25-మార్చి-2010
లప్పంగిరిగిరి - 15
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

-- ఈ మధ్యే ఉగాది కన్నా ప్రపంచ పిచ్చుకల దినాన్ని ఘనంగా, ఏమిచెయ్యకుండా ఆలోచిస్తూ జరుపుకున్నా। ఇన్ని రోజులు హైదరాబాద్ కాకులు మాత్రమే దూరని కారడవి అనుకునేవాడినే కాని పిచ్చుకలు కూడా దూరడం లేదని తెలిసి కడు విచారం వ్యక్తపరచాను. ఇన్ని పక్షులు దూరడానికి కష్టపడుతుంటే పావురాల పాపులేషన్ మాత్రం ఇంత భారీగా ఉందేంటబ్బా అని ఆశ్చర్యపడ్డా. నాకు పావురం యొక్క ' తుర్‌ర్‌ర్‌ర్‌ర్ ' శబ్దం కన్నా, కాకి యొక్క ' కావ్ కావ్ ' శబ్దమే ఇష్టం, ఇంక పిచ్చుకల యొక్క ' చిక్‌చుక్‌చిక్‌చంప్‌చిక్‌చింగ్‌చుక్‌చంట్‌చుస్స్‌చటక్‌చిక్॥' లాంటి శబ్దం మీద పెద్ద అవగాహన లేదు. కాని ఇంతవరకు నాదెప్పుడు కాకి గోలే, ఇక మీదట పిచ్చుక గోల కూడా అలవాటు చేసుకుంటా. మొత్తానికి కనీసం పిచ్చుకలకైన పీస్ దొరకాలని గాలి పీల్చకుండా రెండు సెకన్ల మౌనం పాటించి కోరుకున్నా.

-- మాధాపూర్ పోలిస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న (అంటే పేపర్ భాషలో దగ్గరగా ఉన్న అని అర్థం) ద మోస్ట్ ఫేమస్ మహా రాజా చాట్ బండార్‌కు స్థానచలనం జరిగిందోచ్.........
మొన్న కొత్త లొకేషన్ వెతుక్కుంటూ వెళ్తే మన టాలివుడ్ మ్యూజిక్ డైరక్టర్ ఆర్.పి.పట్నాయక్ కనిపించారు. అక్కడి చాట్ కన్నా స్పైసీగా వున్నారు...అంటే అపార్థం చేసుకోకండి డ్రెస్ బానే వేసుకున్నారు, కాని యమా హుషారుగా అటూ ఇటూ తిరుగుతూ ఎవరెవరినో విమర్శిస్తూనో/కామెంట్ చేస్తునో/కామెడి చేస్తునో...అంటే ఏం చేస్తున్నారో సరిగ్గా అర్థం కాకుండా ఏదో చేస్తూ కనపడ్డారు. నా ఐటంను లాగిస్తూనే తనతో ఎలా డిస్‌కషన్ మొదలెట్టాలో అర్థం కాక రెండు మూడు సార్లు ఆయన తన స్నేహితులతో నిల్చున్న ప్రదేశంలో రెక్కి నిర్వహించాను. నా ప్లేట్ ఖాళీ అవుతున్నా నా యెదవ మొహమాటం కొద్దీ ఇంకా మాట కలపలేదే అన్న ఆత్రుతతో సరిగ్గా ఆయన పానీ పూరికి ఉపక్రమిస్తున్న సమయంలో వెళ్ళి మాటకలిపా. ' మ్యుజిక్‌ని కంపోజ్ చేయ్యటం ఎలా సార్ ? ' అనడిగితే ' అది చాట్ బండర్లో చెప్పేది కాదమ్మా' అన్నాడు. దెబ్బకు నాకు చుక్కలు పానీ పూరి, పూరీల్లా కనిపించాయి. అంతటితో అక్కడనుంచి జంప్ జిలాని.
-- తెలుగును ఇంగ్లిష్‌లో టైప్ చేసి చాటింగ్ చెయ్యడం చాలా ఈజీగా ఉంటుంది కదా అలా బాగా అలవాటైన వాళ్ళకు తెలుగు బ్లాగింగ్ కష్టం అనిపించొచ్చు. చేతికొచ్చింది ఇష్టం వచ్చిన్నట్టు రాసే వెసులుబాటు చాటింగ్‌లో ఉంది. దాన్నే యథాతథంగా లేఖినిలో వేస్తే లెంపకాయలే లెంపకాయలూ, వాటిని బ్రూతులు అనొచ్చు ( బ్రూ కాఫీ అంత ఘాటైన బూతులన్నమాట ).
ఇలా రాసిన టెక్స్ట్‌ని ఎడిట్ చేసుకోవాలంటే బై బర్త్ బద్దకం డిగ్రీతో పుట్టిన నాలాంటి వారికి బహు కష్టం। అందు వల్ల ఎవరన్నా ఇలాంటి టెక్స్ట్‌ని లేఖినిలో తెలుగులో కరెక్ట్‌గా కన్వర్ట్ అయ్యే టెక్స్ట్‌లా మార్చే టూల్ తయారు చేసుంటే తెల్పగలరు। తెలిపిన వాళ్ళకు ఓ రెండు రోజులు, తయారు చేసిన వాళ్ళకు ఒక మూడు రోజులు రుణపడుంటాను. ఒకవేల ఇలాంటి టూల్ లేకపోతే నేనే ఒకటి రాసేద్దామా అన్న కొంటె ఆలోచనలు కూడ అప్పుడప్పుడు జంపింగ్ జంపింగ్ !!!

24-మార్చి-2010
లప్పంగిరిగిరి - 14
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

- చాలా రోజులనుంచి నేను బ్లాగింగ్ చెయ్యకపోయినా ఈ బ్లాగ్‌కు విజిటర్స్ వస్తున్నారే అని మొన్నీమధ్య ఆశ్చర్యం వేసింది. తీరా చూస్తే ఆ క్రెడిట్ మొత్తం ' ఆంటి 'కి దక్కుతుంది అని తెలిసి ఆరెంజ్ మొహం వేసాను. ఏదో తెలియక ' ఆంటి ' అన్న పదం బ్లాగ్‌లో వాడినందుకు ఇంత ఫాలోయింగ్ ఉంటుందా అనిపించింది. గూగుల్ లో ' ఆంటి ' అన్న పదాన్ని ఇంతగా మన తెలుగు వాళ్లు సెర్చ్ చేస్తారా అని ఆలోచిస్తూ ఈ సారి మెరిండా మొహం వేసాను !!!

- నిన్ననే నా మీసానికి మంగళం పాడాను. ఇరవై రోజులనుంచి గెడ్డం మరియు మీసం పెంచి మరీ రాత్రింపగల్లు ఎంత శ్రమించినా ఫిక్స్‌కాని ఒక కాంప్లికేటెడ్ ఆఫీస్ ప్రాబ్లం, నేను పరధ్యానంలో ఉండగా గెడ్డం మాత్రమే గీసుకుని మీసాన్ని గాలికి, వెలుతురికి ...ఇలా పంచభూతాలకి వదిలేసి ఆఫీస్‌కు వెళ్లి పనిచేస్తే అత్యంత విచిత్రంగా ఆ రోజే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. అప్పటి నుంచి తెగ సెంటిమెంట్ ఏర్పడి కేవలం మీసం విత్అవుట్ గెడ్డం మెయింటెయిన్ చెయ్యడం వల్లే తెగ కలిసొస్తోందని ఫాలో అయిపోవడం మొదలెట్టా.
ఇది గమనించిన స్నేహితులు ' రే కావాలంటే ఒకడు బ్లేడ్, ఇంకోడు రేజర్ ఇంకోడు నీ బదులు మీసం పెంచుతాడు ' కాని చూడలేక చస్తున్నాం నీకు దండం పెడతాం అది తీసెయ్ రా ' అన్నారు, ' ఒరే చిట్టి నాయుడు..ఉ..ఉ..ఉ..ఉ ' అని రెడీ సినిమా లో జయప్రకాష్ రెడ్డి ఇచ్చే రియాక్షన్ టైప్స్‌లో ఇచ్చే సరికి వాళ్ళే నిదానంగా అడ్జస్ట్ అయిపోయారు. నిన్న నాకే సిరాక్ దొబ్బి మీసాన్ని గీకేసా !!! దానితో మా బాస్బాసు (బాసు కు బాసు) సహితం ' అరే ఏంటి తేడాగా ఉన్నావ్. అవును నీకు ఇది వరకు మీసం ఉండేదిగా ' అని ఆశ్చర్యపడ్డాడు. ' అవును సార్ దానివల్లే మన ఇష్యూ సాల్వ్ అయ్యింది ' అని చెబుదామనుకుని ఒకసారి స్నేహితుల దిక్కు చూస్తే ' వద్దురా మా మూతులకు అన్యాయం చెయ్యొద్దురా ' అన్నట్టు చాలా దీనంగా మూతి ముడుచుకుని అర్ధిస్తుంటే జాలి వేసి ఆగిపోయా.
ఆఫీస్‌లో చాలా మంది నన్ను సరిగ్గా గుర్తుకూడాపట్టలేదు !!! మొత్తానికి సాయంత్రానికి జ్వరంకూడా వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే ఏంటి ప్రాబ్లం అన్నాడు. ' మీసం తీయడం వల్ల జ్వరం వచ్చింది ' అన్నాను. దెబ్బకు షాక్ తిన్న డాక్టర్ చేతిలో ఉన్న స్తెథస్కోప్‌ను తల మీద కూడా పెట్టి చూసి, ' ఏంటి బాబూ ఇంకో సారి చెప్పూ అన్నాడు...' అంటే జనవరిలో మీసం మాత్రమే పెంచడం వల్ల సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సార్. మార్చిలో తీయడం వల్ల జ్వరం వస్తుంది ' అని చెప్పా. ఈ సారి దిక్కులు చూస్తున్న డాక్టర్ అవస్థను గమనించి, ' నిజం సార్ నిన్న మీసం తీయడం వల్ల దిష్టి తగిలి జ్వరం వచ్చింది, అన్నాను. " దిష్టి తగిలితే జ్వరం వస్తుందో రాదో నాకు తెలియదుకాని ఏదన్నా డిస్టర్బన్స్ జరిగితే వస్తుంది..." అన్నాడు. 'అదే సార్ ఆ డిస్టర్బెన్సే దిష్టి వల్ల వస్తుంది ' అని నేను చెప్పబోతుంతే 5ml అని రాసిన ఇంజెక్షన్‌ను కాస్తా 10ml అని మార్చి చక చకా రాసిచ్చాడు - 5ml దిష్టి కి 5ml డిస్తర్బెన్స్‌కి అన్నట్టు !!!

23-మార్చి-2010

లప్పంగిరిగిరి - 13
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!


ఈ రోజు ఉదయం లక వచ్చింది. కొంచం డిఫరెంట్ కలని ' లక ' అనొచ్చు అన్నది నా అభిప్రాయం. సాధారణంగా జరిగిన విషయం రీమిక్స్ వర్షన్ కానీ, జరగబోయే విషయం యొక్క ట్రైలర్ గానీ, అస్సలు యే మాత్రం అర్థం పర్థం లేకుండా ఈ మధ్య వస్తున్న చాలా సినిమాలకు దగ్గర పోలికలా ఉంటూ వచ్చేవాటిని కలలు అంటారు. ఇలా కాకుండా జరిగిన విషయం యధాతథంగా గుర్తుకు వచ్చి గుచ్చి గుచ్చి 'మేలుకోరా తమ్ముడా / మేలుకోరా బామ్మర్దీ అని రక రకాలుగా తట్టి కొట్టి లేపేదాన్ని ' లక ' అనుకుందాం.
ఇక నా కొచ్చిన లక ఏంటంటే, పోయిన సంవత్సవరంలో నేను ఒక స్క్రీన్ రైటింగ్ వర్క్‌షాప్ అటెండ్ అయ్యాను. దానిని నిర్వహించింది కమల్ హాసన్. జీవితంలో నేను మొదటి వరసలో వాలంటరీగా వా రోజులు కూర్చున్నది బహుసా అప్పుడే. ఆ వా
రం రోజులు వర్క్‌షాప్‌ను మాగ్జిమం నోరు తెరిచే విన్నాను.
' విచిత్ర సోదరులు ' సినిమా చూసినది మొదలు చిత్ర విచిత్రంగా ఆ సినిమా గురించి, కమల్ గురించి చెప్పుకుంటూ వస్తున్న నాకు, కమల్ కు కరెక్ట్‌గా రెండు సీట్‌ల పక్కన కూర్చునే అవకాశమే ఎక్కువ అనుకుంటే, తను నేనడిగిన ప్రశ్నకు సుమారు 15-20 నిమిషాలపాటు నేను తల తిప్పకుండా తన దిక్కే చుసేలా చెప్పిన జవాబు నాకు ఎక్కుఎక్కువే !!!
ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే చాలా చిన్న ప్రశ్న, ఆ వర్క్‌షాప్ మొదటిరోజు ఒక సందర్భంలో కమల్ చెప్పిన విషయం:
ఏలాగైతే మన భాషను రెగ్యులర్‌గా మాట్లాడకపోతే తటపటాయిస్తామో, అదే బాగా ప్రాక్టిస్ చేస్తే ఈజీగా మాట్లాడుతామో అలాగే మంచి రైటర్ కావాలంటే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చాలా ముఖ్యం. రోజు ఏదన్నా రాస్తే మంచింది. నేను కూడా రోజు ఏదో ఒకటి రాస్తునే ఉంటాను.
అని అన్నారు.

ఈ విషయం నాకు వి.వి.ఎస్ లక్ష్మణ్ 281 ఇన్నింగ్స్ లా బలంగా గుర్తుండి పోయింది. ఆ వర్క్‌షాప్ ముగిసేలోపు కమల్ రోజూ యేం రాస్తోడో తెలుసుకోవాలన్న ఆరాటం ఎక్కువై చివరకి అడిగేసాను:
దానికి తను కూల్‌గా సమాధానం ఇస్తూ చిన్న చిన్న కధలు, కవితలు, ఆర్టికల్స్,..ఇలా ఏదో ఒకటి కచ్చితంగా రోజూ రాస్తాను అని ఉదాహరణగా ఒక కాంట్రవర్షియల్ పాయింట్ గురించి చెప్పాడు. అది సీతా దేవి అశోక వనం గురించిన అంశం.
అంశం కథ ఏమో గాని కమల్‌కు ఉన్న ఒక చిత్రమైన అలవాటు అప్పుడే గమనించాను. తనని ఎవరన్నా ప్రశ్న వేస్తే దానికి సమాధానమిస్తూ మొత్తం ఆడియన్స్‌ను చుట్టూ చూస్తూ వివరిస్తున్నా ఒక 30-40 సెకన్లలో మళ్ళీ చటుక్కున ప్రశ్న అడిగేవాడి దిక్కు చూస్తారు. దెబ్బకు ఆడు తలతో ఊకొట్టాల్సిందే !!!
ఇలా ఆ రోజు 15-20 నిమిషాలు నేను రెప్పకూడా సరిగ్గా వాల్చకుండా ఊ..ఊ...కొడుతూనే ఉన్నాను. అందుకేనేమో ఈ విషయం ఇంత బలంగా నాటుకుపోయింది.
మొత్తానికి కమల్ సలహా నన్ను ఇప్పటికీ రోజూ ఏదన్నా రాయి రా రాయి రా అని వెంటాడుతూనే ఉంది..........

05-మార్చి-2010

లప్పంగిరిగిరి - 12
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

చాలా రోజుల తరువాత మల్లీ బ్లాగింగ్ చెయ్యాలని మనసు టెల్లింగ్.......
నచ్చావులే మూవీలో మనోడికి మావిడి చెట్టు సీన్లో ఙ్ఞానోదయం అయినట్టు నాక్కూడా అయ్యింది, అదే జీవితంలో ఏదన్నా సాధించాలంటే ఫోకస్ చాలా ముఖ్యం అని. జీవితంలో నేను ఇంతవరకు నన్ను నేను మార్చుకోలేని ప్రధాన విషయాలు రెండు,

1. పీకల దాకా వచ్చేవరకు యే విషయాన్ని తెచ్చుకోకూడదు, 9 కుట్లు పడే దెబ్బ కన్నా ఒకటే కుట్టు పడే దెబ్బ మేలని యెన్ని దెబ్బలు తగిలినా ఇప్పటికీ లివింగ్ ఆన్ ద ఏడ్జే మన లైఫ్ స్టైల్.
2. ఇది వరకు చెప్పుకున్నట్టు ఒకేసారి ఎక్కువ పనుల మీద పడితే ఫోకస్ ఉండదు, ఒక్క దాన్ని ఎంచుకుని దాని మీద ఏకాగ్రత పెడితే ఎక్కడికో ...........వెళ్లిపోతామని !!!

చాలా ప్రయత్నం చేసాను దీనివల్ల రోజూ నిద్రలో కలలో ఎక్కడికో పోవడం తప్ప జీవితంలో ఇది వరకు ఉన్నంత కిక్ కూడా ఇప్పుడు లేకుండా పోయిందని తెలిసొచ్చింది. కొన్ని జీవితాలు ఇంతే కాబట్టి బాక్ టు పిచ్ (బాక్ టు పెవీలియన్ కు వ్యతిరేకం) !!!

-- ఇంటర్నెట్‌లో కొత్త సినిమా రివ్యూస్ చదివి వాళ్లు సూపరు అంటేనే ధియేటర్‌లో సినిమా చూసే ఎన్.ఆర్.ఐ ల టైప్స్‌లో నేను ఒట్టి ఆర్.ఐ అయినా కూడా అదే ఫాలో అవుతుంటాను. అలా ఈ మధ్య కాలంలో అత్యధిక రేటింగ్ ఇచ్చిన 'ఏ మాయ చేసావే' సినిమాకు సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పళ్ళు తోముకునే దాని కన్నా రెండు గంటల ముందుగా తోముకుని మరీ తెల తెల వారుతుండగా ఆదివారం పది గంటలకు పరిగెత్తుకుంటూ వెళ్లాను. కానీ సినిమా చూసి దిమ్మ తిరిగింది. ఈ ప్రపంచంలో నమ్మదగని వాళ్ల జాబితాలో ఆ మూడు (సాక్షి పత్రిక ఆ రెండు పత్రికలు ...అన్న స్టైల్‌లో) వెబ్‌సైట్స్‌ను కూడా చేర్చేసాను.

గౌతం మీనన్ స్నేహితులు, తనని ఎలా భరిస్తున్నారో ఏమో...వామ్మో ఇంత భారీ బోరింగ్, సెల్ఫ్ అండ్ సోది, సోడియం నైట్రేట్ డబ్బా ఎప్పుడు వినలేదు..ఇంక చూడడం నా వళ్ల కాలేదు. ఈ చిత్రం నుంచి తెలుసుకున్న నీతి ఏంటంటే ఎంత పరమ పరమెస్ట్ యాక్ స్క్రిప్ట్ అయినా వాక్‌చాతుర్యంతో కాని, అవాక్‌చాతుర్యంతో కాని పెద్ద పెద్ద పితామహులనుకూడా బురిడీ కొట్టించి సినిమా చెయ్యొచ్చని !!!

ఒంటరిగా వెళ్ళాను కాబట్టి సినిమా ఆసాంతం ఒకరి మోహాలు ఒకరు చూసుకోడానికి ఎవరూ లేకపోయారు. మరీ పక్కన కూర్చున్న అమ్మాయిల మొహాలు పదే పదే చూస్తే పెడార్ధం వస్తుందని అటు అదీ చెయ్యలేక ఇటు విసుగుని ఎలా వ్యక్త పరచాలో అర్ధం కాక, తెలుగు ' కాక కాక ' అయిపోయాను.

ఈ సినిమా గురించి ఆలోచిస్తుంటే శిరోభారం శీర్షాసనమేసినట్టుంది....మళ్ళీ కలుస్తా.