Posted by
అశోక్ వర్మ |
11:32 AM
శభాష్ శభాష్ శభాష్ - 1
మనం చేసే కొన్ని పనులు, అబ్బా మనలో ఇంత మ్యాటర్ వుందా అని మనకే సందేహం తెప్పించి మనల్ని మనమే మెచ్చుకునేలా చేస్తుంటాయి. అదేదో సినిమాలో కోట తన భుజాన్ని తనే తట్టుకుంటూ... 'శభాష్ శభాష్ శభాష్' అనుకుంటాడు...
సరిగ్గా అలా అనుకున్న సంఘటనలను ఇక్కడ పోస్టుతాను.
--------------------------------
మా పేరంట్స్ నాకు పెళ్ళి చేసేయ్యాలని డిసైడ్ అయిపోయి సెర్చింగ్ మొదలెట్టారు. ఆళ్ల దృష్టిలో మనం ఇంకా హమామ్ బాయ్ కాబట్టి ఆ ఇమేజ్ డామేజ్ కాకుండా కాపాడుకుంటూ, మన ప్రయత్నం మనమూ చేద్దామని telugumatrimony.comలో ప్రొఫైల్ యాక్టివేట్ చేసా.
ఒక అమ్మాయి ప్రొఫైల్ నచ్చడంతో 'Express Interest' కొట్టా. అందులో ఫొటో లేదు, సో ఫొటో రిక్వెస్ట్ పెట్టాను. నేను మాత్రం నా దగ్గరున్న ఖర్చీఫ్ డీటేల్స్‌తో సాహా అన్నీ నా ప్రొఫైల్‌లో పెట్టేసా. నెక్స్ట్ డే మెయిల్ వచ్చింది తను నా ఇంటరెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిందని.
అస్సలు చిక్కు ఇక్కడే మొదలయ్యింది. నేను పెయిడ్ మెంబర్ కాదు, తను కూడా కాదు. ఇద్దరి ప్రొఫైల్స్‌లో ఫోన్ నంబర్స్ యాడ్ చేసి వున్నాయి కాని పెయిడ్ మెంబర్స్ మాత్రమే చూడగలరు. జీవితంలో ఇంటర్నెట్‌లో నాకు ఊహ తెలిసినప్పటినుండి నేను రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. కాని లైఫ్ మ్యాటర్ కాబట్టి ఓ పది రుపాయలు...ఇరవై రుపాయలు వుంటే కట్టేద్దాంలే అని రెండు రోజులు ఆలోచించాక కన్విన్స్ అయ్యా. కానీ వాళ్ళ ఫీ చూస్తే...3 నెలలకే 1500 పైన వుంది. ఆ పైన ఇంకా చాలా రూల్స్, తొక్కా తోటకూర చాలా వున్నాయి. ఒక వేల ఈ అమ్మాయికీ, నాకు సెట్ అవ్వకపోతే ఆ అమౌంట్ బొక్క కదూ అని పెయిడ్ మెంబర్‌షిప్ వద్దనుకున్నా.
మొత్తానికి ఇద్దరం పర్లేదు అనదగ్గ పీనాసులం కావడంతో, మ్యాటర్ ముందుకు జరగకపోవడంతో ఆ సైట్ వాళ్ళు సినిమాల్లో విలన్లలా కనిపించారు. ఫోన్ నంబర్ వుంది అని వుంటుంది కాని తెలియాలంటే పెయిడ్ మెంబర్ అవ్వు అంటుంది. ఇలా కాదు ఎలాగైనా ఆ అమ్మాయి కాంటాక్ట్ పట్టాలని డిసైడ్ అయ్యా.
అస్సలు ఆ సైట్ వాళ్ళు ఎంత మాత్రం సైట్ మెయింటేన్ చేస్తున్నారో చూద్దామని నా ప్రొఫైల్‌లో 'About Me' మార్చా, ' ఐ లవ్ క్రియేటింగ్ వెబ్‌సైట్స్ లైక్ అయస్కాంతం.కామ్ ' అని యాడ్ చేసా. ఆ అమ్మాయికి మినిమం బల్బ్ వెలిగే క్యాపబిలిటి వుంటే ఆ సైట్ చూసి అందులో 'Contact Us' మెను ఐటమ్ నుంచి నా మెయిల్ ఐడి పట్టుకొని ఈజీగా కాంటాక్ట్ అవ్వొచ్చు అన్నది నా అవిడియా. కాని నా ప్రొఫైల్ సేవ్ చెయ్యగానే, 'u r profile is under validation, will be updated in 24 hrs' అని వచ్చింది. అమ్మో వీళ్ళు భలే హుషారు గున్నారే అని అనుకున్నా. మరుసటి రోజు ఆ సైట్ వాళ్ళు మెయిల్ కొట్టారు. మాష్టారు మీరు పర్సనల్ డీటెయిల్స్ తెలిసేలా మ్యాటర్ పెడుతున్నారు. ఇలా పెట్టడం మా పాలసీకు విరుద్ధం, దయ చేసి ఇక మీదట ఇలా చెయ్యకండి అని చెప్పి.. ' ఐ లవ్ క్రియేటింగ్ వెబ్‌సైట్స్ ' వరకే పెట్టి నెక్స్ట్ ముక్క కట్ చేసారు. మామా నీలో తెలంగాణ శకుంతల పూనినట్టుంది ( 'నువ్వు నేను ' సినిమాలో) అనుకుని ఛ అనుకున్నా.
నాలో ఇంక పావు కిలో పౌరుషం పెరిగింది. అంతే వెంటనే తన ప్రొఫైల్‌ని జల్లెడ పట్టా. ఆ అమ్మాయి పేరు కాస్త యూనిక్‌గా వుంది - పల్లవి చరణ్ (పేరు మార్చబడింది). ఏజ్, హైట్, వెయిట్, తను వర్క్ చేసే కంపెని పేరు, తన సొంత వూరు మాత్రమే వున్నాయి. స్కూల్, కాలేజ్ డీటేల్స్ లేవు. వాళ్ల కంపెనీలో కూడా తెలిసిన వారు లేరు. తెలుసుంటే తన పేరుతో అడిగి తెలుసుకోవచ్చు. వెంటనే ఆర్కుట్‌లో ఆ అమ్మాయి పేరుతో వెదికా. ఒకటి రెండు ప్రొఫైల్స్ వచ్చాయి. కాని అవి 100% ఇన్‌కంప్లీట్ ప్రొఫైల్స్ అని అర్థమయ్యింది. సో ఈ అమ్మాయికి ఆర్కుట్‌తో టచ్ లేదు అని తెలిసింది. గూగుల్, JNTU సైట్స్...వగైరా ట్రై చేసినా నో లక్. కానీ ఎలాగైనా కనుక్కోవాలి, telugumatrimony.comను బైపాస్ చెయ్యాలి అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యా. అప్పుడు తట్టింది, మిలియన్ డాలర్ ఐడియా. అఫ్‌కోర్స్ మరీ అంత కాకపోయినా, మూడు నెలల సబ్‌స్క్రిప్‌షన్ ఫీ అంత ఐడియా.
పల్లవి చరణ్ - ఇలాంటి పేరు చాలా తక్కువ మందికి వుంటుంది అని అనిపించి వెంటనే
pallavi.charan@gmail.com
pallavi_charan@gmail.com
pallavi.charan@yahoo.com
pallavi_charan@yahoo.com
ఇలా రక రకాల కాంబినేషన్స్‌తో 16 మెయిల్ ఐడిలు తయారు చేసా. అన్నింటినీ CCలో పెట్టి, కామన్ మెసేజ్ కొట్టా:
" హాయ్ మీరు ఫలానా కంపెనీలో వర్క్ చేసే పల్లవి చరణ్ ఐతే, ప్లీజ్ రీడ్ ఫర్‌దర్ ఆర్ ఎల్స్ ఇగ్నోర్ దిస్ మెయిల్. నేను సో అండ్ సొ.....telugumatrimony.comలో ఎక్స్‌ప్రెస్స్‌డ్ ఇంటరెస్ట్. మీరు వారే ఐతే డూ రిప్లై మీ." అని మెయిల్ చేసా.
వెంటనే 14 మెయిల్ ఐడీలు బౌన్స్ అయ్యాయి. కానీ మిగతా 2 అన్నా కరక్ట్ ఐడిలు అని తెలిసింది. తర్వాత తిని తుంగున్నా. సాయంత్రం మెయిల్ అకౌంట్ ఓపెన్ చెస్తే, టు మై సర్‌ప్రైజ్ సరిగ్గా ఆ అమ్మాయి నుంచే రిప్లై వచ్చింది. తను టూ మచ్‌గా థ్రిల్ అయ్యింది. తన ఫోన్ నంబర్ ఇచ్చింది !!!
నాకు ఇంత కన్నా హ్యాపీ అనిపించిన విషయం, ద్వార పాలకుడిగా బిల్డప్ ఇచ్చిన telugumatrimony.com టోల్ గేట్‌ను బ్రేక్ చెయ్యడం. శబ శబ శభాష్....అని నన్ను నేను చాలా మెచ్చుకున్నా. కుదిరితే ప్రొఫెషనల్ CVలో పెట్టుకోదగ్గ పాయింట్ అన్న రేంజ్‌లో పొగుడుకున్నా !!!.