18-జనవరి-2009
లప్పంగిరిగిరి - 6
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!


* ఆదివారం అంతా 'నిద్రో నిద్రతి నిద్రితః ' ఫిలాసఫి ఫాలో అయ్యాక, ఒక ముఖ్యమైన మెయిల్ రావాలి, వచ్చిందా అని gmail ఓపన్ చేసాను. మొదటి మెయిల్ క్లాస్‌మేట్ శ్రీవిద్యది. చాలా రోజులకు గుర్తొచ్చానేమిటబ్బా అని ఓపన్ చేస్తే, ఏదో లింక్ వుంది. అది ఏంటా అని చూస్తే...

మీ క్రష్‌ల పేరు చెబితే చాలు లవ్ మీటర్, వారు మీరంటే ఎంత మోతాదులో చెవులు,జుట్టు కోసేసుకుంటారో ఒక ప్రూవెన్ మ్యాథమెటికల్ ఫార్ములా ప్రకారం క్యాల్‌కులేట్ చేసి చెవులు, జుట్టు కత్తిరించి చూపిస్తాం అన్న లెవెల్లో మ్యాటర్ వుంది.

కుశలప్రశ్నలు వెయ్యకుండా క్రష్‌ల ప్రశ్నలు వేసిందేమిటబ్బా అనుకుంటూ సరే కానీ అని:

1. తెలంగాణ శకుంతల
2. పావలా శ్యామల (వర్షం సినిమాలో త్రిష అమ్మమ్మ)
3. తెలంగాణ శ్యామల ఆర్ పావలా శకుంతల

అని టైప్ చేసి సబ్‌మిట్ కొట్టగానే

Oops హేయ్ (బ్యాక్‌గ్రౌండ్‌లో చప్పట్లు) నువ్వు మోసపోయావ్, నీ బతుకు క్రష్‌లు చింపిన విస్తరయ్యింది, నువ్వు పప్పులో కాలేసావ్, చారులో చెయ్యేసావ్, ఉప్పులో పెరుగేసావ్...నీ సీక్రెట్స్ అన్నీ శ్రీవిద్యకు తెలిసిపోయాయోచ్ అన్న రేంజ్‌లో యానిమేషన్ బొమ్మ ఎగురుతూ చెప్పింది.

ఇప్పటివరకు శ్రీవిద్య నుంచి రిప్లయ్ రాలేదు.

* రెండో మెయిల్ Dr. Ahmed ALSAGA నుండి వచ్చింది. ఈడెవడా అని చూస్తే, వెస్ట్ ఆఫ్రికాలో వేస్ట్ ఫెలో అని తెలిసింది. ఈయన గారు ఒక బిజినెస్ ప్రపోజల్ పెట్టారు. తను బ్యాంక్ ఆఫీసర్ అంట. 2000లో ఒక ఫామిలీ మొత్తం ప్లేన్ క్రాష్‌లో చనిపోయారంట. కావాలంటే చెక్ చేసుకో అని BBC వెబ్‌సైట్ న్యూస్ లింక్ ఇచ్చాడు. ఆ కుటుంబ పెద్దమనిషి అకౌంట్‌లో డబ్బులు అలానే వుండిపోయాయంట. దాన్ని దొబ్బేద్దామా ? అన్నది తన అవిడియా. 55:35 రేషియోలో పంచుకుందాం, 10% ఖర్చులకు ఓకేనా ? ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని, లైవ్‌గా ఐతే చెయ్యి మూతి దగ్గర పెట్టి మెల్లగా చెప్తారు కదా అలా ఈడు బ్రాకెట్లు వేసి చెప్పాడు.

అస్సలు యాడ్నుంచి వస్తార్రా మీరంతా ! అనుకున్నా. ఈడి పేరుని ALSAGA అని కాకుండా ALL SEGA అని పలకాలేమో అనిపించింది. ఈ-మెయిల్‌ని స్పామ్ అని మార్క్ చేస్తుండగా 2004లో జరిగిన విషయం గుర్తొచ్చింది.

ఇప్పుడంటే సిక్స్ పాక్ బ్రెయిన్ వుంది కాని అప్పట్లో చాలా అండర్ వెయిట్. ఒక రోజు సుముహుర్తానికి, దుర్ముహుర్తానికి అటు ఇటుగా ఉన్న సమయంలో సురేష్ గాడు కాల్ చేసాడు. ఈడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎవరన్నా జీవితంలో సుఖ సంతోషాలు ప్రసాదించు దేవుడా అని మొక్కుకుంటారు గాని ఈడి పేరంట్స్ మాత్రం తెలివిగా సుడిని ప్రసాదించు దేవా అని మొక్కుకున్నాక పుట్టాడంట. అందుకే ఈడ్ని మేమంతా సురేష్ అని కాకుండా, సుడేష్ అని పిలుస్తుంటాం.

EAMCET ఎగ్జాంలో మేమంతా నానా ఫార్ములాల వెంటపడి ఫిజిక్స్‌లో (16,17)/50 సాధిస్తే, ఈడు వున్న టైం అంతా మ్యాథ్స్ చేసి చివర్లో టైం లేదని ఫిజిక్స్ బిట్లన్నింటికీ B ఆప్షన్ పెట్టేసి 19/50 సంపాదించాడు.

చాలా గ్యాప్ తర్వత కాల్ చేసిన వీడు:

నీకో ముఖ్య విషయం చెప్పాలి. ఎవరికీ చెప్పకురా....

నేను: కొంపదీసి ఎవరన్నా అమ్మాయి తగిలిందా ? ఈ లవ్ మారేజ్‌లు అవి నా వల్ల కాదు బాబొయ్. కావాలంటే స్క్రీన్‌ప్లే రాయగలను, డైరక్షన్-ప్రొడ్యూసర్-ప్రేక్షకులను నువ్వే చూసుకో...ఇంతకి ఆ అమ్మాయి ఎవరు ?

ఆడు: అహెయ్ తగిలింది అమ్మాయి కాదు, లాటరీ కోటి రుపాయలు

(నేను మూర్చపోయినంత పనైయ్యింది. ఆడికి లాటరీ తగిలినందుకు కాదు. కోటి రుపాయల లాటరీ తగిలితే ఎవరికీ చెప్పకుండ నా మీద నమ్మకం ఉంచి చెప్పినందుకు. 'రాజా' సినిమా క్లైమాక్స్‌లో వెంకీ మెలికలు తిరిగినట్టు...తిరిగిపోయా..మధ్యలో..ఎస్.ఏ.రాజ్ కుమార్ ఆల్ టైం సెంటి ట్యూన్ల బ్యాక్‌గ్రౌండ్‌లో 'రే...రే...' అని నేను అంటుంటే...)

ఆడు: అప్పుడెప్పుడో రెడిఫ్ మెయిల్‌లో USలో ఉండే కృష్ణాగాడు ఏదో పంపిస్తే ఫిల్ చేసి పంపించారా. దానికి తగిలింది. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావాట్లేదు. ఎవడిదో నంబర్ ఇచ్చి కాల్ చెయ్యమన్నారు.

నేను: వావ్...నువ్వు దీపావళి అప్పుడు లక్ష్మీ టపాకాయలు ఎక్కువ కలుస్తావు కదూ...అందుకేనేమో అబ్రాడ్‌లో వున్నా లక్ష్మీ దేవి గుర్తుపెట్టుకుని కరుణించింది. KBC కోటీశ్వరుడు హర్షవర్ధన్ నవాటే తర్వాత నీవంతే. ట్యాక్స్‌లు పోను మినిమం అరవై లక్షలు వస్తాయిరా. రోజుకి మూడు పూటలే తింటే ఆరు తరాలు బ్రతికెయ్యొచ్చేమో. నువ్వు నిజంగా సుడేష్ మామా సుడేష్. ఐతే ఇంకేముంది ఆడికి కాల్ చెసెయ్.

ఆడు: మనకంత సీన్‌లేకే కదా నీకు ఫోన్ చేసింది. ప్లీజ్‌రా హెల్ప్ చెయ్యి....
నేను: ఇక మీదట నేను చూసుకుంటా కదా....
(ఆల్రెడి ఈడి ఫోటోని పేపర్‌లో ఊహించుకుంటూ, ఈడిచ్చే ఇంటర్‌వ్యూల్లో ఫ్రెండ్స్ లిస్ట్లో ఫస్ట్ పేరుగా నాది చూసూకుంటూ మురిసిపోయాను. మనం ఇప్పుడే కలుద్దామన్నాను. ఆడు వెంటనే వచ్చాడు. ఇద్దరం కలిసి ఇంటర్నట్ సెంటర్‌కెళ్లాం. ఆడి మెయిల్ ఓఫెన్ చేసి చూపించాడు.)

నేను: రెయ్ ఇదే మనకు ప్రూఫ్. బంధువులకు గాని రిలేటివ్స్‌కు గాని....

ఆడు: (చిన్న గా నవ్వి...) ఇద్దరు ఒకటే కదరా....?

నేను: ఇదిగో అసలే నేను ఎగ్జైట్మెంట్లో వున్నా నన్ను డిస్టర్బ్ సెయ్యకు. సో బంధువులకు గాని, నాకు తెలియకుండా నీకు పెళ్లైయుంటే నీ నాక్ తెలియని వైఫ్‌కు గానీ, ఎవ్వరికీ దీని గురించి చెప్పకు. ఇప్పుడే ప్రింట్ అవుట్ తీసిపెట్టుకుందాం.

(అని ప్రింట్ అవుట్ తీస్తున్నప్పుడు ఆ నెట్ సెంటర్ వాడి దృష్టి దీని మీద ఎక్కడ పడుతుందా అని...
నేను: బాసు, CD లోని మాటర్ అంతా floppyలోకి రావాలంటే ఏం చెయ్యాలి ?
(ప్రింట్ బటన్ నొక్కిన వాడు, ఒక్కసారి షాక్ అయ్యి నన్ను పైకి కిందకి చూసి...)
నెట్ సెంటర్ వాడు: ఇంకో CD తీసుకుని, కాపీ చేసుకుని దాన్ని floppy అనాలి.

ప్రింట్ అవుతున్న ప్రింట్ అవుట్ దిక్కు చూస్తున్న నేను షాక్ అయ్యి ఆడి దిక్కు చూసా. సర్దుకుని వెంటనే ప్రింటవుట్ తీసేసుకున్నా. అందులో UK లాటరీ వాడు, మలేషియా వాడి అడ్రెస్ ఇచ్చి ఫోన్ నంబర్ ఇచ్చాడు. అది ట్రై చేస్తే కనెక్ట్ కాలేదు. మా సుడేష్ గాడి మొహంలో తుఫాను తాకిడికి వరదలు ముంచుకొస్తున్నాయి. ఇలాంటప్పుడే చాలా షార్ప్‌గా ఆలోచించాలి అనీ, ఇంతకీ మలేషియా కన్‌ట్రి కోడ్ ఎంత బాసు అని నెట్ సెంటర్ వాడి నడిగితే నాకేం తెలుసు అని వాడన్నాడు. సుడేష్ గాడి కుడి కన్నులో గండి పడింది. కంట్రోల్ మామా కంట్రోల్ అని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా గూగుల్ స్క్రీన్ కనిపించింది. ఛ ఇది వుండగా ఇంత సేపు ఆలోచిస్తున్నామేంట్రా అని గూగుల్‌లో సెర్చ్ చేసి ఆడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసాడు. అదేదో ఉర్దోరబిక్‌హింగ్లిష్‌లో మాట్లాడాడు. కంగ్రాట్స్ అని చెప్పి, స్టాంప్ డ్యూటి/ట్యాక్స్‌ల పేర్లు ఏవో చెప్పి 20,000 ఫస్ట్ పంపిస్తే ఆ తర్వాత మీకు డబ్బు ఏరొప్లేయిన్‌లో గావాల్నా/ షిప్‌లో గావాల్నా...అని సెప్తుంటే కృష్ణ భగవానుడు (కమెడియన్-వెంకీ సినిమాలో) గుర్తొచ్చాడు.

అమ్మో అమ్మో ఇందులో ఏదో తిరకాసు వుందని ఫస్ట్ టైం అప్పుడూ లైట్ ఎలిగింది. మల్లీ గూగుల్ స్క్రీన్ కనపడడంతో వెంటనే నేను ఆ మలేషియా వాడి పేరు కొట్టా అంతే, 0.1 సెకండ్స్లో పది లక్షల రిజల్ట్స్ వచ్చాయి. మీ భగవాన్ ఒక Rs 4,20,420 నోటు అని రక రకాలుగా తిడుతూ ఆడు దొరికితే కుమ్మెయ్యండి అని అందరి అరుపులు కనిపించాయి.

సుడేష్ గాడు, నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఏం మాట్లాడకుండా వుండిపోయాం.
కాసేపటికి తేరుకున్న నేను, " మామా నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు నేనూ ఎవ్వరికీ చెప్పను. ఇలాంటివన్నీ నమ్మకూడదురా, స్వశక్తితోనే మన స్లిప్పర్స్ పైన మనం నిలబడాలి", అన్నాను.

ఇంకొంచం ప్రొసీడ్ అయ్యుంటే యే రేంజ్ బకరాలయ్యుండే వాళ్లమో తలుచుకుని మూర్ఖంగా ఇరుకున్నందుకు ఏడ్వాలో, తెలివిగా బయటపడినందుకు ఆనందించాలో అర్థం కాని విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్‌తో అక్కడనుంచి వెళ్లిపోయాం.

అప్పటి నుంచి గూగుల్‌కు సంబందించిన వార్తయినా గూగుల్‌లో వెతికి కన్‌ఫర్మ్ చేసుకోనిదే నేను ఏదీ నమ్మడం లేదు. అద్గదీ సంగతి.

మొత్తానికి ఈ రోజు పొద్దున్న లేస్తూనే దావూద్ ఇబ్రహీం ఫోటో ఏమన్నా చూసానా అని డవుట్ వచ్చి మళ్లీ పడుకున్నా.

17-జనవరి-2009
లప్పంగిరిగిరి - 5
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* "wazz up" అని SMS రావడంతో రోజు మొదలయ్యింది. roof అని బదులిచ్చా. తరువాత రిప్లయ్ రాలేదు. చాలారోజులనుంచి 'వీకెండోఫోబియా' పట్టుకుంది. శుక్రవారం సాయంత్రం, 'వీకెండ్ కదా ఏంటి ప్లాన్స్ ?' అనీ, శనివారం-ఆదివారం, 'వీకెండ్ కదా ఏం చేస్తున్నావ్ ?' అనీ, సోమవారం పొద్దున్న, 'వీకెండ్ అంతా బాగా ఎంజాయ్ చేసావా ?' అనీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అంటుకున్న రోగం ఇది.

ఈ సారి ఎలా బయట పడదామా అని అనుకుంటూ సినిమా కెళ్లాలని డిసైడ్ అయ్యా. 'మస్కా'కు దగ్గర్లోని 'బిగ్' బజార్‌లోని గోల్డ్‌స్పాట్‌లో ఆన్‌లైన్ టికట్స్ ఉండడంతో వెంటనే తీసుకున్నా. ఎళ్ళగానే ఫస్ట్ జెర్క్ పార్కింగ్ రూపంలో తగిలింది. అత్యంత రద్దీగా ఉండే అమీర్‌పేట్‌కు ఎప్పుడైనా వెళ్తే బిగ్ బజార్ పార్కింగ్‌ను వాడుకోండి, O.C గా చాలా భద్రంగా వుంటుంది అని చాలా మందికి సలహాలిచ్చిన నాకు తాటి కాయ బాంబ్ పేలింది. తాటి కాయంత అక్షరాలతో, డిసెంబర్ నుంచి పార్కింగ్ ఫీ కలెక్ట్ చేస్తున్నాం అని ఉంది. ఫ్రీ గా వస్తే ఫెవికాల్‌నైనా చపాతిలోకి నంజుకుని తినే మిత్రబృందానికి ఈ విషాద వార్త ఎలా చెప్పాలా అని బాధపడ్డా.

టికట్ కౌంటర్‌కు రాగానే మరో షాక్. 'బిగ్' బ్రాండ్‌ను బాగా ఫోకస్ చేసే రిలయన్స్ వారు బిగ్-పొడవు-లాంగ్ క్యూ ఉండేట్టు బాగా జాగ్రత్తలు తీసుకున్నారనిపించింది. ఉన్న మూడు కౌంటర్‌లలో ఒకటి పని చేయకుండా పెట్టి బోరింగ్ దగ్గర నీళ్ళకోసం ఆంటీలు వేయిట్ చేసే మాదిరి సీన్ సృష్టించగలిగారు.

చాలామందిలాగే నాకు వెయిటింగ్ వాసన పడదు. సరే ఈ సారికి అడ్జస్ట్ అవుదాం అనుకుని, 'టైం రా టైం' అనుకుంటుంటే ఎవడో ఎనకనుంచి 11:30 అయ్యింది అన్నాడు. ఎనక్కు తిరిగి, తిరిగి కౌంటర్ ఇచ్చే మూడ్ కూడా లేకున్నింది. ఎందుకింత లేట్ అవుతోందా అని గమనిస్తే, 'మనకొచ్చిన కన్‌ఫర్మేషన్ SMS/ప్రింట్ అవుట్ చూపించాక, క్రెడిట్ కార్డ్ అడుగుతారు, అది వెరిఫై చేసాక, ఒక ఫారం ఫుల్‌గా ఫిల్ చేసి సంతకం పెట్టమని మనకు ఇస్తారు ' ఇవన్నీ విజయవంతంగా పూర్తయితేనే టికట్ చేతులోకివస్తుంది. ఈ 'బిగ్' ప్రొసీజర్ చూసి, 'ఛీ మా బతుకు, చీమ బతుకు అయ్యింది ' అనుకుని మొత్తానికి థియేటర్ ఏంట్రన్స్ వరకు వెళ్ళిపోయా.

వరసగా నిల్చున్న 5 మంది సెక్యూరిటీ వాళ్ళను చూసి సర్‌ప్రైజ్ అయ్యా. ఒక హిందీ మీడియం సెక్యూరిటి గార్డు చెతులు పైకెత్తమని సిగ్నల్ ఇవ్వడంతో అలానే చేసా. చెక్ చేస్తూ చేస్తూ నడుము దగ్గరకు రాగానే హిందీ, మీడియంగా మాత్రమే తెలిసిన నేను 'నో......ముఝె చక్కిలిగిలిగిలి హై' అని గట్టిగా అరిచా.

ఆడు: "క్యా సాబ్" అన్నాడు. నాకు ఆ టైంలో,

'కసబ్' అన్నాడనిపించి బెంబేలెత్తిపోయా. అలా అరవడం వల్ల టెర్రరిస్ట్ కసబ్ తో పోలుస్తున్నారని డవుట్ వచ్చింది. ఈ సారి 'నో....నహి...నో...నహీ' అని దీనికి బదులిచ్చా. ఆడు మళ్లీ, 'క్యా సాబ్...క్యా హువా' అనగానే విషయం అర్థమయ్యి కాస్త హవా వచ్చింది. తేరుకుని ఆడికి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యడానికి ట్రై చేసా.

"ముఝే ఇధర్ ఉధర్ టచ్ కర్నే సే.....కుచ్ కుచ్ హోతా హై "

అనగానే అందరూ నవ్వారు. నన్ను ఇంక చెక్ చెయ్యకుండానే వదిలేసారు. సో ఫ్యూచర్‌లో తీవ్రవాది ఐతే ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది అని అవిడియాను ఫోన్‌లో రికార్డ్ చేసుకుని పెట్టుకున్నా. ఎందుకంటే మనం గజ-గజని కాబట్టి.

నా సీట్ కరెక్ట్‌గా జంట జంటల మధ్య పడింది. ఇద్దరు జంటల ముద్దుల స్త్రేన్‌జరయ్యానన్నమాట అనుకున్నా. సినిమా మొదలయినప్పుడు అంతా బానే వున్నారు. ఫస్ట్ ఫైట్ స్టార్ట్ అయ్యాక, రౌడీ తల మీద బిందె పెట్టి హీరో కొట్టే సీన్‌కు నా కుడి పక్కనోడు ఎగిరెగిరి నవ్వుతుండడం చూసి షాక్ అయ్యా. కొన్ని వేల సినిమాల్లో అలాంటి సీన్ వున్నా ఇంకా ఎందుకు పెడుతున్నారా అన్న నా చిరకాల డవుట్ క్లారిఫై అయ్యింది. ఎవడ్రా డైనాసర్‌లు అంతరించిందన్నోడు అనిపించింది ఆ జంటను చూసి. ఈడేమో నవ్వాసురుడిలా వున్నాడు, ఆయన వైఫ్ ఏమో హిడింబీకి అక్కలా, హీ-మాన్‌కు చెల్లెలుగా వుంది. ఆమె మాత్రం డ్యూయట్ సాంగ్స్ అప్పుడు మాత్రమే భర్తతో కలిసి నవ్వేది. ఇలాంటి పాటలకు కూడా నవ్వొచ్చు అని మొదటసారి అనిపించింది. మొదట్లో 'ఓరినీ నోట్లో 'నో లాఫింగ్' బోర్డ్ పెట్టా ' అని అరవాలనిపించినా, సీరియస్ సీన్లలోకూడా, ముఖ్యంగా హన్సిక ఏడ్చే ప్రతి సీన్‌లోను నా పక్కనోడు విరగబడి నవ్వుతుండడం చూస్తూ నేనూ నవ్వుకున్నా. మొత్తానికి మస్కా సినిమాను ఈ మస్కిటో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో చూడాల్సి వచ్చింది. AC బదులు దోమల మందు వదిలితే నాలాంటి ప్రేక్షకులు సేవ్ అవుతారని థియేటర్ వాళ్ళకు సలహా కూడా ఇవ్వాలనిపించింది.

నా లెఫ్ట్ సైడ్ ఒక జంట ఉందన్న విషయమే మర్చిపోయాను, అంత సైలెంట్‌గా వున్నారు. రైట్ సైడ్ మాత్రం చాలా వైలెంట్‌గా వున్నారు. దేవుడున్నాడనిపించింది. లెఫ్ట్ సైడ్ చూసి, 'ఎక్స్ క్యూజ్ మీ, మీరు బ్రతికే వున్నారా ? అనీ, రైట్ సైడ్ చూసి 'ఎక్స్ క్యూజ్ మీ, మీరు ఎప్పుడు పోతారు ? అనీ అడగాలనిపించింది. నాకెందుకులే అని భయపడుతూ బయటపడ్డా.

ఒకటి-రెండు ఫ్లోర్స్ దిగగానే ఫుడ్ బజార్ చూసి ఫ్లాష్ బాక్ గుర్తొచ్చింది. ఒక సారి మిట్ట-సాయంత్రం ఇక్కడకు షాపింగ్‌కు వచ్చాను. మొత్తం తిరగగా తిరగగా కాసేపటికి కళ్ళు తిరిగాయి. ఏదన్న శీతలపానీయం తీసుకుందామని ఫుడ్ బజార్ ఫ్లోర్‌కు వస్తే, బిల్ కౌంటర్‌లో ప్యాసెంజర్ రైల్ అంత క్యూ ఉంది. కోక్ టిన్ కనబడటంతో తీసుకున్నా కాని అక్కడ ఎవరు స్టాఫ్ లేకుండడంతో దాన్ని పట్టుకుని క్యూలో నిల్చున్నా. రైలు గంటకు 0.000000000001 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుండడంతో నా వల్ల కాదని కోక్ టిన్ ఓపెన్ చేసి తాగడం స్టార్ట్ చేసా. టిన్ పూర్తయింది కాని క్యూ అలాగే వుంది, ఇంకా ఓపికగా వుంటే ఓ.ఫి వార్డ్‌కు వెళ్ళాల్సి వస్తుందని వెళ్ళిపోయా.

నేను చేసిన ఈ ద్రోహం నాకు ఫ్లాష్ బ్యాక్ రూపంలో గుచ్చి గుచ్చి చంపింది. ఒక కోక్ టిన్ నేను రిలయన్స్ వారికి రుణపడిపోయానే అని బాధపడ్డా, వెంటనే ఒక కోక్ టిన్ కొని టాప్ ఫ్లోర్ కెళ్లి ఆ బిల్డింగ్‌కి కోకాకిభిషేకం చెయ్యాలనిపించింది. కాని అలా చేస్తే ప్రదీప్ రావత్‌కు పోలియో చుక్కలు ఏసినట్టుంటుంది అని లైట్ తీసుకున్నా.

* మా ఇంటి కాంపౌండ్ దగ్గరకు రాగానే ఒక బృహత్తరమైన ట్యూన్ మైండ్‌లోకి వచ్చింది. దానికి రాన్‌డం లిరిక్స్ యాడ్ చేసి, 'నిన్నే నేను చూడాలి..ఏదో నీకు చెప్పాలి ' అని పాడుకుంటూ, చేత్తో తాలం వేసుకుంటూ, ఇంటి తాళం తీద్దామని అనుకుంటుండగా మన గజ-గజిని విషయం గుర్తొచ్చి, ట్యూన్ మర్చిపోతాం అని ఫోన్‌లో రికార్డర్ ఆన్ చేసి పాడుతుంటే, మా ఈదిలో వుండే పుట్టు-గజ్జి కుక్క ఆజ్ యూజువల్‌గా మొరగడం స్టార్ట్ చేసింది. అయినా సరే ట్యూన్ మర్చిపోతానేమో అని అలాగే పాడి రికార్డ్ చేసుకుని తర్వాత విని జడుసుకున్నా, "నిన్నే నేను చూడాలి...బౌ..బౌ...నీతో ఏదో చెప్పాలి...బౌ..బౌ" అని కుక్క గారి ఫెర్‌ఫెక్ట్ కోరస్‌తో రికార్డ్ అయ్యింది. మొదట్లో భయపడ్డా ఈ ప్రయోగం సినిమాల్లో కూడా చెయ్యొచ్చు కదా అనిపించింది. కుక్కలు, పిల్లులు...ఇలాంటీ వాటితో కోరస్ పాడిస్తే కొక్కొరొక్కే !!!

16-జనవరి-2009
లప్పంగిరిగిరి - 4
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* 'అరుంధతి..తి..తి..తి..తి..(echo).......కల కల కల కల ' అని ' చంద్రముఖారుంధతి ' combo కల రావడంతో ఉలిక్కిపడిలేచాను. గత మూడు నాలుగు రోజులనుంచి ఎక్కడ చూసినా అరుంధతి డిస్కషనే. అనుష్కాకి ఇంత మంది ఫ్యాన్స్ వున్నారా అని ఆశ్చర్యమేసింది. సినిమా రిలీజ్ రెండు రోజులు పోస్ట్ పోన్ అవ్వడంతో ఇంకా ఎక్కువ వాకబులు వినాల్సి వచ్చింది. ట్రెయిలర్స్ చూసి చాలా మంది మెస్మెరైజ్ అయినట్టున్నారు. నేను ఇంత వరకు చూడకపోయినా ఆళ్ళ వల్ల ఇలాంటి కల వచ్చింది. ఆపీస్‌కు రాగానే, మళ్ళీ అరుంధతి డిస్కషన్ మొదలయ్యింది. ఈ గోలంతా వింటున్న నానాంధ్రులలో (నాన్-ఆంధ్రులు) ఒకతను - 'ఇదేమన్నా అరుంధతి రాయ్ ఇన్స్‌పైర్డ్ స్టోరి నా ? అని డవుట్ అడగగా భలే నవ్వొచ్చింది, అవునూ తన స్టోరిని కూడా సినిమాగా తీయొచ్చొన్న ఆలోచనకూడా వచ్చింది. ఆపీస్ అయ్యాక సాయంత్రం మిత్ర బృందంతో వుండగా ఒక సొ సొ గా తెలుగు తెలిసిన సొగ్గాడు, సోదిగాడు అప్పుడే వచ్చి 'ఎస్ దిస్ అరుణ్ ఈజ్ ఇన్‌డీడ్ వెరీ వెరీ అతి ' అనగానే ఒక సెకండ్ ఎవరికీ అర్థం కాలే. తర్వాత బల్బ్ ఎలిగింది, మా ఫ్రెండ్ ఒకడు అరుణ్ అని వున్నాడు. మేము 'అరుంధతి...అరుంధతి ' అని మాట్లాడుతుండగా ఎంటర్ అయిన వాడు, 'అరుణ్...అతి, అరుణ్...అతి ' అనుకున్నాడంట.

ఇది తెలిసి నేను, 'ఓరినీ పెంట మైండ్‌లో పెంటియం ప్రాసెసర్ పెట్టా....' అని నా నోటికి స్నాక్స్ తినిపించా.

మొత్తానికి అరుంధతికి టూ మచ్ హిట్ టాక్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో తెలుగు టపా రాయడానికే ఓపిక లేకుంటుంటే అలాంటిది ఇలాంటి తెలుగు సినిమా తీయడానికి శ్యాం ప్రసాద్ రెడ్డి గారు చూపిన చొరవ, సాహసం, ఓపిక, నమ్మకం ఇంకా ఇలాంటి మంచి క్వాలిటీస్ ఎన్ని వర్తిస్తే అవన్నీ నిజంగా అభినందనీయం. ఈ సినిమాను బాగా ఇగ్నోర్ చేసిన నేను ఇప్పుడు, 'నిజమే ఏ 'ప్రింట్' లో ఏ పాము వుందో ఎవరికి తెలుసు ' అని అనుకుని పశ్చాత్తాపడుతున్నా.
అర్జెంట్‌గా ఈ సినిమా చూడాలని నాలోని దెయ్యం కూడా ఉవ్విళ్లూరుతోంది.
* ఏదో పని చేసుకుంటుంటే మా ఫ్రెండ్ బాబ్జి గాడి నుంచి ఫోన్ వచ్చింది. అమ్మో వీడా అని కట్ చెయ్యలేదు, ఎందుకంటే తెలిసిపోతుందని. అలా రెండు సార్లు వచ్చి ఆ తర్వాత రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా. అప్పుడే ఏదో కొత్త నంబర్ నుంచి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసా, చూస్తే మా బాబ్జిగాడే.
ఆడు: నాకు తెలుసు మామా నువ్వు ఇలా చేస్తావనీ....
నేను: (వార్ని....అని మనసులో) వార్నర్ బ్రదర్స్‌కు పరిచయం చెయ్యాల్సిన వ్యక్తివిరా నువ్వు...
ఆడు: ఈ పొగడ్తలకేం కాని...నీకు తెలిసిన డాక్టర్‌లు ఎవరన్నా ఉన్నారా ?
నేను: యే....? చిన్నప్పుడు టీకాలు ఏసుకోలేదా...మా ఈధిలో ఏస్తున్నారు వచ్చెయ్
ఆడు: టీ..కాఫీ లకే దిక్కులేదు, ఇంక టీకాలు కూడానా ? ఏమిలేదు....అప్పిచ్చు వాడు వైద్యుడు కదా అందుకు
నేను: మరి అప్పిప్పిచ్చువాడూ ?
ఆడు: స్తెథస్కోప్ అనుకోరాదే...పేషంట్ హార్ట్‌బీట్ తెలుసుకుని యాజ్ ఇట్ ఈజ్‌గా డాక్టర్ చెవులో ఊదేవాడనుకో...
నేను: అయినా డాక్టర్‌లు...అప్పు అది B.C కాలంలో కదరా ?
ఆడు: ఈ O.C కాలంలో కూడా ఆళ్ళే బెస్ట్‌రా బాబు..
నేను: (అమ్మో వీడు చాలా ఫ్లోలో వున్నాడు...అందులో నేను కొట్టుకుపోకుండా చూసుకోవాలి...)
ఆడు: ఏం మచ్చా సైలెంట్ అయ్యావ్. నువ్వెలాగో సాయం చెయ్యవని తెలుసు. అందుకే నీకు తెలిసిన వాళ్లతో అన్నా...
నేను: నేను ఏ సాయానికైనా రెడీ రా ఒక్క ఆర్థిక సాయం తప్ప.
ఆడు: అంటే అది ఒక్కటీ వుంటే ఇంకే సాయం అడగరు కదా...ఈ సారికి మాట సాయం ఒక్కటీ చెయ్యి, ఆళ్లకి చెయ్యి ఇవ్వకుండా వుండే పూచి నాది.
నేను: అయినా ఉన్నట్టుండి డాక్టర్‌ల పైన పడ్డావేంట్రా ?
ఆడు: రిసెషన్ బాబాయ్ రిసెషన్. దీని ఎఫెక్ట్ మీ మీద ఏమో కాని నా మీద చాలా పడింది. ప్రతి ఒక్కడూ ఇదే రీజన్ సెప్పి తప్పించుకుంటున్నాడు. మన దేశంలో రోగాలకు కరువు ఎప్పుడూ వుండదు కదా...సొ ఇప్పుడు డాక్టర్‌లే కరెక్ట్ అనీ..
నేను: ఆహహ...నీ బ్రేయిన్ బే ఆఫ్ బెంగాల్ అంత విశాలమైనది, లోతయినదిరా. అందుకేనేమో ఎక్కువగా అల్పపీడనాలు, వాయుగుండాలు వస్తుంటాయి....సర్లే కాని నాకు తెలిసిన డాక్టర్ ఒకడున్నాడు...కానీ అతనితో కష్టం. వాడు తెలివైన వాడు.
ఆడు: అంటే ఆవులిస్తే పేగులు లెక్కెట్టే టైపా ?
నేను: కాదు....
ఆడు: మరి...ఆవులిస్తే గేదలు లెక్కేట్టే టైపా?
నేను: కాదు...
ఆడు: మరి....ఎవడ్రా వాడు ?
నేను: ఆవులిస్తే డెయిరి ఫామ్ పెట్టే టైపు...వెటర్నరి బిజినెస్ మాన్...
ఆడు: అదేంటి ?
నేను: పేరుకి వెటర్నరి డాక్టర్, సైడ్ బిజినెస్‌లు చాలా వున్నాయి మరి
ఆడు: ఇంక ఆడు నాకేం ఇస్తాడు ? హలో...హలో...అరె సిగ్నల్ సరిగ్గా రావడం లేదు నేను మళ్ళీ కాల్ చేస్తా.
ఎవడన్నా దొరికితే సెప్పు, సిగ్నల్ లేకపోయినా కాల్ చేస్తా...

కాల్చేస్తా...కాల్చేస్తా...అన్న మాట రీసౌండ్‌లో వస్తూ కాల్ కట్ అయ్యింది. నెక్స్ట్ టైం ఈడి నుంచి కాల్ వస్తే ఎలా అవాయిడ్ చెయ్యాలా అని ఆలోచిస్తూ పడుకున్నా.

15-జనవరి-2009
లప్పంగిరిగిరి - 3
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!
* దెబ్బ తగిలిన చోటే ఎవడో ఒకడు కాలెడతాడు. సరిగ్గా అదే విధంగా ఏనాడూ లేనిది చాలా త్వరగా లేచాను. కాని పండగ రోజు సెలవు కాబట్టి ఈ రోజు పేపర్ రాలేదు. తాగుబోతుకి సాయంత్రం అవ్వగానే చుక్క దొరక్క పోతే ఎంత చిరాకు పడతాడో ఒక్క కొత్త పేపర్ ముక్క దొరక్క వర్చువల్ నరకం చూసాను.

* ఈ చిరాక్స్ తోనే మన రెగ్యులర్ టిఫిన్ సెంటర్‌కి వెళ్లగానే పార్సిల్ కౌంటర్ అతను నన్ను చూడగానే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాడు. నా రోటీన్ టిఫిన్ 'సింగిల్ ఇడ్లి, సింగిల్ వడ ' కాబట్టి. టైపింగ్‌లో స్పేస్ బార్‌తో వచ్చే స్పేస్‌లో కూడా వెరైటి వుంటే బాగుంటుందనుకునే వెరైటిక్కమాలోకం అయిన నేను ఇలా ఒకే టిఫిన్‌కు ఫిక్స్ అయ్యిపోవడమేంటా అని అందరికీ డవుటు.

దీన్ని యీక్‌పాయింట్‌గా పట్టుకుని ఆడుకోవాలనుకునే ఫ్రెండ్స్ ఒక సారి ఉండబట్టలేక 'ఏంట్రా ఎప్పుడూ ఒకే టిఫిన్ తింటావా ? అందులో ఏమన్నా విటమిన్ ASDFGH.... లు వున్నాయా ? అని అడిగితే...

'నాకు ఇడ్లిని చూస్తే ఇలియానా, చట్నీని చూస్తే ఛార్మి, గుర్తొస్తారురా' అని చెప్పా.

'ఆహా మరి వడను చూస్తే వాణి విశ్వనాథ్ గుర్తొస్తుందా ?' అని ఒకడు, 'వడి వుక్కరసి....???' అని ఇంకోడు....ఇలా గెస్ చేస్తుంటే....'కాదు, వ్లాదిమిరో పుతినో పులిహారో పూం పుహారవకొవ్, ద గ్రేట్ రష్యన్ సూపర్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని సెప్పీ సుక్కలు చూపించి ఎస్కేపా.

నిజానికి ఈ టిఫిన్ అలవాటు చేసుకోడానికి ముఖ్య కారణం అత్యంత వేగంగా పార్సిల్ లభించే టిఫిన్ ఇదే. దోస, పూరి లాంటి దీర్గకాలిక, ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లకన్నా ఇదే మేలు అని అలా ఫిక్సయిపోయా.

ఇడ్లి ఒక్కటే తీసుకుంటే పేషంట్ టిఫిన్ అవుతుంది. వడ ఒక్కటే తీసుకుంటే వాలంటరీ రిటైర్మెంట్ వస్తుంది. అందుకే ఇడ్లి, వడకి పెళ్లి చేసి కాపురానికి కడుపులోకి పంపుతుంటా.

మా వాలకం చూసి టిలీగ్ (కలిసి పని చేసేవారిని కలీగ్ అంటే, కలిసి టిఫిన్ తీసుకెళ్లే వారిని టిలీగ్ అనే కదా అనాలి ?) షాక్ అవుతుంటే ఆడికి సెప్పే ఓపిక లేక పార్సిల్ తీసుకుని వచ్చేసా.

* నగరం నడి ' బొడ్డు ' లో కె. రాఘవేంద్ర రావు 'B.A' గారి సినిమాక్స్ మల్టిప్లెక్స్ స్టార్ట్ అయ్యిందని తెలిసి ఎగ్జైట్ అయ్యా. ఎందుకంటే అంతకు వారం క్రితమే నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి. చిన్నప్పటి నుండి వున్న బలమైన కోరికలలో గురువుగారి వాయిస్ వినాలన్నది ఒకటి. ఎందుకంటే ఆయన బయట ఎక్కడా ఏ ఫంక్షన్స్‌లోనూ మాట్లాడరు కాబట్టి.

ఒకసారి ETVలో తన ప్రోగ్రాం వస్తోందని తెలిసి చూడడానికి ఎంతో ట్రై చేసాకాని మిస్ అయ్యా. అలాంటిది వున్నపలంగా సినిమాక్స్‌కు వెళ్లాల్సి రావడం, గురువు గారిని చూడడంతో ప ని ని స స రింగ్ టోన్ రియల్ లైఫ్‌లో ప్లే అయ్యింది. పలకరిద్దామని అనుకుంటూ, నమస్తే సార్, నేను బి.అశోక్ వర్మ 'B.Tech' అనబోయాను కాని నమస్తేకే మాటలు ఆగిపోయాయి. ఒక గొప్ప రుషిని చూస్తున్న ఫీలింగ్‌తో అలా వుండిపోయాను. మొత్తానికి ఆయన వాయిస్ వినగలిగాను. కన్‌స్ట్రక్షన్ పనిలో ఆయన బిజీ గా వుండడంతో పెద్దగా ఇంటరాక్షన్ కుదరలేదు. అయినా చాలా హేపిస్.

త్రివిక్రమ్ గురూజీని కలిసిన తర్వాత అంతగా ఎగ్జైట్ అయిన క్షణం ఇదే. పనిలో పనిగా థియేటర్స్ అంతా షుగర్ (చక్కెర) కొట్టా. చాలా బావున్నాయి అనిపించింది. ఆరేసుకుని పడుకోడానికి వీలున్న ఒకే ఒక మల్టిప్లెక్స్ ఇది. ఇది వారం క్రితం సంగతి. నిన్న మల్టిప్లెక్స్ ఓపెన్ అయ్యిందని తెలిసి, ఈ రోజు సినిమా చూద్దామని టికెట్స్ బుక్ చేద్దామని ట్రై చేస్తే విచిత్రమైన ప్రాబ్లెం వచ్చింది.

cinemax.co.inలో టికట్స్ బుక్ చెయ్యాలంటే మినిమం 2 చెయ్యాలి. ఇదెక్కడి అన్-న్యాయం, అన్-ధర్మం, అన్-చట్టం, అన్-అన్నీ... నేనొప్పుకోను అని రకరకాలుగా అనుకున్నా. నేను ఎప్పుడు ఎల్లినా ఏకాకి గానే ఎల్తా. పోనిలే దోకాకి అవదామంటే, ఏ....కాకీ దొరకడంలేదు :(((

* సచిన్ టెండుల్కర్ ఫిలిం నగర్ దేవాలయంకు వచ్చాడని తెలిసి మరో సారి ఎగ్జైట్ అయ్యా. నేను ఆ దేవస్థానంను చాలా సార్లు దర్శించాను కాబట్టి. ఎప్పుడో చదువుకున్న transitive property గుర్తొచ్చింది. నేను గుడిని చూసాను. సచిన్ కూడా గుడిని చూసాడు. సొ నేను సచిన్‌ని చూసాను !!!

అని అల్పానందం పొందాను. ఎప్పుడో చదువుకున్న మ్యాథ్స్ తప్పులుంటే క్షమించండి అస్సలు అర్థమే లేదనుకుంటే మిమ్మల్ని నేను క్షమిస్తాను.

* శశిరేఖ పరిణయం సినిమా పాటలు కాజువల్‌గా పెట్టుకుని వింటుంటే, 'ఓ బుజ్జమ్మా' మరియు ' ఏదో....కొత్తగా వుంది ఈ వేళ ' పాటలు బాగా నచ్చాయి. మొదటిది సింగర్ రంజిత్ వల్ల బాగా వచ్చింది.

రెండో పాట బాధలో వున్న వారు వింటే:

జెంట్ ఐతే బ్రాందిలాగా...
లేడి ఐతే బఫెట్ లాగా అనిపిస్తుంది.


ఈ సినిమా గురించి ఫస్ట్ టైం విన్నప్పుడు, శశి అనే అబ్బాయి, రేఖ అనే అమ్మాయి పెళ్లికి సంబందించిన స్టోరి అనుకున్నా. నాకు సినిమా మాత్రం అంతగా నచ్చలేదు. మా జెనీ డార్లింగ్ ఏది చేసినా నచ్చుతుంది కాని ఈ సినిమాలో తను సరిగ్గా అతకలేదు. చందమామ సినిమా కూడా మొదట్లో నచ్చలేదు, చూడగా చూడగా బాగా నచ్చింది. అందులో 'నవ్‌దీప్-ఆహుతి ప్రసాద్ తాగి గొడవ పడే సీన్ ' ఈ మధ్య కాలంలో నాకు హాట్ ఫేవరెట్.

ఇలా వంశీ కృష్ణ (ఆయన వెరైటి కోసం కృష్ణ వంశీ అని పెట్టుకున్నారు. నేనూ వెరైటి కోసం ఇలానే పిలవాలనుకుంటున్నా) 'సినిమా చూడగా చూడగా బాగుండును ' లాజిక్ కూడా దీనికి వర్క్ అవుట్ కాకపోవచ్చు. జెనీ ప్లెయిన్ సారీస్‌లో చాలా క్యూట్‌గా వుంది.
సో ఈ రోజు ఫస్ట్ టైం కాటన్ సారీస్‌తో కల్లోకి ఎంటర్ అవ్వబోతోందన్నమాట :)

14-జనవరి-2009
లప్పంగిరిగిరి - 2
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* 'పావు తక్కువ తొమ్మిదైందే పద్మావతి ' అని ఎవడో గట్టిగా 'నచ్చావులే' పాట ప్లే చేస్తుంటే 'ఏడిచావులే' అని వాడ్ని తిట్టుకుంటూ నిద్రనుండి లేచాను. టైం చూస్తే 'పావు తక్కువ పదకొండు అయ్యింది '. ఫోన్ చూస్తే ఇంటినుంచి చాలా కాల్స్ వున్నాయి, అమ్మో అని అమ్మకు వెంటనే ఫోన్ చేస్తే ' ఏరా ఇప్పుడే లేచావా ? ఈ రోజు సంక్రాంతి అని తెలుసా ? , బహుశా ప్రపంచంలో ఏ తెలుగోడు ఈ రోజు ఇంత లేట్‌గా లేవడు...' అని తిట్లాష్టకం స్టార్ట్ చేస్తుంటే, 'హే మామ్స్, కూల్...కూల్‌గా వుందని...అయినా నేను మీ అందరికన్నా ముందే మేల్కొని 12 నుంచి 4 గంటల వరకు సంక్రాంతి జరుపుకుని పడుకున్నా, మీరంతా నన్ను చూసి నేర్చుకోవాలి...' అని రివర్స్ క్లాస్ పీకి ఎస్కేపా.

* పేపర్ చూడగానే, చలి మనకే కాదు పేపర్‌కు కూడా వుంటుంది అన్న కొత్త యాంగిల్ తెలిసింది. అందుకే ప్రతి ఒక్కరినీ పట్టించుకునే సి.యం గారు ఒక స్వెటర్/జెర్కిన్/జాకెట్‌ను సంక్రాంతి సందర్భంగా వార్తా పత్రికలకు దానం చేసారు . ప్రకటనలను కూడా న్యూస్ ఐటంలా భ్రమింపజేసే వినూత్న వొరవడికి శ్రీకారం చుట్టిన వై.యెస్ గారికి జోహార్స్.

* అతి చిన్న వార్తగా వచ్చిన ఒక ఐటం నన్ను విశేషంగా ఆకర్షించింది. చేతి నిండా పని లేక చెయ్యి చూసుకుంటుంటే ఒక శాస్త్రవేత్తకు సందేహం వచ్చి రీసెర్చ్ చేస్తే, చూపుడు వేలుకన్నా ఉంగరం వేలు పొడుగ్గా వుంటే వాళ్ళు స్పైడర్ మాన్, బాట్ మాన్ లకు ఎక్కువ జెంటిల్ మాన్‌కు తక్కువ అని తేల్చేసాడంట. వెంటనే నా చెయ్యి చూసి వావో వావు...నా ఉంగరం వేలు, చూపూడు వేలు కన్నా పొడుగ్గుందోచ్ అని మురిసిపోయాను. వెంటనే సిక్స్త్ సెన్స్, సిక్స్త్ క్లాస్ సెన్స్ చెప్పింది - 'అరె వో గెవడికైనా గట్లనే వుంటుంది బే' అని. అవును కదూ అని లైట్ తీసుకున్నా. ఎందుకంటే 'విశ్వసనీయ వర్గాల కథనం' మేరకు ఆ ప్రముఖ దిన పత్రిక రీసర్చ్‌ల పేరుతో చెప్పేవన్నీ తూచ్ అని నాకు గట్టి నమ్మకం. ఫ్లాష్ బ్యాక్‌లో ఒక రోజు ఆ రోజు పేపర్ చదువుతుండగా, దాని పక్కన పదిహేను రోజుల కిందటి అదే బ్రాండ్ వారి పేపర్ వచ్చి పడింది. ఒక దాంట్లో ఏమో రోజూ కాకా హోటల్‌లో కాఫీ తాగితే కాకర్ల హాస్పిటల్(నిమ్స్)కు వెళ్తావ్ అని చెప్తే, ఇంకొక దాంట్లో రోజూ కాఫీ తాగని బతుకు ఒక బతుకే కాదు, బ్రహ్మీ తాతయ్య తలరాతలను కాఫీ తాగుతూనే వ్రాస్తాడు, సో ఆ అలవాటు అసైన్ చేసినవారికి ఆయుష్ షాంపూ వేసి తలంటి స్నానం చేయిస్తాడు అని ఒక రేంజ్‌లో చెప్పారు. ఆ రోజు నుంచి 'అమ్మ దొంగా' అనుకుంటా సదరు న్యూస్ పేపర్ వారు అలాంటి వార్తలను ఇస్తే. కాని వాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా 'అమ్మ-మ్మ దొంగా అనిపించేలా ఇలాంటి వార్తలను దంచేస్తూనే వున్నారు.

* సచిన్ టెండుల్కర్ రంజీ ఫైనల్స్‌లో డక్ అవుట్ అయ్యాడంట. ఇందులో అంత స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా ? ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఫస్ట్ టైం అంట డక్ అవుట్ అవ్వడం. మంచి G.K బిట్ కదూ !!!

* 'నావి పిల్లి కళ్ళు, మేక మెడలు........ అని మా పిన్ని వాల్ల పెద్దమ్మ అంటుంటుంది...' లాంటి సోది మాటలు మత్రమే చెప్పేవారు కాస్తయినా, CAT ఎగ్జాంలో మంచి పెర్సెంటైల్ సంపాదించిన అంథురాలి నుంచి ప్రేరణ పొందాలి.

* "హేపీ సంక్రాంతి, సంక్రాంతి హేపి" లాంటి అరడజను SMSలు, అర-అరడజను ఫోన్ కాల్స్, అరవై ఉత్తుత్తి గుంపులో గోవిందం మెయిల్స్, "ఏరా ఊరికి పోలేదా ?, నీదీ ఒక లైఫారా, అసలేం పీకుతుంటావ్ బే నువ్వు ?" అన్న చిన్న పాటి కామెంట్లు, 'అడ్డం జరుగుతావా...అంకుల్ అనమంటావా' అని బెదిరించే మా కాలనీ పిల్లలతో, పెద్ద పాటి ఎలుకలు (వీటినే చాలా ఏరియాలలో పంది కొక్కులు అంటారు) కడుపులో కాలింగ్ బెల్ కొడుతుంతే మా ఏరియా అంతా హోటల్స్ మూసివేసుండడం వల్ల పండగ వస్తే బ్యాచిలర్‌లకు ఎన్ని కష్టాలో సర్వే చేస్తూ 'అహ నా పెళ్లంట ' సినిమా లో కోటా/రాజేంద్ర ప్రసాద్ మెనుతో సర్దుకుంటూ సంక్రాంతి జరుపుకున్నా.

* మా ఫ్రెండ్ గాడికి మెయిల్స్ 'ఫార్వర్డ్' చెయ్యడం చాలా ఇష్టం. 'బ్యాక్‌వర్డ్' చెయ్యడం కూడా ఇష్టమే యెప్పుడూ ఆ ఆప్షన్ కోసమే వెతుకుతూ వుంటాడు. వాడికి ఈ రోజు ఒక్క ఝలక్ వచ్చిందంట. మెయిలింగ్ లిస్ట్‌లో ఎవడెవడున్నాడో చూసుకోకుండా ఫార్వర్డ్ చెయ్యడంతో ఫారిన్ కష్టమర్‌లకు కుడా సంక్రాంతి విషెస్ పంపించాడు. ఇక్కడ ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది. 'sonkranti wishes' అని పంపడం వల్ల, 'Congratulations on having a new baby boy, kranti !' అని రిప్లై వచ్చిందంట.

* సెలవు రోజు అయ్యుండి 'మస్కా' సినిమా చూసేసి ఫాస్టెస్ట్ రివ్యూ పెట్టడానికి పోటి పడాలని ఎందుకు అనిపించలేదా అని డవుట్ వచ్చింది. ఎడారిలో ఒయాసిస్ అవ్వాలనుకోవాలే కాని, ఇసుక కావలనుకోకుడదు అని జ్ఞానోదయం అయ్యి సర్దీ(జలుబు) తో సతమతమవుతున్న నాకు నేనే సర్ది చెప్పుకున్నా.

అట్‌లీస్ట్ సినిమా చూద్దాం అని మూడ్ వచ్చేసరికి ఆ రోజు టికట్స్ అన్నీ బుక్ అయ్యాయని తెలిసింది. ముందు రోజు అనుకుని వుంటే ఆ పాటికి సినిమా కూడా చూసేసుండొచ్చు అనిపించింది.

ఈ దారి గుండా వచ్చినందుకు సెప్తున్నా (by the way), యే సినిమా అన్నా మొదటి రోజు మొదటి షో, (ప్రోబబ్లి స్టేట్ మొత్తంలో మొదటి షో) చూడాలనుకుంటే చాలా వీజి. bookmyshow.comలో ప్రసాద్స్‌లో ముందు రోజు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 9 - 10.30 మధ్య ఫస్ట్ షో మొదలవుతుంది. చాలా మంది టాలివుడ్ big wigs, చిన్న చిన్న విగ్స్ పెట్టుకున్న వారు వస్తారు. idlebrain జీవి గారు ఇంకా చాలా వెబ్‌సైట్స్ వారు కూడా ఈ షో కి వచ్చే రివ్యూస్ వ్రాస్తారు. నేను కూడా ఈ పద్దతిలోనే చాలా సినిమాలు చూసాను.

పైగా నాకు పాచి మొహంతో లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, రిలీజ్ సినిమాలు చూడడం అంటే తెగ ఇష్టం. అందుకే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో క్రికెట్ మ్యాచ్‌ల కోసం వెయిట్ చేస్తుంటా.

ప్రసాద్స్‌కు ఒక మంచి ఆల్టర్నేటివ్ 'easymoviesindia.com'. కాకపోతే ఇందులో ఖాతా తీసుకోవాలి. మినిమం ప్యాకేజ్ 300 రుపీస్‌గా వుంది. ఇందులో ఒక ట్విస్ట్ వుంది. ప్రతి నెలా 30 రుపీస్ సర్వీస్ చార్జెస్ కింద కట్ చేస్తారు. మీరు ఖాతా తీసుకునే ఆఖరి క్షణం వరకు ఈ విషయం చెప్పరు. ఈ ఒక్క విషయం తప్ప అన్నీ రకాలుగా చాలా హెల్ప్ చేస్తుంది easymovies. ఎంతటి క్రేజ్ ఉన్న సినిమాకైనా చాలా ఈజీగా టికెట్స్ దొరుకుతాయి.

ఇన్ని ఆప్షన్స్ వున్నా, చాలా మంది మూడు రోజుల నుంచి ట్రై చేస్తునా టికెట్స్ దొరకట్లా/బ్లాక్‌లో కొని వైట్ వాష్ అయ్యాం అని నానా రకాల కష్టాలు ఎందుకు సెప్తారో అర్థం కాదు, 'ఇంటర్నెట్ హై నా !!!'

* జంధ్యాల గారి జయంతి సందర్భంగా 13,14,15 తేదీల్లో రవీంద్ర భారతిలో 'హాస్యోత్సవాలు ' జరుగుతాయని 12 నే తెలుసు. 13 న,

'మండే (monday) ముందు ఏమి వస్తుంది ?' అంటే 'పొగ ' అని సమాధానం చెప్పడం, 'విష్ణువు, లక్ష్మి, శివుడు ' యే యే లింగాలో చెప్పు అని మాష్టారు అడిగితే, 'విష్ణువు పుం లింగం, లక్ష్మి స్త్రీ లింగం, శివుడు శివలింగం' అని విధ్యార్థి సమాధానం చెప్పడంలాంటి జోక్స్‌తో బాగా అలరించారు అని తెలిసినా, 14 న ఖా
ళీగా వున్నా వెళ్లని నాలాంటి బై బర్త్ బద్ధకిస్ట్‌లను ఖాళీ పిస్టోల్ తో కాల్చి కాల్చి చంపాలి.

లప్పంగిరిగిరి - 1
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!!

* ఈ రోజు మార్నింగ్ బ్రాయిలర్ కోడి కొక్కొరొకో అనే టైమ్ కాదు కానీ , సదరు కోడిగారు చికెన్ సెంటర్లకు/కస్టమర్ ఇల్లకు సరఫరా షురు అయ్యే టైంకు అటు ఇటుగా 9 - 9:30 మధ్య లేచాను. లేవ గానే డోర్ బయట ఉన్న ఈనాడు, సాక్షి పేపర్లను తెచ్చుకుని నాలుగు న్యూస్ పేపర్‌లను వేసుకుని చదవడం స్టార్ట్ చేసా. నాలుగు ఎందుకంటే నిన్నటి ఈనాడు, సాక్షిని నేటి కాపీస్‌తో పోల్చి చదివితేనే పొద్దునే నాలుగు రకాల కషాయం తాగిన ఫీలింగ్ వస్తుంది.

* హాట్ వాటర్ కోసం హీటర్ పెట్టుకుని, వేడి అయ్యాయా లేదా అని చూడగా, కొంచెం వేడిగా కొంచెం చల్లగా అనిపించింది. వెంటనే KIKK సినిమా (కొంచెం ఇష్టం కొంచెం కష్టం) గుర్తొచ్చి, నిన్న 'అబ్బా ఛా' ఆర్కుట్ కమ్మ్యూనిటీలో చూసిన దారం గుర్తొచ్చి, 'అబ్బా ఛా' సాంగ్ కోసం నెట్‌లో వెతికి ప్లే చేసా.

అహా ఆహా ఏం బీట్ వుంది సాంగ్లో. చాలా రోజుల తర్వాత బాగా ఎగరడానికి స్కోప్ ఇచ్చిన పాట వచ్చింది. 'జింతాక్ జింతాక్' తర్వాత ఆ రేంజ్‌లో కాకపోయినా ఓ మాదిరి రాన్‌డం స్టెప్స్ వేసుకోడానికి ఉపయోగపడే పాటొచ్చింది. అలా విచ్చల విడిగా ఎగురుతుండగా కనుచుపుమేరలో ఎవరో చిన్నది టెర్రెస్ పైన నించుని మరీ ఇదంతా గమనిపిస్తున్నది గమనించి బ్రేక్ డాన్స్‌ను బ్రేకా.

* ఆపీస్‌కు ఎల్లగానే, అందరూ 'సత్యం మీటింగ్‌లో' వున్నారని అర్థమయ్యింది. 'ఉప్పర మీటింగ్' రాజు కు సత్యం పర్‌ఫెక్ట్ వారసుడు మరి. అంతలోనే 'లెయ్ బే లెయ్' (Layoffs) గురించి డిస్‌కషన్ వచ్చీ ఎవరో గూగులమ్మను అడిగితే వెంటనే 'jobeehive.com' గురించి చెప్పింది. అందులో మాస్టారు భలే తెలివిగా ఎక్కడెక్కడ Layoffs జరుగుతున్నాయో బాగా ఇచ్చాడు. శవాలపై మరమరాలు ఏరుకుని భేల్ పురి చేసుకోవడం అంటే ఇదేనేమో అనుకుని, మొత్తానికి సూపర్ అవిడియా తట్టింది ఈడికి అనీ వీలైతే ఈ మరమరాలను మనమూ సేకరించి నానబెట్టి ఉగ్గాని టిఫిన్ చేసుకుందాం అని డిసైడ్ అయిపోయా.

* మధ్యాహ్నం భోజనానికి చెలికత్తెలతో (కలీగ్స్) Chattees(36) రెస్టారెంట్‌కు వెళ్ళాను. అందులో 'Bar-B-Q' ఉంది. అదే కేక. కాంప్లిమెంటరీగా కూల్ డ్రింక్స్ ఇస్తారని తెలుసు కాని, ఫ్రెష్ లైం సోడా లాంటివి కూడా ఇస్తారనీ, అడిగిన వాళ్ళకి కార్పొరెట్ డిస్కౌంట్ 10% ఇస్తారనీ ఈ రోజే తెలిసింది. ఇంతక ముందు వెళ్ళినప్పుడు ఇవి అడగకుండా వున్నందుకు బాగానే దొబ్బించుకున్నాం, డబ్బిచ్చుకున్నాం. సో ఈ రెస్టారెంట్ ట్రై చేసే వాళ్ళు ఈ విషాయాలను కాపిటాలైజ్ చేసుకోండి.

* మేసాక, తిరుగు ప్రయాణంలో నా వెనక కూర్చున్న చెలికత్తెకు ఎందరో ఎప్పుడో గుర్తించిన, నేను ఈ మధ్యే గుర్తించిన సైబర్ టవర్స్ సిగ్నల్‌ను అవాయిడ్ చేసే రూట్ చూపడంతో ఆ చెలికత్తే కుడా మిక్కిలి ఆనందించింది. జూబ్లీ హిల్ల్స్ నుంచి సై
ర్ టవర్స్ సిగ్నల్ వైపు వచ్చి, లెఫ్ట్ తీసుకునే ఈ దారి తెలియకపోతే వెంటనే తెలుసుకోండి, తెలుసుంటే లైట్ తీసుకోండి. ఆ సిగ్నల్ రాకముందే విభా సీడ్స్/బిర్లా సాఫ్ట్ కంపనీస్ దగ్గర ఒక లెఫ్ట్ తీసుకుంటే My Home Hub అపార్ట్‌మెంట్స్ వెనక నుంచి ఒక రోడ్ వచ్చి, 'వెన్నెల/కోమల ' హోటల్స్ టచ్ చేస్తూ మోటోరోల కంపెని ఎదురుగా కనిపిస్తూ ఆ రోడ్‌ను టచ్ చేస్తుంది. చాలా మంచి షార్ట్ కట్ గురు !!!

* ఒక స్నేహితుడి సౌజన్యంతో ప్రపంచం మొత్తం ముర్‌గి/Hen అయ్యి కూస్తున్న Hinglish సినిమా 'స్లం డాగ్ మిలియనేర్ ' సినిమా చూసేసా. కెబిసి కి, ఒక స్లం కుర్రాడి లైఫ్‌కి లింక్ పెట్టి స్టోరి రాసిన వికాస్ స్వరూప్ కి సిటికెలు. ఇదే సందర్భంలో ఫిల్మ్ ఇండస్ట్రి క్రియేటర్స్ అందరూ తాము వండుతున్న సినిమాలకు, 'A Wednesday' వంటకం కు పోలిక చూసి అవాక్కయ్యేలా చేసిన నీరజ్ పాండే్‌కు సిన్సియర్ సిటికెలు.

* ఈ రోజు మార్నింగ్ నుంచి న్యూస్ సైటులు చాలా సార్లు బ్రౌజ్ చేస్తూనే వున్నాను. మన మేధావులు కనిపెట్టిన పాటర్న్ ప్రకారం, ఈ రోజు టెర్రరిస్ట్ అటాక్ జరగాలి. అది నిజంగానే జరుగుతుందేమో అని ఇప్పటివరకు కుతూహలంతో ఎదురుచూసాను.

మే 13 - జైపూర్ బ్లాస్ట్స్

జూన్‌లో ఏవి లేవు

జూలై 26 - అహ్మదాబాద్ బ్లాస్ట్స్

ఆగస్ట్ ఏవి లేవు

సెప్టంబర్ 13 - ఢిల్లీ బ్లాస్ట్స్

అక్టోబర్ ఏవి లేవు

నవంబర్ 26 - ముంబాయ్ బ్లాస్ట్స్

డిసెంబర్ ఏవి లేవు

జనవరి 13 ?????????

జనవరి - జనం వర్రీ అయ్యేలా ఇలా ఈ పాటర్న్ బాగా పాపులర్ అయ్యింది. కాని మొత్తానికి అంతా వట్టిదే అని ప్రూవ్ అయినందుకు హాపీసు చాలా హాపీసు.