14-ఏప్రిల్-2010
లప్పంగిరిగిరి - 16
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!
* కొద్ది రోజుల క్రితం ఈనాడులో ఐ.ఐ.టి ప్రొఫెసర్ రాం గోపాల్ రావు గారి గురించి వచ్చిన ఆర్టికిల్ చూసి ప్రొఫెసరోత్సాహం కలిగింది. ప్రొఫెసరోత్సాహము స్టూడెంట్‌కి, ప్రొఫెసర్ పరిచయం అయినప్పుడు పుట్టదు, జనులా ప్రొఫెసర్‌ని కనుగొని పొగడగ ప్రొఫెసరోత్సాహంబు నాడు పొందుర సుమతి, కాలమతి, మందమతి !!! అన్న పైత్యం గుర్తొచ్చింది.
రావు గారు నాకు 2003 లో ఐ.ఐ.టి లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించారు. మొదటి చూపులోనే ఆయనలో మాంచి స్పార్క్ కనిపించింది. చాలా మెరిట్ ప్రొఫెసర్. నన్ను కలిసాక తనకు బాగా కలిసొచ్చింది. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ అందుకున్నారు. ఇప్పుడు గుండె ఎగస్ట్రాలు చేస్తే ఇట్టే కనిపెట్టే పరికరం రూపొందించారు. ఇది ఇ.సి.జి కన్నా మెరుగైనదంట. ఇక గుండె గుండు కొట్టించుకోవాల్సిందే ! ఇంత నిరాడంబర ప్రొఫెసర్ గారితో నాకు రెండు నెలల అనుబంధం ఉండడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ఇంకా ఎన్నో సాధించాలని, అవన్ని నేను ఇలాగే ఈనాడులో చూసుకోవాలని ఆశిస్తున్నా.
* జెమిని టి.వి ' నువ్వు నేను ' అనే ఆలు మగల ప్రోగ్రాంలో డైరెక్టర్ సూర్య కిరణ్ తన మమ్మీకీ తాను ఇచ్చిన పుట్టిన్ రోజు కానుక గురించి చాలా క్యాజువల్‌గా సెలవిచ్చారు. ఆ ఐడియా విని నాకు కాస్పరోవ్‌భాష్పాలు కావు కావు మంటూ కారాయి. ఇంతకి ఐడియా ఏంటంటే, తను ఒక పెద్ద పాకెట్ వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడు. అది ఓపెన్ చేస్తే ఇంకో చిన్న పాకెట్, అందులో ఇంకోటి, అందులో ఇంకా చిన్న ప్యాకెట్ ఇలా లోలోలోలో...పల ఫైనల్‌గా ' పాల పాకెట్ ' పెట్టాడంట !!! :)
ఐడియా జస్టిఫికేషన్: అమ్మా నువ్వు నాకు చిన్నప్పుడు పాలు ఇచ్చావు కదా, నేను నీకు ఇప్పుడు అలా ఇవ్వలేను కదా అందుకోసమే ఈ ఆవు పాల పాకెట్ అమ్మా !!! అని చెప్పాడంట.
* ఫ్లో లో వచ్చిన వింత మాటలు:
ఏదో సందర్భంలో ఎవరికో నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను అని చెప్పబోయి నేను, ' నా...( పాజ్ )...నా కృతజ్ఞతలు ' తెలుపుకున్నాను అని చెప్పాను. అవతలి వ్యక్తి, ' నానా కృతజ్ఞతలు ' కూడా తెలుపుకుంటారా అన్నాడు. ఇదేదో బావుందే అనిపించింది.
ఇలాంటిదే ఇంకోటి, ' వాడు చాలా ఓవర్, టూ మచ్ ' అనబోయి ఫ్లో లో ' వాడు చాలా ఓ..మచ్ ' అన్నాను. అవతలి వ్యక్తి... ' ఓ మచ్ ? ' అని బిత్తర మొహం వేసాడు !
* ' అహ నా పెల్లంట ' కోట టైప్స్‌లో నేను కూడా కళ్ళ జోడు లేని కోట లాంటి వాడినేనని నా ఫీలింగ్. ప్రతి దానికి ' నా కేంటి ? ' అని ఆలోచించడం బాగా అలవాటయిపోయింది. తెలుగు బ్లాగింగ్‌లో కూడా గూగుల్ యాడ్‌సెన్స్ తీసుకొస్తే ఎంత బావుంటుందో అని చాలా సార్లు అనుకున్నాను. గూగుల్గాడు కాకపోయినా ఎవరన్నా తెలుగు బ్లాగింగ్ నుంచి కూడా సంసార పక్షంగా ఓ నాలుగు బీడులు కొనుక్కునే డబ్బులు సంపాదించే వెసులుబాటు కలిపిస్తే కిక్కే కిక్కు.
* ఆర్కుట్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో గంటలు గంటలు గడిపే వాళ్ళు కూడా, అబ్బాయిలైతే ఓ క్వార్టర్, అమ్మాయిలిలైతే అర లీటర్ పెర్‌ఫ్యూం బాటిల్ కొనుక్కునేలా అయినా గూగుల్ యాడ్‌సెన్స్‌ని ప్రొఫైల్‌లో వాడుకునే సౌలభ్యం ఇస్తే బావుంటుంది.
ఇప్పటికే చాలా యాక్టివ్‌గా ఉండే అమ్మయిల ప్రోఫైల్స్‌ని వందల కొద్ది అబ్బాయిలు ఊరకేస్తుంటారు (ఊరకే చూస్తుంటారు కి షార్ట్ ఫార్మ్). పాపం ఇలాంటి వారికైనా వారి మేకప్ ఖర్చులు...లాంటివి వస్తే, ' పొద్దస్తమానం ఆ కంప్యూటర్ మీద పడి యేం చేస్తుంటావే' అనే అమ్మ రోటీన్ మాటలకు ' నాలుగు నూకల్స్ సంపాదిస్తున్నానమ్మా ' అని చెప్పి సర్దుకునే అవకాశం వుంటుంది.
* అసలు విషయం చెప్పడం మరచా. నేను ఇంత లేట్‌గా ఈ టపా రాయడానికి కారణం ' వరుడు '. బాబోయ్ వరుడు నిజంగా కూష్మాండో కూష్మాండా, బోరాతి భోరం !!! మొదటి రోజు సినిమా చూసినప్పటి షాక్ నుంచి ఇంకా తేరుకోలా !!!