2006 సంవత్సరం....

రోటీ/బటర్ నాన్/స్టఫ్‌డ్ కుల్చా...ఆ మాట కొస్తే రెస్టారెంట్ మెనులో ఏ ఐటమ్ ఐనా ఆర్డర్ చేసే సౌలబ్యం,
కాస్ట్‌లీ కప్‌డా,
ముద్దొచ్చే మకాన్.....(అట్‌లీస్ట్ రెంటెడ్ వన్)
ఇవి అన్నీ వున్నా కూడా శంకర్ చాలా ఫ్రస్ట్రేషన్లో వున్నాడు. రూం టాప్ కేసి అలా శూన్యంలో చూస్తున్నాడు. అంతా బ్లాంక్‌గా కనిపిస్తోంది. ఏం శంకరయ్యా అంత ధీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ అని అడగడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు, usually ఉండరు. మన వాడు సింగిల్‌గా వుంటాడు కాబట్టి. ఇంతలో ఫోన్ కాల్ రావడంతో, లిఫ్ట్ చేసాడు. ఫ్రెండ్ అయిన

శ్రీను : "హాయ్ ఛీనాబ" అన్నాడు. అంతే వెంటనే కాల్ కట్ చేసాడు, శంకర్. శ్రీను మళ్ళీ కాల్ చేసాడు, శంకర్‌కు విసుగొచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. చెవిలో 'ఛీనాబ ఛీనాబ' అని ఫ్రెండ్ అన్న మాటే రీప్లే అవుతోంది. ఛీనాబ అనేది శంకర్‌కు కొందరు ఫ్రెండ్స్ పెట్టిన ముద్దు పేరు. ఛీనాబ అంటే ' ఛీ నా బతుకు ' కు షార్ట్ ఫార్మ్. ఇది ఒకప్పుడు శంకర్ ఊత పదం.

నిజానికి శంకర్ సర్కిల్‌లో రోగిష్టి రిలేటివ్స్, పాపిష్టి ప్రాజెక్ట్ మేనేజర్స్, గిఫ్ట్-ఇష్టి గర్ల్ ఫ్రెండ్స్ లేరు. పెద్ద ప్రోబ్లమ్స్ ఏవీ లేవు. కానీ తనది తపనతో కూడిన బాధ. తనకు కొద్దో గొప్పో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన శ్రీను , క్రిష్ణా రెడ్డి, వినాయక్‌లకు కూడా శంకర్ అస్సలు సమస్య ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదు. శంకర్ ముందు నుంచే వీళ్ళకు కాస్త డిఫరెంట్‌గా మిగతా వారికి తేడాగా కనిపించేవాడు.

శంకర్ రాసే ఏ స్లామ్ బుక్‌లో అయినా తన కామన్ అన్సర్స్ ఇవి...

Email id: rupees.friendship.only@gmail.com
Favorite Film: గురు
Favorite Books: డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు,డబ్బు సంపాదించడం ఎలా ?, Rich Dad Vs Poor Dad....

ఇవి చాలవూ తను మనీ మైండెడ్ అని చెప్పడానికి.
శంకర్‌కు ఎప్పటినుంచో బాగా డబ్బు సంపాదించాలాన్న కోరిక. తన లక్ష్యం ఆ డబ్బుతో ఆ తర్వాత జల్సా చెయ్యొచ్చు అని కాదు. ఈ ప్రపంచం మొత్తం డబ్బు మీదనే నడుస్తుంది, దాని నుంచి ఫ్రీ అయిపోయి నిజమైన లైఫ్‌ని ఆస్వాదించాలన్నది తన యాంబిషన్.

శంకర్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. అందులో ఉండే సుఖాల కన్నా కష్టాలు ఎక్కువ చూసాడు. తను అనుకున్న దాని కన్నా IT బూమ్ పుణ్యమా అని, ఎక్కువ కష్టపడకుండానే తన తండ్రి 38 ఏండ్ల సర్వీస్ చివర్లో వచ్చిన Rs 15,000 సాలరీని తన మొదటి జీతం తోనే దాటేసాడు. నాన్న గారి P.F డబ్బులు, ఇంకా అన్ని సేవింగ్స్ కలిపి చెల్లి పెళ్ళి కోసం అని ఎన్నో సంవత్సరాలు కష్టపడి కూడబెట్టిన సొమ్ము ఇప్పుడు తన yearly సాలరీ కన్నా తక్కువ. ఈ పరిస్థితి చూసి ఆనందించాలో, విచారించాలొ అర్థం కాని పరిస్థితి తండ్రి-కొడుకులిద్దరిదీ. ఒక యావరేజ్ డిగ్రీ వల్ల ఒక మనిషి జీవితాంతం కష్టపడాల్సి వస్తే, వన్ డే బాటింగ్‌లతో ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించినా, అత్యంత సులువుగా IC అనే MNC లో జాబ్ పొందగలిగాడు శంకర్. ఎందరో అతి కష్టం మీద సంపాదించే డబ్బు కన్నా ఇంత సులువుగా చాలా మంది ఎన్నో రెట్లు ఎక్కువగా సంపాదించడం విచిత్రంగా తోచింది శంకర్‌కు. ఇలానే సమాజంలో చాలా మంది తమ తెలివిని/తర్కాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించటానికి సులువైన మార్గాలను కనుక్కొని రాణిస్తున్నారు, కాని కొందరు మాత్రం తమ మదిలో ఇలాంటి ఆలోచనలను రానివ్వట్లేదు, అనుకున్నాడు.

శంకర్ పని చేస్తున్న కంపెనిలో ఒక సెక్యూరిటీ గార్డ్‌ది దయనీయ గాధ. ఎక్కడో జార్ఖండ్ నుంచి వలస వచ్చి ఇక్కడ జాబ్ చేస్తుంటే, వస్తున్న జీతం సరిపోదని డబుల్ డ్యూటీ చేస్తూ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా రోజంతా ఆఫిస్‌లోనే వుంటూ రెండు జీతాలు వచ్చేలా పని చేస్తున్నాడు. అయినా కుడా తన వార్షిక ఆదాయం ఆ MNCలో ఒక యావరేజ్ ప్రోజెక్ట్ మేనేజర్ నెల జీతం కన్నా చాలా తక్కువ. వంద రుపాయలు సంపాదించడం కోసం రోజూ ఎంతో కష్టపడే ఎందరినో చూసాడు శంకర్, అలాగే ఎంతో తెలికగా వంద రూపాయలను ఖర్చుచేసే వారినీ చూసాడు. జీవితంలో డబ్బు ప్రాముఖ్యతను తను చిన్నప్పటినుంచి చాలా అబ్జర్వ్ చేస్తూ, తెలుసుకుంటూ వచ్చాడు. యండమూరి లాంటి రచయితలు, 'డబ్బు ఆనందాన్ని ఇవ్వదేమో కాని సుఖాన్ని మాత్రం ఇస్తుంది" అన్న మాటలు అక్షర సత్యం అనిపించాయి శంకర్‌కు.

ఎందరో ఆర్థికంగా విజయం సాధించిన వారి గాధలు విన్నాడు. అందరూ ' గురు ' సినిమాను మణి రత్నం/ఐశ్వర్యారాయ్/అభిషేక్ బచ్చన్/రహమాన్/శ్రేయా గోషల్ కోసం చూస్తే శంకర్ మాత్రం 30 సార్లు అందులో చూపించిన హీరో కసిని పట్టుకోడానికి చూసాడు. శంకర్‌కు ధీరూభాయ్ అంబానీ, బిల్ గేట్స్, వారెన్ బఫెట్....ఇలాంటి వారంటే వీరాభిమానం. అమీషా పటేల్, నయనతార లాంటి వారు కలల్లో రావాల్సిన వయసులో అజీమ్ ప్రేమ్‌జీ, నారాయణ మూర్తి లను కలవరిస్తూ గడుపుతున్నాడు.
శంకర్‌ది మొదటి నుంచి, 'గుంపులో Don't go-విందం' పాలసీ. కాని IT ఇండస్త్రీ ఇచ్చిన ఈజీ ఆఫర్‌ని కాదనలేకపోయాడు. సగటు 21+ ఆంధ్రా యువకుడిలానే శంకర్ కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈ ఇండస్ట్రీలో రెండేళ్ళు గడిచాక తను రియలైజ్ అవ్వడం మొదలయ్యింది. ఇప్పుడొస్తున్న మంచి సాలరికి సంతోషిస్తూ ఇలా వుండిపోతే ఎలా అని ? ఇప్పటికీ ఈ జీతం నిజానికి బొటా బొటిదే. ఇలాగే రోజుకి 10-12 గంటలు పని చేస్తుంటే 10-12 ఏండ్లు గడిచినా ఇలానే వుంటాం. ఇదీ ఒక రకంగా న్యూ జెనరేషన్ మిడిల్ క్లాస్ లైఫ్ అనిపించింది. తనకు క్రియేటివ్ ఫీల్డ్స్ అంటే ఇష్టం. ఒక రకంగా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్మింగ్ అంటే ఇష్టం కానీ ఒకరు నిర్దేశించిన ఫలానా వర్కు, ఫలానా బగ్గులు, ఇలానే చేసుకుంటూ పోతే తను ఫలానా అన్న ఐడెంటిటీ యే ఉండదు అనిపించింది. శంకర్‌కు ప్రతి రోజు పది గంటలకు సైబర్ టవర్స్(హైదెరాబాద్) సిగ్నల్ దగ్గరకు రాగానే కొన్ని వేల హెల్మెట్స్‌ను చూడగానే భయమేస్తుంది. ఇన్ని వేల హెల్మెట్స్‌లో నేను ఒకడిని కాకూడదు అని గట్టిగా చెప్పుకుంటాడు. తనకు అప్పుడు ఆశ్చర్య మనిపించే మరో విషయం, 'ఇన్ని వేల మంది తమ తెలివినంతా ఉపయోగించి ఎన్నో ప్రోబ్లమ్స్‌ను (కంపెనీవి) సాల్వ్ చేస్తుంటారు. కాని అదే తెలివిని తమ రియల్ లైఫ్ మెరుగుపర్చుకోడానికి అదే రేంజ్‌లో ఎందుకు వాడరు ?" అని.
ఒక స్టేజ్ కు వచ్చాక రోజంతా ఇంకెవరికోసమో పని చెయ్యడం శంకర్‌కు నచ్చలేదు. తన ఫ్రస్ట్రేషన్ ఫోర్ టైమ్స్ పెరిగింది.లాభం లేదు ఏదో ఒక్కటి చెయ్యాలనుకున్నాడు. తనకు తాను సంపద సృష్టించుకోవాలని, తన జీవితాన్ని, తనని డైరెక్ట్‌గా ఆడిస్తున్న డబ్బు పని పట్టాలని, డబ్బును కమాండ్ చేసే స్టేజ్‌కు తను రాగలిగితేనే తన జీవితాన్ని తను అనుకున్న విధంగా జీవించగలనని అనిపించింది. కోటీశ్వరుడు అవ్వంది డబ్బు మీద అంత కమాండ్ రావడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగే జాబ్ చేస్తూ పోతే రెటైర్ అయ్యే స్టేజ్‌కు కోటేశ్వరుడు అవ్వొచ్చు. కాని అప్పటికి దానికి వాల్యు లేకుండా పోవచ్చు. అందుకే 3 yearsలో కోటీశ్వరుడు అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇందాక దాని గురించి ఆలోచిస్తుంటేనే శ్రీను కాల్ చేసాడు. కొద్దిగా డిస్టర్బ్ అయినా, ఎప్పటిలా శంకర్ ఈ ఆలోచనలను అక్కడితో ఆపెయ్యలేదు. ఈసారెందుకో తను కాస్త దృఢంగానే వున్నాడు. రోజు రోజుకి పెరుగుతున్న డబ్బు దౌర్జన్యం వళ్ళ కావొచ్చు. ఇంతటి కాన్సన్‌ట్రేషన్‌తో వున్న శంకర్‌ను చూసి, వామ్మో వీడు నిజంగానే బాగుపడిపోయేట్టు వున్నాడని గ్రహించి టక్కున ఉలిక్కిపడి లేచిన శంకర్ అంతరంగం, అంతరంగాలు టైటిల్ సాంగ్‌ను ప్లే చేస్తూ, 'రెయ్ శంకర్ గా మరీ మనకీ ఫ్రెండ్ కాకుండా, మనీ-కీ ఫ్రెండ్ వయ్యి మంకీ లా తయారవుతున్నావ్. నువ్వు చూసిన/చదివినవే చిత్రాలు, పుస్తకాలు కాదురా ప్రపంచంలో ఇంకా చాలామంది చాలా విషయాలు రాసారు. వాళ్ళు చెప్పేదేంటంటే, డబ్బు గురించి మరీ ఎక్కువ ఆలోచించకూడదు, మనకు నిన్న,రేపటికన్నా, నేడు ముఖ్యం. ప్రస్తుతం తప్ప మిగతాదంతా అప్రస్తుతం అనీ..... "

ఇవ్వన్నీ డిస్టర్బ్ చేస్తున్నా ఎందుకో శంకర్‌కు అవి వినపడట్లేదు. అవన్నీ 3 years తర్వాత చూసుకోవచ్చు. ఈ టైం మొత్తాన్ని నేను కోటి రూపాయలు సంపాధించడనికే స్పెండ్ చేస్తా....అనుకుని ఫిక్స్ అయిపోయాడు. శంకర్ అంతరంగం ఖంగు తిని ఏదో లోయలో పడుతున్నట్టు అరుస్తూ గాయబ్ అయ్యాడు. శంకర్ మాత్రం ఇప్పుడు సరికొత్త పంధాలో డబ్బు సంపాదించడం ఎలా అని తన రూఫ్ టాప్ కేసి చూస్తూ...శూన్యంలో సూపర్ అవిడియాలకోసం వెదుకుతున్నాడు....

(ఇంకా వుంది)

4 comments
  1. Shiva Bandaru December 27, 2008 at 10:08 PM  

    keka

  2. సుజ్జి December 28, 2008 at 5:09 AM  

    chala baaga rastunnaru.. will be waiting for other part.

  3. ప్రపుల్ల చంద్ర December 28, 2008 at 5:18 AM  

    very nice... waiting for next posts...

  4. Unknown December 30, 2008 at 9:06 PM  

    Hi Ashok,

    Its proud to say that am ur Engg classmate.Keep going ahead ...

    Ramya