ఈజ్ ఫోటోగ్రఫి ?' అన్నాడు. క్లాస్‌లో వున్న 20 మంది తలా ఏదో ఒకటి చెప్పారు. అవన్నీ బోర్డ్ మీద బ్రీఫ్‌గా రాసాడు. తర్వాత ఒక్కొక్క పాయింట్‌ని టచ్ చేస్తూ అది కరెక్టా కాదా అని డిసైడ్ చేసి టిక్/ఇంటు మార్క్‌లు పెట్టాడు. ఇంటు మార్క్‌లు దాదాపు లేనేలేవు. టిక్ ఉన్న వన్నీ కలిపి చదివి, దిస్ ఈజ్ ఫోటోగ్రఫి అన్నాడు. సో మీకు ఫోటోగ్రఫి వచ్చేసింది అన్నాడు. అందరూ తెగ సంబరపడిపోయారు. నాకు మాత్రం దిమ్మ తిరిగి, 'మనసిచ్చు చూడు ' సినిమాలో ప్రకాష్ రాజ్ గుర్తొచ్చాడు. సర్లే ఏదో మొదటి క్లాస్ కదా అనుకున్నా. కాని అస్సలు మ్యాటర్ తర్వాత అర్థమయ్యింది.

ప్రతి రోజూ, 'వాట్ ఈజ్ లెన్స్ అనో వాట్ ఈజ్ అపర్‌చర్ అనో' బోర్డ్ మీద రాయడం, అందరినీ అభిప్రాయాలు చెప్పమనడం. సహజంగా పబ్లిక్‌లో నోటి దూల ఎక్కువ వున్న వారు ఎక్కువగానే వుంటారు కాబట్టి, మినిమం 5 పాయింట్లన్నా వచ్చేవి. అవ్వన్నీ బోర్డ్ పైన రాసి, టిక్ మార్క్‌లు పెట్టి, ఆ పాయింట్ చెప్పిన వాడు సంతోషపడేలా మిగతా వారు ఓస్ ఇంతేనా నేనింకేమో అనుకున్నా ! అనుకునేలా చేసి పాఠం ముగించేవాడు.

మా సనత్‌గాడు ఆయనకి ప్రియ, పికిల్ లాంటి శిష్యుడు. ముందు రోజే ఈడు నెట్‌లో అన్నీ సెర్చ్ చేసి, పాయింట్లు రెడీ చేసుకుని మాష్టారు గారి దృష్టిలో మెరిట్ స్టూడెంట్ అవ్వాలని తెగ ప్రయత్నం చేసేవాడు. క్లాస్‌లో హై-టెక్కు అమ్మాయిలు కూడా ఉండేవారు. గురువు గారు ఆళ్ల పాయింట్‌కు టిక్ పెట్టగానే 'ఎస్ ఐ గాట్ ఇట్ రైట్....' అని తెగ సంబరపడిపోయేవారు.

మాష్టారు గారు తనకు అవార్డ్‌లు తెచ్చిపెట్టిన చిత్రాలను పవర్‌పాయింట్లో చూపించాడు. చాలా మటుకు గూడిసెలలో అష్ట కష్టాలు పడుతున్న వారి లైఫ్ కు సంబందించినవే. కాని అవి ప్లే చేస్తున్నంత సేపు అందరు...అవి అవార్డ్‌లు తెచ్చిపెట్టే ఫోటోస్ లాగే చూసారు కాని కొంచం కూడా మానవత్వం చూపించలేదు.

ఇలా క్లాసులు సాగుతూ ప్రాక్టికల్స్ అని అవుటింగ్ తీసుకెళ్లారు. సిటికి దగ్గర్లోని ఫారెస్ట్ ఏరియాకు ఎళ్తున్న దారిలో అక్కడక్కడా ఆపుతూ ఫోటోస్ తీసుకుంటూ వెళ్ళాం. మా సనత్ గాడి అస్సలు టేస్టేంటో అప్పుడే తెలిసింది. బర్రె గొడ్డు కనిపించడం ఆలస్యం తెగ ఉత్సాహం వచ్చేది వాడికి. ఆడి దృష్టిలో అది బర్రె గొడ్డు కాదు బర్రె good-u.

నాకు మాత్రం ఒక పైపును చూడగానే అవిడియా వచ్చి, మా సనత్ గాడిని పైపుకి అవతల తల పెట్టి నిల్చోమని చెప్పి ఆపోజిట్ ఎండ్ నుంచి పైప్‌లోకి కెమెరా పెట్టి తీసా. ఇలా కొంచం వెరైటీ గానే ఫోటోస్ తీసుకోగలిగాను. కాని బెస్ట్ ఫోటో మాత్రం మా బ్యాచ్‌లో ఒక హై-టెక్కు అమ్మాయిని కుక్క వెంటపడుతుండగా తీసినది.

నెక్స్ట్ అవుటింగ్ దుర్గం చెరువులో జరిగింది. అక్కడ నీళ్ళల్లో బాతులు అప్పుడే బాతింగ్‌కు వచ్చినట్టున్నయి చాలా సరదాగా వున్నాయి.
అంతలోనే సనత్‌గాడు వచ్చి: నీకు అరవం తెలుసా ?
నేను: అరవడం తెలుసు.
ఆడు: అది కాడు బే ఇందాక తమిళ్ అతను నా ఫోటోలు చూస్తూ..ఏదో అనుకుంటూ వెళ్లాడు. సర్లే ఈ బాతును చూడు భలే తీసాలే...

అని చూపిస్తే షాక్ అయ్యి...అ 'బ్బా తూ'....అది కాకి రా కుఫ్లీగా, అని చెప్పడంతో, అవునా అని వాడి మైండ్ బ్లాక్ అయ్యింది. ఏదో జూం లెన్స్ వాడి మొత్తానికి జూం బరా బర్ జూం చేసాడు.

నేను అది మొదటి సారి దుర్గం చెరువును విజిట్ చెయ్యడం. ఇంత బిజీ సిటీలో సీక్రెట్ లేక్‌గా భలే అడ్వెంచరస్‌గా వుంది. అలా అలా లో లో పలికి వెల్లిపోగా చూసుకుంటే అందరికీ చాలా దూరంగా ఎల్లిపోయా. అప్పుడు అనూహ్యంగా ఒక నాచురల్ నెమలిని చూసా. ఇంకా కొండల్లోపలికి వెల్లే ధైర్యం చెయ్యలేకపోయా. తిరిగి వచ్చేటప్పుడు ఒక మంగూస్‌ను చూసా. అమ్మో ఇది వుంటే నియర్ బై పాము గాని వుంటుందా అని భయమేసింది. ఆ తొక్కలే యే ముంటుంది అని త్వరగా వెళ్లాలని బయలుదేరగా, అప్పటివరకు జలకాలాడుతున్న ఆవుల మంద అప్పుడే రోడ్‌పైకి వచ్చి చాలా బద్ధకంగా కదులుతున్నాయి. అందులో ఒకటి నన్నే చూస్తోంది. నేనేం రెడ్ షర్ట్ వేసుకోలేదే అని దానికి చెప్దామని ట్రై చేసా కాని అది నా వైపే సీరియాస్‌గా చూస్తుంటే దడుసుకుని చచ్చా. మళ్లీ బ్యాక్ వెల్దామంటే మంగూస్ భయం. ముందు మంద వెనక మంగూస్ అంటే ఇదేనేమో అనుకున్నా.

ఆ సమయంలో ఆవు సాధు జంతువు కాదు, సాధించే జంతువు అనిపించింది.ఎలాగో ధైర్యం తెచ్చుకుని ఒక పెద్ద బండ రాయి వుంటే ఆవుతో దొంగా పోలిస్ గేమ్ ఆడి అది వెళ్లిపోవడంతో హమ్మయ్య అనుకుని మళ్లీ ట్రాక్ మీదకు రాగానే ఒక కొండ ముచ్చు హాయ్ అంది. మొదట్లో భయపడి చచ్చా కాని అది చాలా కాజువల్‌గా వుండడంతో ఫ్రెండ్‌గా ఫీల్ ఐనట్టుంది థాంక్స్ అనుకుని నెక్స్ట్ స్టెప్ వెయ్యబోయాను అంతే రైట్ సైడ్ చాలా పెద్ద పాము నేను చూస్తుండగానే వెళ్లింది. లైఫ్‌లో ఎన్నో సార్లు పుట్టల దగ్గర...etc పోతుంటే పాముంటుందేమో అని భయపడుతూ వెళ్లిన నేను ఫస్ట్ టైం లైవ్‌గా ఆలాంటి సిటుయేషన్‌లో చూడగానే గుండె గూడ్స్ రైలు అయ్యింది. నెక్స్ట్ సెకండ్‌లో నాకు తెలియకుండానే పరిగెత్తడం స్టార్ట్ చేసా. వామ్మో ఈ రోజేదో రంగు పడేట్టుందే అనుకుంటుండగా ఒక విచిత్రమైన జంతువు రైట్ సైడ్ కొండపైన నుంచి నా ముందుగా వచ్చి వెళుతూ వెళుతూ టక్కున ఆగి నా వైపు ఒక లుక్ ఇచ్చింది. నాకు వెంటనే జంగిల్ బుక్ గుర్తొచ్చింది. అందులో మోగ్లి భుజం మీద ఎత్తుకునే జంతువు అది. అప్పటి నాపరిస్థితికి ఎంత అగ్లీగా తయారయినా మరీ మోగ్లీలా వున్నానా అనిపించింది. దాన్ని ఇంకొంచం అబ్సర్వ్ చేసే చ్యాన్స్ ఇవ్వకుండ బుషెస్‌లోకి వెళ్లిపోయింది. అలా రన్నింగ్ చేసుకుంటూనే మా బాట్చ్‌మేట్స్ దగ్గరకు వచ్చాను.

జరిగిన విషయాన్ని, పాము...కొమ్ములు.....నెమలి....జంగిల్ బుక్...తోక...ఆవు... ఇలా కట్ కట్‌గా ఆయాసపడుతూ చెప్పగా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకుండా నన్ను ఫోటోలు తీసుకుంటున్నారు. మీ కెమరాలకు కామెర్లు రాను, ఓరి బాబు నమ్మండ్రా నిజంగా చూసాను అనగానే ఒక్కడు కూడా జాలిపడకుండా, పాము కనిపించిందా ఐతే ఫోటో తీసావా ? అన్నారు.

నాకు నోట మాట రాక, 'మౌనం గానే ఉండమని మార్నింగ్ నీకు చెబుతోంది, తిరిగే కొద్ది తిప్పలని అర్థమందులో ఉంది ' అని మాంటేజ్ సాంగ్ పాడుకుంటూ...ఇంటికొచ్చి పడుకున్నా.

18-జనవరి-2009
లప్పంగిరిగిరి - 6
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!


* ఆదివారం అంతా 'నిద్రో నిద్రతి నిద్రితః ' ఫిలాసఫి ఫాలో అయ్యాక, ఒక ముఖ్యమైన మెయిల్ రావాలి, వచ్చిందా అని gmail ఓపన్ చేసాను. మొదటి మెయిల్ క్లాస్‌మేట్ శ్రీవిద్యది. చాలా రోజులకు గుర్తొచ్చానేమిటబ్బా అని ఓపన్ చేస్తే, ఏదో లింక్ వుంది. అది ఏంటా అని చూస్తే...

మీ క్రష్‌ల పేరు చెబితే చాలు లవ్ మీటర్, వారు మీరంటే ఎంత మోతాదులో చెవులు,జుట్టు కోసేసుకుంటారో ఒక ప్రూవెన్ మ్యాథమెటికల్ ఫార్ములా ప్రకారం క్యాల్‌కులేట్ చేసి చెవులు, జుట్టు కత్తిరించి చూపిస్తాం అన్న లెవెల్లో మ్యాటర్ వుంది.

కుశలప్రశ్నలు వెయ్యకుండా క్రష్‌ల ప్రశ్నలు వేసిందేమిటబ్బా అనుకుంటూ సరే కానీ అని:

1. తెలంగాణ శకుంతల
2. పావలా శ్యామల (వర్షం సినిమాలో త్రిష అమ్మమ్మ)
3. తెలంగాణ శ్యామల ఆర్ పావలా శకుంతల

అని టైప్ చేసి సబ్‌మిట్ కొట్టగానే

Oops హేయ్ (బ్యాక్‌గ్రౌండ్‌లో చప్పట్లు) నువ్వు మోసపోయావ్, నీ బతుకు క్రష్‌లు చింపిన విస్తరయ్యింది, నువ్వు పప్పులో కాలేసావ్, చారులో చెయ్యేసావ్, ఉప్పులో పెరుగేసావ్...నీ సీక్రెట్స్ అన్నీ శ్రీవిద్యకు తెలిసిపోయాయోచ్ అన్న రేంజ్‌లో యానిమేషన్ బొమ్మ ఎగురుతూ చెప్పింది.

ఇప్పటివరకు శ్రీవిద్య నుంచి రిప్లయ్ రాలేదు.

* రెండో మెయిల్ Dr. Ahmed ALSAGA నుండి వచ్చింది. ఈడెవడా అని చూస్తే, వెస్ట్ ఆఫ్రికాలో వేస్ట్ ఫెలో అని తెలిసింది. ఈయన గారు ఒక బిజినెస్ ప్రపోజల్ పెట్టారు. తను బ్యాంక్ ఆఫీసర్ అంట. 2000లో ఒక ఫామిలీ మొత్తం ప్లేన్ క్రాష్‌లో చనిపోయారంట. కావాలంటే చెక్ చేసుకో అని BBC వెబ్‌సైట్ న్యూస్ లింక్ ఇచ్చాడు. ఆ కుటుంబ పెద్దమనిషి అకౌంట్‌లో డబ్బులు అలానే వుండిపోయాయంట. దాన్ని దొబ్బేద్దామా ? అన్నది తన అవిడియా. 55:35 రేషియోలో పంచుకుందాం, 10% ఖర్చులకు ఓకేనా ? ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని, లైవ్‌గా ఐతే చెయ్యి మూతి దగ్గర పెట్టి మెల్లగా చెప్తారు కదా అలా ఈడు బ్రాకెట్లు వేసి చెప్పాడు.

అస్సలు యాడ్నుంచి వస్తార్రా మీరంతా ! అనుకున్నా. ఈడి పేరుని ALSAGA అని కాకుండా ALL SEGA అని పలకాలేమో అనిపించింది. ఈ-మెయిల్‌ని స్పామ్ అని మార్క్ చేస్తుండగా 2004లో జరిగిన విషయం గుర్తొచ్చింది.

ఇప్పుడంటే సిక్స్ పాక్ బ్రెయిన్ వుంది కాని అప్పట్లో చాలా అండర్ వెయిట్. ఒక రోజు సుముహుర్తానికి, దుర్ముహుర్తానికి అటు ఇటుగా ఉన్న సమయంలో సురేష్ గాడు కాల్ చేసాడు. ఈడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎవరన్నా జీవితంలో సుఖ సంతోషాలు ప్రసాదించు దేవుడా అని మొక్కుకుంటారు గాని ఈడి పేరంట్స్ మాత్రం తెలివిగా సుడిని ప్రసాదించు దేవా అని మొక్కుకున్నాక పుట్టాడంట. అందుకే ఈడ్ని మేమంతా సురేష్ అని కాకుండా, సుడేష్ అని పిలుస్తుంటాం.

EAMCET ఎగ్జాంలో మేమంతా నానా ఫార్ములాల వెంటపడి ఫిజిక్స్‌లో (16,17)/50 సాధిస్తే, ఈడు వున్న టైం అంతా మ్యాథ్స్ చేసి చివర్లో టైం లేదని ఫిజిక్స్ బిట్లన్నింటికీ B ఆప్షన్ పెట్టేసి 19/50 సంపాదించాడు.

చాలా గ్యాప్ తర్వత కాల్ చేసిన వీడు:

నీకో ముఖ్య విషయం చెప్పాలి. ఎవరికీ చెప్పకురా....

నేను: కొంపదీసి ఎవరన్నా అమ్మాయి తగిలిందా ? ఈ లవ్ మారేజ్‌లు అవి నా వల్ల కాదు బాబొయ్. కావాలంటే స్క్రీన్‌ప్లే రాయగలను, డైరక్షన్-ప్రొడ్యూసర్-ప్రేక్షకులను నువ్వే చూసుకో...ఇంతకి ఆ అమ్మాయి ఎవరు ?

ఆడు: అహెయ్ తగిలింది అమ్మాయి కాదు, లాటరీ కోటి రుపాయలు

(నేను మూర్చపోయినంత పనైయ్యింది. ఆడికి లాటరీ తగిలినందుకు కాదు. కోటి రుపాయల లాటరీ తగిలితే ఎవరికీ చెప్పకుండ నా మీద నమ్మకం ఉంచి చెప్పినందుకు. 'రాజా' సినిమా క్లైమాక్స్‌లో వెంకీ మెలికలు తిరిగినట్టు...తిరిగిపోయా..మధ్యలో..ఎస్.ఏ.రాజ్ కుమార్ ఆల్ టైం సెంటి ట్యూన్ల బ్యాక్‌గ్రౌండ్‌లో 'రే...రే...' అని నేను అంటుంటే...)

ఆడు: అప్పుడెప్పుడో రెడిఫ్ మెయిల్‌లో USలో ఉండే కృష్ణాగాడు ఏదో పంపిస్తే ఫిల్ చేసి పంపించారా. దానికి తగిలింది. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావాట్లేదు. ఎవడిదో నంబర్ ఇచ్చి కాల్ చెయ్యమన్నారు.

నేను: వావ్...నువ్వు దీపావళి అప్పుడు లక్ష్మీ టపాకాయలు ఎక్కువ కలుస్తావు కదూ...అందుకేనేమో అబ్రాడ్‌లో వున్నా లక్ష్మీ దేవి గుర్తుపెట్టుకుని కరుణించింది. KBC కోటీశ్వరుడు హర్షవర్ధన్ నవాటే తర్వాత నీవంతే. ట్యాక్స్‌లు పోను మినిమం అరవై లక్షలు వస్తాయిరా. రోజుకి మూడు పూటలే తింటే ఆరు తరాలు బ్రతికెయ్యొచ్చేమో. నువ్వు నిజంగా సుడేష్ మామా సుడేష్. ఐతే ఇంకేముంది ఆడికి కాల్ చెసెయ్.

ఆడు: మనకంత సీన్‌లేకే కదా నీకు ఫోన్ చేసింది. ప్లీజ్‌రా హెల్ప్ చెయ్యి....
నేను: ఇక మీదట నేను చూసుకుంటా కదా....
(ఆల్రెడి ఈడి ఫోటోని పేపర్‌లో ఊహించుకుంటూ, ఈడిచ్చే ఇంటర్‌వ్యూల్లో ఫ్రెండ్స్ లిస్ట్లో ఫస్ట్ పేరుగా నాది చూసూకుంటూ మురిసిపోయాను. మనం ఇప్పుడే కలుద్దామన్నాను. ఆడు వెంటనే వచ్చాడు. ఇద్దరం కలిసి ఇంటర్నట్ సెంటర్‌కెళ్లాం. ఆడి మెయిల్ ఓఫెన్ చేసి చూపించాడు.)

నేను: రెయ్ ఇదే మనకు ప్రూఫ్. బంధువులకు గాని రిలేటివ్స్‌కు గాని....

ఆడు: (చిన్న గా నవ్వి...) ఇద్దరు ఒకటే కదరా....?

నేను: ఇదిగో అసలే నేను ఎగ్జైట్మెంట్లో వున్నా నన్ను డిస్టర్బ్ సెయ్యకు. సో బంధువులకు గాని, నాకు తెలియకుండా నీకు పెళ్లైయుంటే నీ నాక్ తెలియని వైఫ్‌కు గానీ, ఎవ్వరికీ దీని గురించి చెప్పకు. ఇప్పుడే ప్రింట్ అవుట్ తీసిపెట్టుకుందాం.

(అని ప్రింట్ అవుట్ తీస్తున్నప్పుడు ఆ నెట్ సెంటర్ వాడి దృష్టి దీని మీద ఎక్కడ పడుతుందా అని...
నేను: బాసు, CD లోని మాటర్ అంతా floppyలోకి రావాలంటే ఏం చెయ్యాలి ?
(ప్రింట్ బటన్ నొక్కిన వాడు, ఒక్కసారి షాక్ అయ్యి నన్ను పైకి కిందకి చూసి...)
నెట్ సెంటర్ వాడు: ఇంకో CD తీసుకుని, కాపీ చేసుకుని దాన్ని floppy అనాలి.

ప్రింట్ అవుతున్న ప్రింట్ అవుట్ దిక్కు చూస్తున్న నేను షాక్ అయ్యి ఆడి దిక్కు చూసా. సర్దుకుని వెంటనే ప్రింటవుట్ తీసేసుకున్నా. అందులో UK లాటరీ వాడు, మలేషియా వాడి అడ్రెస్ ఇచ్చి ఫోన్ నంబర్ ఇచ్చాడు. అది ట్రై చేస్తే కనెక్ట్ కాలేదు. మా సుడేష్ గాడి మొహంలో తుఫాను తాకిడికి వరదలు ముంచుకొస్తున్నాయి. ఇలాంటప్పుడే చాలా షార్ప్‌గా ఆలోచించాలి అనీ, ఇంతకీ మలేషియా కన్‌ట్రి కోడ్ ఎంత బాసు అని నెట్ సెంటర్ వాడి నడిగితే నాకేం తెలుసు అని వాడన్నాడు. సుడేష్ గాడి కుడి కన్నులో గండి పడింది. కంట్రోల్ మామా కంట్రోల్ అని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా గూగుల్ స్క్రీన్ కనిపించింది. ఛ ఇది వుండగా ఇంత సేపు ఆలోచిస్తున్నామేంట్రా అని గూగుల్‌లో సెర్చ్ చేసి ఆడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసాడు. అదేదో ఉర్దోరబిక్‌హింగ్లిష్‌లో మాట్లాడాడు. కంగ్రాట్స్ అని చెప్పి, స్టాంప్ డ్యూటి/ట్యాక్స్‌ల పేర్లు ఏవో చెప్పి 20,000 ఫస్ట్ పంపిస్తే ఆ తర్వాత మీకు డబ్బు ఏరొప్లేయిన్‌లో గావాల్నా/ షిప్‌లో గావాల్నా...అని సెప్తుంటే కృష్ణ భగవానుడు (కమెడియన్-వెంకీ సినిమాలో) గుర్తొచ్చాడు.

అమ్మో అమ్మో ఇందులో ఏదో తిరకాసు వుందని ఫస్ట్ టైం అప్పుడూ లైట్ ఎలిగింది. మల్లీ గూగుల్ స్క్రీన్ కనపడడంతో వెంటనే నేను ఆ మలేషియా వాడి పేరు కొట్టా అంతే, 0.1 సెకండ్స్లో పది లక్షల రిజల్ట్స్ వచ్చాయి. మీ భగవాన్ ఒక Rs 4,20,420 నోటు అని రక రకాలుగా తిడుతూ ఆడు దొరికితే కుమ్మెయ్యండి అని అందరి అరుపులు కనిపించాయి.

సుడేష్ గాడు, నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఏం మాట్లాడకుండా వుండిపోయాం.
కాసేపటికి తేరుకున్న నేను, " మామా నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు నేనూ ఎవ్వరికీ చెప్పను. ఇలాంటివన్నీ నమ్మకూడదురా, స్వశక్తితోనే మన స్లిప్పర్స్ పైన మనం నిలబడాలి", అన్నాను.

ఇంకొంచం ప్రొసీడ్ అయ్యుంటే యే రేంజ్ బకరాలయ్యుండే వాళ్లమో తలుచుకుని మూర్ఖంగా ఇరుకున్నందుకు ఏడ్వాలో, తెలివిగా బయటపడినందుకు ఆనందించాలో అర్థం కాని విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్‌తో అక్కడనుంచి వెళ్లిపోయాం.

అప్పటి నుంచి గూగుల్‌కు సంబందించిన వార్తయినా గూగుల్‌లో వెతికి కన్‌ఫర్మ్ చేసుకోనిదే నేను ఏదీ నమ్మడం లేదు. అద్గదీ సంగతి.

మొత్తానికి ఈ రోజు పొద్దున్న లేస్తూనే దావూద్ ఇబ్రహీం ఫోటో ఏమన్నా చూసానా అని డవుట్ వచ్చి మళ్లీ పడుకున్నా.

17-జనవరి-2009
లప్పంగిరిగిరి - 5
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* "wazz up" అని SMS రావడంతో రోజు మొదలయ్యింది. roof అని బదులిచ్చా. తరువాత రిప్లయ్ రాలేదు. చాలారోజులనుంచి 'వీకెండోఫోబియా' పట్టుకుంది. శుక్రవారం సాయంత్రం, 'వీకెండ్ కదా ఏంటి ప్లాన్స్ ?' అనీ, శనివారం-ఆదివారం, 'వీకెండ్ కదా ఏం చేస్తున్నావ్ ?' అనీ, సోమవారం పొద్దున్న, 'వీకెండ్ అంతా బాగా ఎంజాయ్ చేసావా ?' అనీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అంటుకున్న రోగం ఇది.

ఈ సారి ఎలా బయట పడదామా అని అనుకుంటూ సినిమా కెళ్లాలని డిసైడ్ అయ్యా. 'మస్కా'కు దగ్గర్లోని 'బిగ్' బజార్‌లోని గోల్డ్‌స్పాట్‌లో ఆన్‌లైన్ టికట్స్ ఉండడంతో వెంటనే తీసుకున్నా. ఎళ్ళగానే ఫస్ట్ జెర్క్ పార్కింగ్ రూపంలో తగిలింది. అత్యంత రద్దీగా ఉండే అమీర్‌పేట్‌కు ఎప్పుడైనా వెళ్తే బిగ్ బజార్ పార్కింగ్‌ను వాడుకోండి, O.C గా చాలా భద్రంగా వుంటుంది అని చాలా మందికి సలహాలిచ్చిన నాకు తాటి కాయ బాంబ్ పేలింది. తాటి కాయంత అక్షరాలతో, డిసెంబర్ నుంచి పార్కింగ్ ఫీ కలెక్ట్ చేస్తున్నాం అని ఉంది. ఫ్రీ గా వస్తే ఫెవికాల్‌నైనా చపాతిలోకి నంజుకుని తినే మిత్రబృందానికి ఈ విషాద వార్త ఎలా చెప్పాలా అని బాధపడ్డా.

టికట్ కౌంటర్‌కు రాగానే మరో షాక్. 'బిగ్' బ్రాండ్‌ను బాగా ఫోకస్ చేసే రిలయన్స్ వారు బిగ్-పొడవు-లాంగ్ క్యూ ఉండేట్టు బాగా జాగ్రత్తలు తీసుకున్నారనిపించింది. ఉన్న మూడు కౌంటర్‌లలో ఒకటి పని చేయకుండా పెట్టి బోరింగ్ దగ్గర నీళ్ళకోసం ఆంటీలు వేయిట్ చేసే మాదిరి సీన్ సృష్టించగలిగారు.

చాలామందిలాగే నాకు వెయిటింగ్ వాసన పడదు. సరే ఈ సారికి అడ్జస్ట్ అవుదాం అనుకుని, 'టైం రా టైం' అనుకుంటుంటే ఎవడో ఎనకనుంచి 11:30 అయ్యింది అన్నాడు. ఎనక్కు తిరిగి, తిరిగి కౌంటర్ ఇచ్చే మూడ్ కూడా లేకున్నింది. ఎందుకింత లేట్ అవుతోందా అని గమనిస్తే, 'మనకొచ్చిన కన్‌ఫర్మేషన్ SMS/ప్రింట్ అవుట్ చూపించాక, క్రెడిట్ కార్డ్ అడుగుతారు, అది వెరిఫై చేసాక, ఒక ఫారం ఫుల్‌గా ఫిల్ చేసి సంతకం పెట్టమని మనకు ఇస్తారు ' ఇవన్నీ విజయవంతంగా పూర్తయితేనే టికట్ చేతులోకివస్తుంది. ఈ 'బిగ్' ప్రొసీజర్ చూసి, 'ఛీ మా బతుకు, చీమ బతుకు అయ్యింది ' అనుకుని మొత్తానికి థియేటర్ ఏంట్రన్స్ వరకు వెళ్ళిపోయా.

వరసగా నిల్చున్న 5 మంది సెక్యూరిటీ వాళ్ళను చూసి సర్‌ప్రైజ్ అయ్యా. ఒక హిందీ మీడియం సెక్యూరిటి గార్డు చెతులు పైకెత్తమని సిగ్నల్ ఇవ్వడంతో అలానే చేసా. చెక్ చేస్తూ చేస్తూ నడుము దగ్గరకు రాగానే హిందీ, మీడియంగా మాత్రమే తెలిసిన నేను 'నో......ముఝె చక్కిలిగిలిగిలి హై' అని గట్టిగా అరిచా.

ఆడు: "క్యా సాబ్" అన్నాడు. నాకు ఆ టైంలో,

'కసబ్' అన్నాడనిపించి బెంబేలెత్తిపోయా. అలా అరవడం వల్ల టెర్రరిస్ట్ కసబ్ తో పోలుస్తున్నారని డవుట్ వచ్చింది. ఈ సారి 'నో....నహి...నో...నహీ' అని దీనికి బదులిచ్చా. ఆడు మళ్లీ, 'క్యా సాబ్...క్యా హువా' అనగానే విషయం అర్థమయ్యి కాస్త హవా వచ్చింది. తేరుకుని ఆడికి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యడానికి ట్రై చేసా.

"ముఝే ఇధర్ ఉధర్ టచ్ కర్నే సే.....కుచ్ కుచ్ హోతా హై "

అనగానే అందరూ నవ్వారు. నన్ను ఇంక చెక్ చెయ్యకుండానే వదిలేసారు. సో ఫ్యూచర్‌లో తీవ్రవాది ఐతే ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది అని అవిడియాను ఫోన్‌లో రికార్డ్ చేసుకుని పెట్టుకున్నా. ఎందుకంటే మనం గజ-గజని కాబట్టి.

నా సీట్ కరెక్ట్‌గా జంట జంటల మధ్య పడింది. ఇద్దరు జంటల ముద్దుల స్త్రేన్‌జరయ్యానన్నమాట అనుకున్నా. సినిమా మొదలయినప్పుడు అంతా బానే వున్నారు. ఫస్ట్ ఫైట్ స్టార్ట్ అయ్యాక, రౌడీ తల మీద బిందె పెట్టి హీరో కొట్టే సీన్‌కు నా కుడి పక్కనోడు ఎగిరెగిరి నవ్వుతుండడం చూసి షాక్ అయ్యా. కొన్ని వేల సినిమాల్లో అలాంటి సీన్ వున్నా ఇంకా ఎందుకు పెడుతున్నారా అన్న నా చిరకాల డవుట్ క్లారిఫై అయ్యింది. ఎవడ్రా డైనాసర్‌లు అంతరించిందన్నోడు అనిపించింది ఆ జంటను చూసి. ఈడేమో నవ్వాసురుడిలా వున్నాడు, ఆయన వైఫ్ ఏమో హిడింబీకి అక్కలా, హీ-మాన్‌కు చెల్లెలుగా వుంది. ఆమె మాత్రం డ్యూయట్ సాంగ్స్ అప్పుడు మాత్రమే భర్తతో కలిసి నవ్వేది. ఇలాంటి పాటలకు కూడా నవ్వొచ్చు అని మొదటసారి అనిపించింది. మొదట్లో 'ఓరినీ నోట్లో 'నో లాఫింగ్' బోర్డ్ పెట్టా ' అని అరవాలనిపించినా, సీరియస్ సీన్లలోకూడా, ముఖ్యంగా హన్సిక ఏడ్చే ప్రతి సీన్‌లోను నా పక్కనోడు విరగబడి నవ్వుతుండడం చూస్తూ నేనూ నవ్వుకున్నా. మొత్తానికి మస్కా సినిమాను ఈ మస్కిటో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో చూడాల్సి వచ్చింది. AC బదులు దోమల మందు వదిలితే నాలాంటి ప్రేక్షకులు సేవ్ అవుతారని థియేటర్ వాళ్ళకు సలహా కూడా ఇవ్వాలనిపించింది.

నా లెఫ్ట్ సైడ్ ఒక జంట ఉందన్న విషయమే మర్చిపోయాను, అంత సైలెంట్‌గా వున్నారు. రైట్ సైడ్ మాత్రం చాలా వైలెంట్‌గా వున్నారు. దేవుడున్నాడనిపించింది. లెఫ్ట్ సైడ్ చూసి, 'ఎక్స్ క్యూజ్ మీ, మీరు బ్రతికే వున్నారా ? అనీ, రైట్ సైడ్ చూసి 'ఎక్స్ క్యూజ్ మీ, మీరు ఎప్పుడు పోతారు ? అనీ అడగాలనిపించింది. నాకెందుకులే అని భయపడుతూ బయటపడ్డా.

ఒకటి-రెండు ఫ్లోర్స్ దిగగానే ఫుడ్ బజార్ చూసి ఫ్లాష్ బాక్ గుర్తొచ్చింది. ఒక సారి మిట్ట-సాయంత్రం ఇక్కడకు షాపింగ్‌కు వచ్చాను. మొత్తం తిరగగా తిరగగా కాసేపటికి కళ్ళు తిరిగాయి. ఏదన్న శీతలపానీయం తీసుకుందామని ఫుడ్ బజార్ ఫ్లోర్‌కు వస్తే, బిల్ కౌంటర్‌లో ప్యాసెంజర్ రైల్ అంత క్యూ ఉంది. కోక్ టిన్ కనబడటంతో తీసుకున్నా కాని అక్కడ ఎవరు స్టాఫ్ లేకుండడంతో దాన్ని పట్టుకుని క్యూలో నిల్చున్నా. రైలు గంటకు 0.000000000001 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుండడంతో నా వల్ల కాదని కోక్ టిన్ ఓపెన్ చేసి తాగడం స్టార్ట్ చేసా. టిన్ పూర్తయింది కాని క్యూ అలాగే వుంది, ఇంకా ఓపికగా వుంటే ఓ.ఫి వార్డ్‌కు వెళ్ళాల్సి వస్తుందని వెళ్ళిపోయా.

నేను చేసిన ఈ ద్రోహం నాకు ఫ్లాష్ బ్యాక్ రూపంలో గుచ్చి గుచ్చి చంపింది. ఒక కోక్ టిన్ నేను రిలయన్స్ వారికి రుణపడిపోయానే అని బాధపడ్డా, వెంటనే ఒక కోక్ టిన్ కొని టాప్ ఫ్లోర్ కెళ్లి ఆ బిల్డింగ్‌కి కోకాకిభిషేకం చెయ్యాలనిపించింది. కాని అలా చేస్తే ప్రదీప్ రావత్‌కు పోలియో చుక్కలు ఏసినట్టుంటుంది అని లైట్ తీసుకున్నా.

* మా ఇంటి కాంపౌండ్ దగ్గరకు రాగానే ఒక బృహత్తరమైన ట్యూన్ మైండ్‌లోకి వచ్చింది. దానికి రాన్‌డం లిరిక్స్ యాడ్ చేసి, 'నిన్నే నేను చూడాలి..ఏదో నీకు చెప్పాలి ' అని పాడుకుంటూ, చేత్తో తాలం వేసుకుంటూ, ఇంటి తాళం తీద్దామని అనుకుంటుండగా మన గజ-గజిని విషయం గుర్తొచ్చి, ట్యూన్ మర్చిపోతాం అని ఫోన్‌లో రికార్డర్ ఆన్ చేసి పాడుతుంటే, మా ఈదిలో వుండే పుట్టు-గజ్జి కుక్క ఆజ్ యూజువల్‌గా మొరగడం స్టార్ట్ చేసింది. అయినా సరే ట్యూన్ మర్చిపోతానేమో అని అలాగే పాడి రికార్డ్ చేసుకుని తర్వాత విని జడుసుకున్నా, "నిన్నే నేను చూడాలి...బౌ..బౌ...నీతో ఏదో చెప్పాలి...బౌ..బౌ" అని కుక్క గారి ఫెర్‌ఫెక్ట్ కోరస్‌తో రికార్డ్ అయ్యింది. మొదట్లో భయపడ్డా ఈ ప్రయోగం సినిమాల్లో కూడా చెయ్యొచ్చు కదా అనిపించింది. కుక్కలు, పిల్లులు...ఇలాంటీ వాటితో కోరస్ పాడిస్తే కొక్కొరొక్కే !!!

16-జనవరి-2009
లప్పంగిరిగిరి - 4
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* 'అరుంధతి..తి..తి..తి..తి..(echo).......కల కల కల కల ' అని ' చంద్రముఖారుంధతి ' combo కల రావడంతో ఉలిక్కిపడిలేచాను. గత మూడు నాలుగు రోజులనుంచి ఎక్కడ చూసినా అరుంధతి డిస్కషనే. అనుష్కాకి ఇంత మంది ఫ్యాన్స్ వున్నారా అని ఆశ్చర్యమేసింది. సినిమా రిలీజ్ రెండు రోజులు పోస్ట్ పోన్ అవ్వడంతో ఇంకా ఎక్కువ వాకబులు వినాల్సి వచ్చింది. ట్రెయిలర్స్ చూసి చాలా మంది మెస్మెరైజ్ అయినట్టున్నారు. నేను ఇంత వరకు చూడకపోయినా ఆళ్ళ వల్ల ఇలాంటి కల వచ్చింది. ఆపీస్‌కు రాగానే, మళ్ళీ అరుంధతి డిస్కషన్ మొదలయ్యింది. ఈ గోలంతా వింటున్న నానాంధ్రులలో (నాన్-ఆంధ్రులు) ఒకతను - 'ఇదేమన్నా అరుంధతి రాయ్ ఇన్స్‌పైర్డ్ స్టోరి నా ? అని డవుట్ అడగగా భలే నవ్వొచ్చింది, అవునూ తన స్టోరిని కూడా సినిమాగా తీయొచ్చొన్న ఆలోచనకూడా వచ్చింది. ఆపీస్ అయ్యాక సాయంత్రం మిత్ర బృందంతో వుండగా ఒక సొ సొ గా తెలుగు తెలిసిన సొగ్గాడు, సోదిగాడు అప్పుడే వచ్చి 'ఎస్ దిస్ అరుణ్ ఈజ్ ఇన్‌డీడ్ వెరీ వెరీ అతి ' అనగానే ఒక సెకండ్ ఎవరికీ అర్థం కాలే. తర్వాత బల్బ్ ఎలిగింది, మా ఫ్రెండ్ ఒకడు అరుణ్ అని వున్నాడు. మేము 'అరుంధతి...అరుంధతి ' అని మాట్లాడుతుండగా ఎంటర్ అయిన వాడు, 'అరుణ్...అతి, అరుణ్...అతి ' అనుకున్నాడంట.

ఇది తెలిసి నేను, 'ఓరినీ పెంట మైండ్‌లో పెంటియం ప్రాసెసర్ పెట్టా....' అని నా నోటికి స్నాక్స్ తినిపించా.

మొత్తానికి అరుంధతికి టూ మచ్ హిట్ టాక్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో తెలుగు టపా రాయడానికే ఓపిక లేకుంటుంటే అలాంటిది ఇలాంటి తెలుగు సినిమా తీయడానికి శ్యాం ప్రసాద్ రెడ్డి గారు చూపిన చొరవ, సాహసం, ఓపిక, నమ్మకం ఇంకా ఇలాంటి మంచి క్వాలిటీస్ ఎన్ని వర్తిస్తే అవన్నీ నిజంగా అభినందనీయం. ఈ సినిమాను బాగా ఇగ్నోర్ చేసిన నేను ఇప్పుడు, 'నిజమే ఏ 'ప్రింట్' లో ఏ పాము వుందో ఎవరికి తెలుసు ' అని అనుకుని పశ్చాత్తాపడుతున్నా.
అర్జెంట్‌గా ఈ సినిమా చూడాలని నాలోని దెయ్యం కూడా ఉవ్విళ్లూరుతోంది.
* ఏదో పని చేసుకుంటుంటే మా ఫ్రెండ్ బాబ్జి గాడి నుంచి ఫోన్ వచ్చింది. అమ్మో వీడా అని కట్ చెయ్యలేదు, ఎందుకంటే తెలిసిపోతుందని. అలా రెండు సార్లు వచ్చి ఆ తర్వాత రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా. అప్పుడే ఏదో కొత్త నంబర్ నుంచి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసా, చూస్తే మా బాబ్జిగాడే.
ఆడు: నాకు తెలుసు మామా నువ్వు ఇలా చేస్తావనీ....
నేను: (వార్ని....అని మనసులో) వార్నర్ బ్రదర్స్‌కు పరిచయం చెయ్యాల్సిన వ్యక్తివిరా నువ్వు...
ఆడు: ఈ పొగడ్తలకేం కాని...నీకు తెలిసిన డాక్టర్‌లు ఎవరన్నా ఉన్నారా ?
నేను: యే....? చిన్నప్పుడు టీకాలు ఏసుకోలేదా...మా ఈధిలో ఏస్తున్నారు వచ్చెయ్
ఆడు: టీ..కాఫీ లకే దిక్కులేదు, ఇంక టీకాలు కూడానా ? ఏమిలేదు....అప్పిచ్చు వాడు వైద్యుడు కదా అందుకు
నేను: మరి అప్పిప్పిచ్చువాడూ ?
ఆడు: స్తెథస్కోప్ అనుకోరాదే...పేషంట్ హార్ట్‌బీట్ తెలుసుకుని యాజ్ ఇట్ ఈజ్‌గా డాక్టర్ చెవులో ఊదేవాడనుకో...
నేను: అయినా డాక్టర్‌లు...అప్పు అది B.C కాలంలో కదరా ?
ఆడు: ఈ O.C కాలంలో కూడా ఆళ్ళే బెస్ట్‌రా బాబు..
నేను: (అమ్మో వీడు చాలా ఫ్లోలో వున్నాడు...అందులో నేను కొట్టుకుపోకుండా చూసుకోవాలి...)
ఆడు: ఏం మచ్చా సైలెంట్ అయ్యావ్. నువ్వెలాగో సాయం చెయ్యవని తెలుసు. అందుకే నీకు తెలిసిన వాళ్లతో అన్నా...
నేను: నేను ఏ సాయానికైనా రెడీ రా ఒక్క ఆర్థిక సాయం తప్ప.
ఆడు: అంటే అది ఒక్కటీ వుంటే ఇంకే సాయం అడగరు కదా...ఈ సారికి మాట సాయం ఒక్కటీ చెయ్యి, ఆళ్లకి చెయ్యి ఇవ్వకుండా వుండే పూచి నాది.
నేను: అయినా ఉన్నట్టుండి డాక్టర్‌ల పైన పడ్డావేంట్రా ?
ఆడు: రిసెషన్ బాబాయ్ రిసెషన్. దీని ఎఫెక్ట్ మీ మీద ఏమో కాని నా మీద చాలా పడింది. ప్రతి ఒక్కడూ ఇదే రీజన్ సెప్పి తప్పించుకుంటున్నాడు. మన దేశంలో రోగాలకు కరువు ఎప్పుడూ వుండదు కదా...సొ ఇప్పుడు డాక్టర్‌లే కరెక్ట్ అనీ..
నేను: ఆహహ...నీ బ్రేయిన్ బే ఆఫ్ బెంగాల్ అంత విశాలమైనది, లోతయినదిరా. అందుకేనేమో ఎక్కువగా అల్పపీడనాలు, వాయుగుండాలు వస్తుంటాయి....సర్లే కాని నాకు తెలిసిన డాక్టర్ ఒకడున్నాడు...కానీ అతనితో కష్టం. వాడు తెలివైన వాడు.
ఆడు: అంటే ఆవులిస్తే పేగులు లెక్కెట్టే టైపా ?
నేను: కాదు....
ఆడు: మరి...ఆవులిస్తే గేదలు లెక్కేట్టే టైపా?
నేను: కాదు...
ఆడు: మరి....ఎవడ్రా వాడు ?
నేను: ఆవులిస్తే డెయిరి ఫామ్ పెట్టే టైపు...వెటర్నరి బిజినెస్ మాన్...
ఆడు: అదేంటి ?
నేను: పేరుకి వెటర్నరి డాక్టర్, సైడ్ బిజినెస్‌లు చాలా వున్నాయి మరి
ఆడు: ఇంక ఆడు నాకేం ఇస్తాడు ? హలో...హలో...అరె సిగ్నల్ సరిగ్గా రావడం లేదు నేను మళ్ళీ కాల్ చేస్తా.
ఎవడన్నా దొరికితే సెప్పు, సిగ్నల్ లేకపోయినా కాల్ చేస్తా...

కాల్చేస్తా...కాల్చేస్తా...అన్న మాట రీసౌండ్‌లో వస్తూ కాల్ కట్ అయ్యింది. నెక్స్ట్ టైం ఈడి నుంచి కాల్ వస్తే ఎలా అవాయిడ్ చెయ్యాలా అని ఆలోచిస్తూ పడుకున్నా.

15-జనవరి-2009
లప్పంగిరిగిరి - 3
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!
* దెబ్బ తగిలిన చోటే ఎవడో ఒకడు కాలెడతాడు. సరిగ్గా అదే విధంగా ఏనాడూ లేనిది చాలా త్వరగా లేచాను. కాని పండగ రోజు సెలవు కాబట్టి ఈ రోజు పేపర్ రాలేదు. తాగుబోతుకి సాయంత్రం అవ్వగానే చుక్క దొరక్క పోతే ఎంత చిరాకు పడతాడో ఒక్క కొత్త పేపర్ ముక్క దొరక్క వర్చువల్ నరకం చూసాను.

* ఈ చిరాక్స్ తోనే మన రెగ్యులర్ టిఫిన్ సెంటర్‌కి వెళ్లగానే పార్సిల్ కౌంటర్ అతను నన్ను చూడగానే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాడు. నా రోటీన్ టిఫిన్ 'సింగిల్ ఇడ్లి, సింగిల్ వడ ' కాబట్టి. టైపింగ్‌లో స్పేస్ బార్‌తో వచ్చే స్పేస్‌లో కూడా వెరైటి వుంటే బాగుంటుందనుకునే వెరైటిక్కమాలోకం అయిన నేను ఇలా ఒకే టిఫిన్‌కు ఫిక్స్ అయ్యిపోవడమేంటా అని అందరికీ డవుటు.

దీన్ని యీక్‌పాయింట్‌గా పట్టుకుని ఆడుకోవాలనుకునే ఫ్రెండ్స్ ఒక సారి ఉండబట్టలేక 'ఏంట్రా ఎప్పుడూ ఒకే టిఫిన్ తింటావా ? అందులో ఏమన్నా విటమిన్ ASDFGH.... లు వున్నాయా ? అని అడిగితే...

'నాకు ఇడ్లిని చూస్తే ఇలియానా, చట్నీని చూస్తే ఛార్మి, గుర్తొస్తారురా' అని చెప్పా.

'ఆహా మరి వడను చూస్తే వాణి విశ్వనాథ్ గుర్తొస్తుందా ?' అని ఒకడు, 'వడి వుక్కరసి....???' అని ఇంకోడు....ఇలా గెస్ చేస్తుంటే....'కాదు, వ్లాదిమిరో పుతినో పులిహారో పూం పుహారవకొవ్, ద గ్రేట్ రష్యన్ సూపర్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని సెప్పీ సుక్కలు చూపించి ఎస్కేపా.

నిజానికి ఈ టిఫిన్ అలవాటు చేసుకోడానికి ముఖ్య కారణం అత్యంత వేగంగా పార్సిల్ లభించే టిఫిన్ ఇదే. దోస, పూరి లాంటి దీర్గకాలిక, ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లకన్నా ఇదే మేలు అని అలా ఫిక్సయిపోయా.

ఇడ్లి ఒక్కటే తీసుకుంటే పేషంట్ టిఫిన్ అవుతుంది. వడ ఒక్కటే తీసుకుంటే వాలంటరీ రిటైర్మెంట్ వస్తుంది. అందుకే ఇడ్లి, వడకి పెళ్లి చేసి కాపురానికి కడుపులోకి పంపుతుంటా.

మా వాలకం చూసి టిలీగ్ (కలిసి పని చేసేవారిని కలీగ్ అంటే, కలిసి టిఫిన్ తీసుకెళ్లే వారిని టిలీగ్ అనే కదా అనాలి ?) షాక్ అవుతుంటే ఆడికి సెప్పే ఓపిక లేక పార్సిల్ తీసుకుని వచ్చేసా.

* నగరం నడి ' బొడ్డు ' లో కె. రాఘవేంద్ర రావు 'B.A' గారి సినిమాక్స్ మల్టిప్లెక్స్ స్టార్ట్ అయ్యిందని తెలిసి ఎగ్జైట్ అయ్యా. ఎందుకంటే అంతకు వారం క్రితమే నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి. చిన్నప్పటి నుండి వున్న బలమైన కోరికలలో గురువుగారి వాయిస్ వినాలన్నది ఒకటి. ఎందుకంటే ఆయన బయట ఎక్కడా ఏ ఫంక్షన్స్‌లోనూ మాట్లాడరు కాబట్టి.

ఒకసారి ETVలో తన ప్రోగ్రాం వస్తోందని తెలిసి చూడడానికి ఎంతో ట్రై చేసాకాని మిస్ అయ్యా. అలాంటిది వున్నపలంగా సినిమాక్స్‌కు వెళ్లాల్సి రావడం, గురువు గారిని చూడడంతో ప ని ని స స రింగ్ టోన్ రియల్ లైఫ్‌లో ప్లే అయ్యింది. పలకరిద్దామని అనుకుంటూ, నమస్తే సార్, నేను బి.అశోక్ వర్మ 'B.Tech' అనబోయాను కాని నమస్తేకే మాటలు ఆగిపోయాయి. ఒక గొప్ప రుషిని చూస్తున్న ఫీలింగ్‌తో అలా వుండిపోయాను. మొత్తానికి ఆయన వాయిస్ వినగలిగాను. కన్‌స్ట్రక్షన్ పనిలో ఆయన బిజీ గా వుండడంతో పెద్దగా ఇంటరాక్షన్ కుదరలేదు. అయినా చాలా హేపిస్.

త్రివిక్రమ్ గురూజీని కలిసిన తర్వాత అంతగా ఎగ్జైట్ అయిన క్షణం ఇదే. పనిలో పనిగా థియేటర్స్ అంతా షుగర్ (చక్కెర) కొట్టా. చాలా బావున్నాయి అనిపించింది. ఆరేసుకుని పడుకోడానికి వీలున్న ఒకే ఒక మల్టిప్లెక్స్ ఇది. ఇది వారం క్రితం సంగతి. నిన్న మల్టిప్లెక్స్ ఓపెన్ అయ్యిందని తెలిసి, ఈ రోజు సినిమా చూద్దామని టికెట్స్ బుక్ చేద్దామని ట్రై చేస్తే విచిత్రమైన ప్రాబ్లెం వచ్చింది.

cinemax.co.inలో టికట్స్ బుక్ చెయ్యాలంటే మినిమం 2 చెయ్యాలి. ఇదెక్కడి అన్-న్యాయం, అన్-ధర్మం, అన్-చట్టం, అన్-అన్నీ... నేనొప్పుకోను అని రకరకాలుగా అనుకున్నా. నేను ఎప్పుడు ఎల్లినా ఏకాకి గానే ఎల్తా. పోనిలే దోకాకి అవదామంటే, ఏ....కాకీ దొరకడంలేదు :(((

* సచిన్ టెండుల్కర్ ఫిలిం నగర్ దేవాలయంకు వచ్చాడని తెలిసి మరో సారి ఎగ్జైట్ అయ్యా. నేను ఆ దేవస్థానంను చాలా సార్లు దర్శించాను కాబట్టి. ఎప్పుడో చదువుకున్న transitive property గుర్తొచ్చింది. నేను గుడిని చూసాను. సచిన్ కూడా గుడిని చూసాడు. సొ నేను సచిన్‌ని చూసాను !!!

అని అల్పానందం పొందాను. ఎప్పుడో చదువుకున్న మ్యాథ్స్ తప్పులుంటే క్షమించండి అస్సలు అర్థమే లేదనుకుంటే మిమ్మల్ని నేను క్షమిస్తాను.

* శశిరేఖ పరిణయం సినిమా పాటలు కాజువల్‌గా పెట్టుకుని వింటుంటే, 'ఓ బుజ్జమ్మా' మరియు ' ఏదో....కొత్తగా వుంది ఈ వేళ ' పాటలు బాగా నచ్చాయి. మొదటిది సింగర్ రంజిత్ వల్ల బాగా వచ్చింది.

రెండో పాట బాధలో వున్న వారు వింటే:

జెంట్ ఐతే బ్రాందిలాగా...
లేడి ఐతే బఫెట్ లాగా అనిపిస్తుంది.


ఈ సినిమా గురించి ఫస్ట్ టైం విన్నప్పుడు, శశి అనే అబ్బాయి, రేఖ అనే అమ్మాయి పెళ్లికి సంబందించిన స్టోరి అనుకున్నా. నాకు సినిమా మాత్రం అంతగా నచ్చలేదు. మా జెనీ డార్లింగ్ ఏది చేసినా నచ్చుతుంది కాని ఈ సినిమాలో తను సరిగ్గా అతకలేదు. చందమామ సినిమా కూడా మొదట్లో నచ్చలేదు, చూడగా చూడగా బాగా నచ్చింది. అందులో 'నవ్‌దీప్-ఆహుతి ప్రసాద్ తాగి గొడవ పడే సీన్ ' ఈ మధ్య కాలంలో నాకు హాట్ ఫేవరెట్.

ఇలా వంశీ కృష్ణ (ఆయన వెరైటి కోసం కృష్ణ వంశీ అని పెట్టుకున్నారు. నేనూ వెరైటి కోసం ఇలానే పిలవాలనుకుంటున్నా) 'సినిమా చూడగా చూడగా బాగుండును ' లాజిక్ కూడా దీనికి వర్క్ అవుట్ కాకపోవచ్చు. జెనీ ప్లెయిన్ సారీస్‌లో చాలా క్యూట్‌గా వుంది.
సో ఈ రోజు ఫస్ట్ టైం కాటన్ సారీస్‌తో కల్లోకి ఎంటర్ అవ్వబోతోందన్నమాట :)

14-జనవరి-2009
లప్పంగిరిగిరి - 2
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* 'పావు తక్కువ తొమ్మిదైందే పద్మావతి ' అని ఎవడో గట్టిగా 'నచ్చావులే' పాట ప్లే చేస్తుంటే 'ఏడిచావులే' అని వాడ్ని తిట్టుకుంటూ నిద్రనుండి లేచాను. టైం చూస్తే 'పావు తక్కువ పదకొండు అయ్యింది '. ఫోన్ చూస్తే ఇంటినుంచి చాలా కాల్స్ వున్నాయి, అమ్మో అని అమ్మకు వెంటనే ఫోన్ చేస్తే ' ఏరా ఇప్పుడే లేచావా ? ఈ రోజు సంక్రాంతి అని తెలుసా ? , బహుశా ప్రపంచంలో ఏ తెలుగోడు ఈ రోజు ఇంత లేట్‌గా లేవడు...' అని తిట్లాష్టకం స్టార్ట్ చేస్తుంటే, 'హే మామ్స్, కూల్...కూల్‌గా వుందని...అయినా నేను మీ అందరికన్నా ముందే మేల్కొని 12 నుంచి 4 గంటల వరకు సంక్రాంతి జరుపుకుని పడుకున్నా, మీరంతా నన్ను చూసి నేర్చుకోవాలి...' అని రివర్స్ క్లాస్ పీకి ఎస్కేపా.

* పేపర్ చూడగానే, చలి మనకే కాదు పేపర్‌కు కూడా వుంటుంది అన్న కొత్త యాంగిల్ తెలిసింది. అందుకే ప్రతి ఒక్కరినీ పట్టించుకునే సి.యం గారు ఒక స్వెటర్/జెర్కిన్/జాకెట్‌ను సంక్రాంతి సందర్భంగా వార్తా పత్రికలకు దానం చేసారు . ప్రకటనలను కూడా న్యూస్ ఐటంలా భ్రమింపజేసే వినూత్న వొరవడికి శ్రీకారం చుట్టిన వై.యెస్ గారికి జోహార్స్.

* అతి చిన్న వార్తగా వచ్చిన ఒక ఐటం నన్ను విశేషంగా ఆకర్షించింది. చేతి నిండా పని లేక చెయ్యి చూసుకుంటుంటే ఒక శాస్త్రవేత్తకు సందేహం వచ్చి రీసెర్చ్ చేస్తే, చూపుడు వేలుకన్నా ఉంగరం వేలు పొడుగ్గా వుంటే వాళ్ళు స్పైడర్ మాన్, బాట్ మాన్ లకు ఎక్కువ జెంటిల్ మాన్‌కు తక్కువ అని తేల్చేసాడంట. వెంటనే నా చెయ్యి చూసి వావో వావు...నా ఉంగరం వేలు, చూపూడు వేలు కన్నా పొడుగ్గుందోచ్ అని మురిసిపోయాను. వెంటనే సిక్స్త్ సెన్స్, సిక్స్త్ క్లాస్ సెన్స్ చెప్పింది - 'అరె వో గెవడికైనా గట్లనే వుంటుంది బే' అని. అవును కదూ అని లైట్ తీసుకున్నా. ఎందుకంటే 'విశ్వసనీయ వర్గాల కథనం' మేరకు ఆ ప్రముఖ దిన పత్రిక రీసర్చ్‌ల పేరుతో చెప్పేవన్నీ తూచ్ అని నాకు గట్టి నమ్మకం. ఫ్లాష్ బ్యాక్‌లో ఒక రోజు ఆ రోజు పేపర్ చదువుతుండగా, దాని పక్కన పదిహేను రోజుల కిందటి అదే బ్రాండ్ వారి పేపర్ వచ్చి పడింది. ఒక దాంట్లో ఏమో రోజూ కాకా హోటల్‌లో కాఫీ తాగితే కాకర్ల హాస్పిటల్(నిమ్స్)కు వెళ్తావ్ అని చెప్తే, ఇంకొక దాంట్లో రోజూ కాఫీ తాగని బతుకు ఒక బతుకే కాదు, బ్రహ్మీ తాతయ్య తలరాతలను కాఫీ తాగుతూనే వ్రాస్తాడు, సో ఆ అలవాటు అసైన్ చేసినవారికి ఆయుష్ షాంపూ వేసి తలంటి స్నానం చేయిస్తాడు అని ఒక రేంజ్‌లో చెప్పారు. ఆ రోజు నుంచి 'అమ్మ దొంగా' అనుకుంటా సదరు న్యూస్ పేపర్ వారు అలాంటి వార్తలను ఇస్తే. కాని వాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా 'అమ్మ-మ్మ దొంగా అనిపించేలా ఇలాంటి వార్తలను దంచేస్తూనే వున్నారు.

* సచిన్ టెండుల్కర్ రంజీ ఫైనల్స్‌లో డక్ అవుట్ అయ్యాడంట. ఇందులో అంత స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా ? ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఫస్ట్ టైం అంట డక్ అవుట్ అవ్వడం. మంచి G.K బిట్ కదూ !!!

* 'నావి పిల్లి కళ్ళు, మేక మెడలు........ అని మా పిన్ని వాల్ల పెద్దమ్మ అంటుంటుంది...' లాంటి సోది మాటలు మత్రమే చెప్పేవారు కాస్తయినా, CAT ఎగ్జాంలో మంచి పెర్సెంటైల్ సంపాదించిన అంథురాలి నుంచి ప్రేరణ పొందాలి.

* "హేపీ సంక్రాంతి, సంక్రాంతి హేపి" లాంటి అరడజను SMSలు, అర-అరడజను ఫోన్ కాల్స్, అరవై ఉత్తుత్తి గుంపులో గోవిందం మెయిల్స్, "ఏరా ఊరికి పోలేదా ?, నీదీ ఒక లైఫారా, అసలేం పీకుతుంటావ్ బే నువ్వు ?" అన్న చిన్న పాటి కామెంట్లు, 'అడ్డం జరుగుతావా...అంకుల్ అనమంటావా' అని బెదిరించే మా కాలనీ పిల్లలతో, పెద్ద పాటి ఎలుకలు (వీటినే చాలా ఏరియాలలో పంది కొక్కులు అంటారు) కడుపులో కాలింగ్ బెల్ కొడుతుంతే మా ఏరియా అంతా హోటల్స్ మూసివేసుండడం వల్ల పండగ వస్తే బ్యాచిలర్‌లకు ఎన్ని కష్టాలో సర్వే చేస్తూ 'అహ నా పెళ్లంట ' సినిమా లో కోటా/రాజేంద్ర ప్రసాద్ మెనుతో సర్దుకుంటూ సంక్రాంతి జరుపుకున్నా.

* మా ఫ్రెండ్ గాడికి మెయిల్స్ 'ఫార్వర్డ్' చెయ్యడం చాలా ఇష్టం. 'బ్యాక్‌వర్డ్' చెయ్యడం కూడా ఇష్టమే యెప్పుడూ ఆ ఆప్షన్ కోసమే వెతుకుతూ వుంటాడు. వాడికి ఈ రోజు ఒక్క ఝలక్ వచ్చిందంట. మెయిలింగ్ లిస్ట్‌లో ఎవడెవడున్నాడో చూసుకోకుండా ఫార్వర్డ్ చెయ్యడంతో ఫారిన్ కష్టమర్‌లకు కుడా సంక్రాంతి విషెస్ పంపించాడు. ఇక్కడ ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది. 'sonkranti wishes' అని పంపడం వల్ల, 'Congratulations on having a new baby boy, kranti !' అని రిప్లై వచ్చిందంట.

* సెలవు రోజు అయ్యుండి 'మస్కా' సినిమా చూసేసి ఫాస్టెస్ట్ రివ్యూ పెట్టడానికి పోటి పడాలని ఎందుకు అనిపించలేదా అని డవుట్ వచ్చింది. ఎడారిలో ఒయాసిస్ అవ్వాలనుకోవాలే కాని, ఇసుక కావలనుకోకుడదు అని జ్ఞానోదయం అయ్యి సర్దీ(జలుబు) తో సతమతమవుతున్న నాకు నేనే సర్ది చెప్పుకున్నా.

అట్‌లీస్ట్ సినిమా చూద్దాం అని మూడ్ వచ్చేసరికి ఆ రోజు టికట్స్ అన్నీ బుక్ అయ్యాయని తెలిసింది. ముందు రోజు అనుకుని వుంటే ఆ పాటికి సినిమా కూడా చూసేసుండొచ్చు అనిపించింది.

ఈ దారి గుండా వచ్చినందుకు సెప్తున్నా (by the way), యే సినిమా అన్నా మొదటి రోజు మొదటి షో, (ప్రోబబ్లి స్టేట్ మొత్తంలో మొదటి షో) చూడాలనుకుంటే చాలా వీజి. bookmyshow.comలో ప్రసాద్స్‌లో ముందు రోజు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 9 - 10.30 మధ్య ఫస్ట్ షో మొదలవుతుంది. చాలా మంది టాలివుడ్ big wigs, చిన్న చిన్న విగ్స్ పెట్టుకున్న వారు వస్తారు. idlebrain జీవి గారు ఇంకా చాలా వెబ్‌సైట్స్ వారు కూడా ఈ షో కి వచ్చే రివ్యూస్ వ్రాస్తారు. నేను కూడా ఈ పద్దతిలోనే చాలా సినిమాలు చూసాను.

పైగా నాకు పాచి మొహంతో లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, రిలీజ్ సినిమాలు చూడడం అంటే తెగ ఇష్టం. అందుకే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో క్రికెట్ మ్యాచ్‌ల కోసం వెయిట్ చేస్తుంటా.

ప్రసాద్స్‌కు ఒక మంచి ఆల్టర్నేటివ్ 'easymoviesindia.com'. కాకపోతే ఇందులో ఖాతా తీసుకోవాలి. మినిమం ప్యాకేజ్ 300 రుపీస్‌గా వుంది. ఇందులో ఒక ట్విస్ట్ వుంది. ప్రతి నెలా 30 రుపీస్ సర్వీస్ చార్జెస్ కింద కట్ చేస్తారు. మీరు ఖాతా తీసుకునే ఆఖరి క్షణం వరకు ఈ విషయం చెప్పరు. ఈ ఒక్క విషయం తప్ప అన్నీ రకాలుగా చాలా హెల్ప్ చేస్తుంది easymovies. ఎంతటి క్రేజ్ ఉన్న సినిమాకైనా చాలా ఈజీగా టికెట్స్ దొరుకుతాయి.

ఇన్ని ఆప్షన్స్ వున్నా, చాలా మంది మూడు రోజుల నుంచి ట్రై చేస్తునా టికెట్స్ దొరకట్లా/బ్లాక్‌లో కొని వైట్ వాష్ అయ్యాం అని నానా రకాల కష్టాలు ఎందుకు సెప్తారో అర్థం కాదు, 'ఇంటర్నెట్ హై నా !!!'

* జంధ్యాల గారి జయంతి సందర్భంగా 13,14,15 తేదీల్లో రవీంద్ర భారతిలో 'హాస్యోత్సవాలు ' జరుగుతాయని 12 నే తెలుసు. 13 న,

'మండే (monday) ముందు ఏమి వస్తుంది ?' అంటే 'పొగ ' అని సమాధానం చెప్పడం, 'విష్ణువు, లక్ష్మి, శివుడు ' యే యే లింగాలో చెప్పు అని మాష్టారు అడిగితే, 'విష్ణువు పుం లింగం, లక్ష్మి స్త్రీ లింగం, శివుడు శివలింగం' అని విధ్యార్థి సమాధానం చెప్పడంలాంటి జోక్స్‌తో బాగా అలరించారు అని తెలిసినా, 14 న ఖా
ళీగా వున్నా వెళ్లని నాలాంటి బై బర్త్ బద్ధకిస్ట్‌లను ఖాళీ పిస్టోల్ తో కాల్చి కాల్చి చంపాలి.

లప్పంగిరిగిరి - 1
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!!

* ఈ రోజు మార్నింగ్ బ్రాయిలర్ కోడి కొక్కొరొకో అనే టైమ్ కాదు కానీ , సదరు కోడిగారు చికెన్ సెంటర్లకు/కస్టమర్ ఇల్లకు సరఫరా షురు అయ్యే టైంకు అటు ఇటుగా 9 - 9:30 మధ్య లేచాను. లేవ గానే డోర్ బయట ఉన్న ఈనాడు, సాక్షి పేపర్లను తెచ్చుకుని నాలుగు న్యూస్ పేపర్‌లను వేసుకుని చదవడం స్టార్ట్ చేసా. నాలుగు ఎందుకంటే నిన్నటి ఈనాడు, సాక్షిని నేటి కాపీస్‌తో పోల్చి చదివితేనే పొద్దునే నాలుగు రకాల కషాయం తాగిన ఫీలింగ్ వస్తుంది.

* హాట్ వాటర్ కోసం హీటర్ పెట్టుకుని, వేడి అయ్యాయా లేదా అని చూడగా, కొంచెం వేడిగా కొంచెం చల్లగా అనిపించింది. వెంటనే KIKK సినిమా (కొంచెం ఇష్టం కొంచెం కష్టం) గుర్తొచ్చి, నిన్న 'అబ్బా ఛా' ఆర్కుట్ కమ్మ్యూనిటీలో చూసిన దారం గుర్తొచ్చి, 'అబ్బా ఛా' సాంగ్ కోసం నెట్‌లో వెతికి ప్లే చేసా.

అహా ఆహా ఏం బీట్ వుంది సాంగ్లో. చాలా రోజుల తర్వాత బాగా ఎగరడానికి స్కోప్ ఇచ్చిన పాట వచ్చింది. 'జింతాక్ జింతాక్' తర్వాత ఆ రేంజ్‌లో కాకపోయినా ఓ మాదిరి రాన్‌డం స్టెప్స్ వేసుకోడానికి ఉపయోగపడే పాటొచ్చింది. అలా విచ్చల విడిగా ఎగురుతుండగా కనుచుపుమేరలో ఎవరో చిన్నది టెర్రెస్ పైన నించుని మరీ ఇదంతా గమనిపిస్తున్నది గమనించి బ్రేక్ డాన్స్‌ను బ్రేకా.

* ఆపీస్‌కు ఎల్లగానే, అందరూ 'సత్యం మీటింగ్‌లో' వున్నారని అర్థమయ్యింది. 'ఉప్పర మీటింగ్' రాజు కు సత్యం పర్‌ఫెక్ట్ వారసుడు మరి. అంతలోనే 'లెయ్ బే లెయ్' (Layoffs) గురించి డిస్‌కషన్ వచ్చీ ఎవరో గూగులమ్మను అడిగితే వెంటనే 'jobeehive.com' గురించి చెప్పింది. అందులో మాస్టారు భలే తెలివిగా ఎక్కడెక్కడ Layoffs జరుగుతున్నాయో బాగా ఇచ్చాడు. శవాలపై మరమరాలు ఏరుకుని భేల్ పురి చేసుకోవడం అంటే ఇదేనేమో అనుకుని, మొత్తానికి సూపర్ అవిడియా తట్టింది ఈడికి అనీ వీలైతే ఈ మరమరాలను మనమూ సేకరించి నానబెట్టి ఉగ్గాని టిఫిన్ చేసుకుందాం అని డిసైడ్ అయిపోయా.

* మధ్యాహ్నం భోజనానికి చెలికత్తెలతో (కలీగ్స్) Chattees(36) రెస్టారెంట్‌కు వెళ్ళాను. అందులో 'Bar-B-Q' ఉంది. అదే కేక. కాంప్లిమెంటరీగా కూల్ డ్రింక్స్ ఇస్తారని తెలుసు కాని, ఫ్రెష్ లైం సోడా లాంటివి కూడా ఇస్తారనీ, అడిగిన వాళ్ళకి కార్పొరెట్ డిస్కౌంట్ 10% ఇస్తారనీ ఈ రోజే తెలిసింది. ఇంతక ముందు వెళ్ళినప్పుడు ఇవి అడగకుండా వున్నందుకు బాగానే దొబ్బించుకున్నాం, డబ్బిచ్చుకున్నాం. సో ఈ రెస్టారెంట్ ట్రై చేసే వాళ్ళు ఈ విషాయాలను కాపిటాలైజ్ చేసుకోండి.

* మేసాక, తిరుగు ప్రయాణంలో నా వెనక కూర్చున్న చెలికత్తెకు ఎందరో ఎప్పుడో గుర్తించిన, నేను ఈ మధ్యే గుర్తించిన సైబర్ టవర్స్ సిగ్నల్‌ను అవాయిడ్ చేసే రూట్ చూపడంతో ఆ చెలికత్తే కుడా మిక్కిలి ఆనందించింది. జూబ్లీ హిల్ల్స్ నుంచి సై
ర్ టవర్స్ సిగ్నల్ వైపు వచ్చి, లెఫ్ట్ తీసుకునే ఈ దారి తెలియకపోతే వెంటనే తెలుసుకోండి, తెలుసుంటే లైట్ తీసుకోండి. ఆ సిగ్నల్ రాకముందే విభా సీడ్స్/బిర్లా సాఫ్ట్ కంపనీస్ దగ్గర ఒక లెఫ్ట్ తీసుకుంటే My Home Hub అపార్ట్‌మెంట్స్ వెనక నుంచి ఒక రోడ్ వచ్చి, 'వెన్నెల/కోమల ' హోటల్స్ టచ్ చేస్తూ మోటోరోల కంపెని ఎదురుగా కనిపిస్తూ ఆ రోడ్‌ను టచ్ చేస్తుంది. చాలా మంచి షార్ట్ కట్ గురు !!!

* ఒక స్నేహితుడి సౌజన్యంతో ప్రపంచం మొత్తం ముర్‌గి/Hen అయ్యి కూస్తున్న Hinglish సినిమా 'స్లం డాగ్ మిలియనేర్ ' సినిమా చూసేసా. కెబిసి కి, ఒక స్లం కుర్రాడి లైఫ్‌కి లింక్ పెట్టి స్టోరి రాసిన వికాస్ స్వరూప్ కి సిటికెలు. ఇదే సందర్భంలో ఫిల్మ్ ఇండస్ట్రి క్రియేటర్స్ అందరూ తాము వండుతున్న సినిమాలకు, 'A Wednesday' వంటకం కు పోలిక చూసి అవాక్కయ్యేలా చేసిన నీరజ్ పాండే్‌కు సిన్సియర్ సిటికెలు.

* ఈ రోజు మార్నింగ్ నుంచి న్యూస్ సైటులు చాలా సార్లు బ్రౌజ్ చేస్తూనే వున్నాను. మన మేధావులు కనిపెట్టిన పాటర్న్ ప్రకారం, ఈ రోజు టెర్రరిస్ట్ అటాక్ జరగాలి. అది నిజంగానే జరుగుతుందేమో అని ఇప్పటివరకు కుతూహలంతో ఎదురుచూసాను.

మే 13 - జైపూర్ బ్లాస్ట్స్

జూన్‌లో ఏవి లేవు

జూలై 26 - అహ్మదాబాద్ బ్లాస్ట్స్

ఆగస్ట్ ఏవి లేవు

సెప్టంబర్ 13 - ఢిల్లీ బ్లాస్ట్స్

అక్టోబర్ ఏవి లేవు

నవంబర్ 26 - ముంబాయ్ బ్లాస్ట్స్

డిసెంబర్ ఏవి లేవు

జనవరి 13 ?????????

జనవరి - జనం వర్రీ అయ్యేలా ఇలా ఈ పాటర్న్ బాగా పాపులర్ అయ్యింది. కాని మొత్తానికి అంతా వట్టిదే అని ప్రూవ్ అయినందుకు హాపీసు చాలా హాపీసు.