19-ఏప్రల్-2014
లప్పంగిరిగిరి - 17
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!!
హాయ్ హెలో నమస్తే బాగున్నారా !!! నేను జస్ట్ యావరేజ్. అంటే ఇంతకముందు ఏదో సూపర్ అనట్టు కాదు. బేసిక్‌గా మనం, రేసు గుర్రంలో శ్రుతి హాసన్ క్యారెక్టర్ టైప్. ఎప్పుడూ లైఫ్‌ని బిలో యావరేజ్ నుంచి అబవ్ యావరేజ్ రేంజ్‌లో నడిపిస్తే బెటర్ అన్నది నా ఉద్దేశం, దీన్నీ ఆల్రెడీ చాలా మందిపై రుద్దేసాం.
* ముందుగా అంతగా ముఖ్యం కాని అంశాలు: 

ఈ పోటీ ప్రపంచాన్ని, పొట్టి లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకునే క్రమంలో అక్రమశిక్షణ ట్రై చేస్తూ ఇన్నాళ్ళూ జంప్ జిలాని.

* ప్రాంతీయ పర్సనల్ వార్తలు:
- పుట్టినప్పటి నుంచి నాకో పెద్ద మిస్టరీగా మారిన 'నా కాబోయే భార్య ఎవరు ? ఎవరు ? ఎవరు ?' అన్న ప్రశ్నకు, నేను విధించుకున్న డెడ్‌లైన్ 2011 వరల్డ్‌కప్ టైమ్‌కే సరిగ్గా ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ టై అయిన సమయానికే నా భార్యతో టై అయ్యింది. అలా ఒకటిన్నర ఇంటివాడినయ్యాను. 83లో పుట్టినప్పుడు ఇండియా వరల్డ్  కప్ గెలించింది, సరిగ్గా నెక్స్‌ట్ వరల్డ్‌కప్ గెలిచినప్పుడే పెళ్ళికావడం వల్ల, నాలో వున్న కొయిన్సిండాలజిస్ట్, నీకు వరల్డ్ కప్‌కు ఏదో వుంది, ఏదో వుంది అని చెప్తుంటే, నెక్స్‌ట్ వరల్డ్ కప్పు గెలిచే టైంకు ఇంకేం అవుతుందో అన్న కుతూహలం ఎక్కువైంది.
- పెళ్ళి హ్యాంగ్ఓవర్లో ఉండగానే, మా బుడ్డాడు కూడా 'నేనొచ్చేసా, నేనొచ్చేసా' అని ఎంట్రి ఇచ్చాడు.
- వీటితో, ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ' సుందరాకాండ '  సినిమా గుర్తొచ్చింది. అందులో ఒక సందర్భంలో అపర్ణ, ఇంకోసారి మీనా, ఏవో 25, 50, 75, 100 మార్క్స్ గురించి చెప్పినట్టు గుర్తు. వాళ్ళ టెస్ట్‌లో నాక్కూడా డిస్టింక్షన్ వచ్చినట్టే అని తెలిసి ఉబ్బి తబ్బి చబ్బి హబ్బి బ్బయ్యాను.
- ఇది ఇలా ఉండగా హైదరాబాద్ GHMC నుంచి, బెంగళూరు మహా నగర పాలికెకు మకాం మార్చాల్సొచ్చింది. 
- అబ్బో ఇక్కడకొచ్చాక కొత్త వాళ్ళు, కొత్త డైరీ పాలు, కొత్త డైపర్లతో.... కాలం, గతంతో కలిసి పరిగెడుతూనే ఉంది. నాకు నేనే నమ్మలేకపోతున్నా, ఇప్పుడు నమ్మ బెంగుళూరియన్.

* ఏవేవో వార్తలు:

* ఈ మధ్య ఇంచు మించు ప్రతి ముప్పై నిమిషాలకొకసారి గుర్తొస్తున్న విషయం, నాకు ముప్పై ఏళ్ళు నిండాయని. ఇది తలుచుకున్నప్పుడల్లా, గవర్నమెంట్ ఆఫీస్సుల్లో ఉండే పెండింగ్ ఫైల్స్‌లా, ఫేస్‌బుక్‌లో తర్వాత చదువుదాం అని వదిలేసిన షేర్డ్ జోక్స్‌లా, పిచ్చి పిచ్చిగా పేరుకుపోయిన విష్ లిస్ట్స్: ప్లాస్టిక్ బకెట్ లిస్ట్ (అంటే చూడాల్సిన సినిమాలు, ప్రదేశాలు లాంటివి), స్టీల్ బకెట్ లిస్ట్ (అంటే కొంచం సీరియస్‌గా చూడాల్సిన సినిమాలు, ప్రదేశాలు లాంటివి) గుర్తొస్తున్నాయి. అందులో కొన్ని:

- IRCTC తత్కాల్ టికెట్స్ క్యాన్సెలేషన్ రూల్స్ సరిగ్గా చదవక, కోల్పోయిన రెండు వేల రూపాయలకు, ఎప్పటికైనా ప్రతీకారం తీర్చుకోవడం.
- పవన్ కళ్యాణ్ 'ఇజం' బుక్ లాగా 'ప్రిజం' బుక్ రాయడం. పవనిజం, రామూఇజం లాంటి రకరకాల ఇజాలపై లైట్‌గా లైట్ వేసి ఒక కలర్‌ఫుల్ అవుట్‌పుట్ తీసుకురావడమే ఈ 'ప్రిజం' కాన్సెప్ట్.
- IPLలో నెక్స్‌ట్ అట్ట్రాక్షన్‌గా ఆడ క్రికెటర్లను మగ వాళ్ళ టీంలో 33% రెజర్వేషన్ కల్పించి ఆడిస్తే భలే ఉంటుంది.
- నేను చాలా సెన్సిటివ్. ఎంతగా అంటే సెన్సొడైన్ కంపెని నచ్చి, వాళ్ళు బ్రుష్‌లు, పేస్ట్‌లే కాకుండా సెన్సిటివ్ సోప్స్, కారాలు, మిరియాలు, కూరగాయలు..etc తయారు చెయ్యాలని సిన్సియర్‌గా కోరుకునే, అవి ఖచ్చితంగా కొనుక్కునే అభిమానిని. ఈ మధ్య TVలో వారానికి ముప్పై సార్లు వచ్చే, సంక్రాంతి సినిమా చూసి మినిమం మూడు సార్లు ఏడ్చాను. ముఖ్యంగా శివ బాలాజీకి రైస్ మిల్ ఆలోచన వచ్చాక, సంగీత, స్నేహ తమ నగలు ఇచ్చే సీన్‌కు ఎక్కువ సేపు ఏడ్చాను. మరీ అంత సెన్సిటివ్‌గా ఉండకూడదన్నది లక్ష్యం.

అబ్బో ఇలా చాలా టర్గెట్స్ వున్నాయి...తీరిగ్గా చెప్తాను.
- ఫైనల్‌గా ఈ మధ్య దేవుడు కూడా నవ్వుకుని ఉంటాడు అనుకున్న విషయం చెప్పి ముగిస్తాను:
మొన్న పండక్కి పూజ చేస్తూ, ' మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ' అని చదవాల్సిందిపోయి, పొరపాటున ' మద్య పానీయం సమర్పయామి ' అని చదివి నాలుక్కరుచుకున్నా. చాలా సారీలు చెప్పాక కాని మనసు కుదుటపడలేదు. ఎందుకంటే నేను దెయ్యానికన్నా దేవుడికే ఎక్కువ భయపడతాను. మరొక్కసారి సభాముఖంగా ' సారీ దేవుడా ' (రేసు గుర్రం స్టైల్‌లో) ! 

0 comments