14-జనవరి-2009
లప్పంగిరిగిరి - 2
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* 'పావు తక్కువ తొమ్మిదైందే పద్మావతి ' అని ఎవడో గట్టిగా 'నచ్చావులే' పాట ప్లే చేస్తుంటే 'ఏడిచావులే' అని వాడ్ని తిట్టుకుంటూ నిద్రనుండి లేచాను. టైం చూస్తే 'పావు తక్కువ పదకొండు అయ్యింది '. ఫోన్ చూస్తే ఇంటినుంచి చాలా కాల్స్ వున్నాయి, అమ్మో అని అమ్మకు వెంటనే ఫోన్ చేస్తే ' ఏరా ఇప్పుడే లేచావా ? ఈ రోజు సంక్రాంతి అని తెలుసా ? , బహుశా ప్రపంచంలో ఏ తెలుగోడు ఈ రోజు ఇంత లేట్‌గా లేవడు...' అని తిట్లాష్టకం స్టార్ట్ చేస్తుంటే, 'హే మామ్స్, కూల్...కూల్‌గా వుందని...అయినా నేను మీ అందరికన్నా ముందే మేల్కొని 12 నుంచి 4 గంటల వరకు సంక్రాంతి జరుపుకుని పడుకున్నా, మీరంతా నన్ను చూసి నేర్చుకోవాలి...' అని రివర్స్ క్లాస్ పీకి ఎస్కేపా.

* పేపర్ చూడగానే, చలి మనకే కాదు పేపర్‌కు కూడా వుంటుంది అన్న కొత్త యాంగిల్ తెలిసింది. అందుకే ప్రతి ఒక్కరినీ పట్టించుకునే సి.యం గారు ఒక స్వెటర్/జెర్కిన్/జాకెట్‌ను సంక్రాంతి సందర్భంగా వార్తా పత్రికలకు దానం చేసారు . ప్రకటనలను కూడా న్యూస్ ఐటంలా భ్రమింపజేసే వినూత్న వొరవడికి శ్రీకారం చుట్టిన వై.యెస్ గారికి జోహార్స్.

* అతి చిన్న వార్తగా వచ్చిన ఒక ఐటం నన్ను విశేషంగా ఆకర్షించింది. చేతి నిండా పని లేక చెయ్యి చూసుకుంటుంటే ఒక శాస్త్రవేత్తకు సందేహం వచ్చి రీసెర్చ్ చేస్తే, చూపుడు వేలుకన్నా ఉంగరం వేలు పొడుగ్గా వుంటే వాళ్ళు స్పైడర్ మాన్, బాట్ మాన్ లకు ఎక్కువ జెంటిల్ మాన్‌కు తక్కువ అని తేల్చేసాడంట. వెంటనే నా చెయ్యి చూసి వావో వావు...నా ఉంగరం వేలు, చూపూడు వేలు కన్నా పొడుగ్గుందోచ్ అని మురిసిపోయాను. వెంటనే సిక్స్త్ సెన్స్, సిక్స్త్ క్లాస్ సెన్స్ చెప్పింది - 'అరె వో గెవడికైనా గట్లనే వుంటుంది బే' అని. అవును కదూ అని లైట్ తీసుకున్నా. ఎందుకంటే 'విశ్వసనీయ వర్గాల కథనం' మేరకు ఆ ప్రముఖ దిన పత్రిక రీసర్చ్‌ల పేరుతో చెప్పేవన్నీ తూచ్ అని నాకు గట్టి నమ్మకం. ఫ్లాష్ బ్యాక్‌లో ఒక రోజు ఆ రోజు పేపర్ చదువుతుండగా, దాని పక్కన పదిహేను రోజుల కిందటి అదే బ్రాండ్ వారి పేపర్ వచ్చి పడింది. ఒక దాంట్లో ఏమో రోజూ కాకా హోటల్‌లో కాఫీ తాగితే కాకర్ల హాస్పిటల్(నిమ్స్)కు వెళ్తావ్ అని చెప్తే, ఇంకొక దాంట్లో రోజూ కాఫీ తాగని బతుకు ఒక బతుకే కాదు, బ్రహ్మీ తాతయ్య తలరాతలను కాఫీ తాగుతూనే వ్రాస్తాడు, సో ఆ అలవాటు అసైన్ చేసినవారికి ఆయుష్ షాంపూ వేసి తలంటి స్నానం చేయిస్తాడు అని ఒక రేంజ్‌లో చెప్పారు. ఆ రోజు నుంచి 'అమ్మ దొంగా' అనుకుంటా సదరు న్యూస్ పేపర్ వారు అలాంటి వార్తలను ఇస్తే. కాని వాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా 'అమ్మ-మ్మ దొంగా అనిపించేలా ఇలాంటి వార్తలను దంచేస్తూనే వున్నారు.

* సచిన్ టెండుల్కర్ రంజీ ఫైనల్స్‌లో డక్ అవుట్ అయ్యాడంట. ఇందులో అంత స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా ? ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఫస్ట్ టైం అంట డక్ అవుట్ అవ్వడం. మంచి G.K బిట్ కదూ !!!

* 'నావి పిల్లి కళ్ళు, మేక మెడలు........ అని మా పిన్ని వాల్ల పెద్దమ్మ అంటుంటుంది...' లాంటి సోది మాటలు మత్రమే చెప్పేవారు కాస్తయినా, CAT ఎగ్జాంలో మంచి పెర్సెంటైల్ సంపాదించిన అంథురాలి నుంచి ప్రేరణ పొందాలి.

* "హేపీ సంక్రాంతి, సంక్రాంతి హేపి" లాంటి అరడజను SMSలు, అర-అరడజను ఫోన్ కాల్స్, అరవై ఉత్తుత్తి గుంపులో గోవిందం మెయిల్స్, "ఏరా ఊరికి పోలేదా ?, నీదీ ఒక లైఫారా, అసలేం పీకుతుంటావ్ బే నువ్వు ?" అన్న చిన్న పాటి కామెంట్లు, 'అడ్డం జరుగుతావా...అంకుల్ అనమంటావా' అని బెదిరించే మా కాలనీ పిల్లలతో, పెద్ద పాటి ఎలుకలు (వీటినే చాలా ఏరియాలలో పంది కొక్కులు అంటారు) కడుపులో కాలింగ్ బెల్ కొడుతుంతే మా ఏరియా అంతా హోటల్స్ మూసివేసుండడం వల్ల పండగ వస్తే బ్యాచిలర్‌లకు ఎన్ని కష్టాలో సర్వే చేస్తూ 'అహ నా పెళ్లంట ' సినిమా లో కోటా/రాజేంద్ర ప్రసాద్ మెనుతో సర్దుకుంటూ సంక్రాంతి జరుపుకున్నా.

* మా ఫ్రెండ్ గాడికి మెయిల్స్ 'ఫార్వర్డ్' చెయ్యడం చాలా ఇష్టం. 'బ్యాక్‌వర్డ్' చెయ్యడం కూడా ఇష్టమే యెప్పుడూ ఆ ఆప్షన్ కోసమే వెతుకుతూ వుంటాడు. వాడికి ఈ రోజు ఒక్క ఝలక్ వచ్చిందంట. మెయిలింగ్ లిస్ట్‌లో ఎవడెవడున్నాడో చూసుకోకుండా ఫార్వర్డ్ చెయ్యడంతో ఫారిన్ కష్టమర్‌లకు కుడా సంక్రాంతి విషెస్ పంపించాడు. ఇక్కడ ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది. 'sonkranti wishes' అని పంపడం వల్ల, 'Congratulations on having a new baby boy, kranti !' అని రిప్లై వచ్చిందంట.

* సెలవు రోజు అయ్యుండి 'మస్కా' సినిమా చూసేసి ఫాస్టెస్ట్ రివ్యూ పెట్టడానికి పోటి పడాలని ఎందుకు అనిపించలేదా అని డవుట్ వచ్చింది. ఎడారిలో ఒయాసిస్ అవ్వాలనుకోవాలే కాని, ఇసుక కావలనుకోకుడదు అని జ్ఞానోదయం అయ్యి సర్దీ(జలుబు) తో సతమతమవుతున్న నాకు నేనే సర్ది చెప్పుకున్నా.

అట్‌లీస్ట్ సినిమా చూద్దాం అని మూడ్ వచ్చేసరికి ఆ రోజు టికట్స్ అన్నీ బుక్ అయ్యాయని తెలిసింది. ముందు రోజు అనుకుని వుంటే ఆ పాటికి సినిమా కూడా చూసేసుండొచ్చు అనిపించింది.

ఈ దారి గుండా వచ్చినందుకు సెప్తున్నా (by the way), యే సినిమా అన్నా మొదటి రోజు మొదటి షో, (ప్రోబబ్లి స్టేట్ మొత్తంలో మొదటి షో) చూడాలనుకుంటే చాలా వీజి. bookmyshow.comలో ప్రసాద్స్‌లో ముందు రోజు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 9 - 10.30 మధ్య ఫస్ట్ షో మొదలవుతుంది. చాలా మంది టాలివుడ్ big wigs, చిన్న చిన్న విగ్స్ పెట్టుకున్న వారు వస్తారు. idlebrain జీవి గారు ఇంకా చాలా వెబ్‌సైట్స్ వారు కూడా ఈ షో కి వచ్చే రివ్యూస్ వ్రాస్తారు. నేను కూడా ఈ పద్దతిలోనే చాలా సినిమాలు చూసాను.

పైగా నాకు పాచి మొహంతో లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, రిలీజ్ సినిమాలు చూడడం అంటే తెగ ఇష్టం. అందుకే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో క్రికెట్ మ్యాచ్‌ల కోసం వెయిట్ చేస్తుంటా.

ప్రసాద్స్‌కు ఒక మంచి ఆల్టర్నేటివ్ 'easymoviesindia.com'. కాకపోతే ఇందులో ఖాతా తీసుకోవాలి. మినిమం ప్యాకేజ్ 300 రుపీస్‌గా వుంది. ఇందులో ఒక ట్విస్ట్ వుంది. ప్రతి నెలా 30 రుపీస్ సర్వీస్ చార్జెస్ కింద కట్ చేస్తారు. మీరు ఖాతా తీసుకునే ఆఖరి క్షణం వరకు ఈ విషయం చెప్పరు. ఈ ఒక్క విషయం తప్ప అన్నీ రకాలుగా చాలా హెల్ప్ చేస్తుంది easymovies. ఎంతటి క్రేజ్ ఉన్న సినిమాకైనా చాలా ఈజీగా టికెట్స్ దొరుకుతాయి.

ఇన్ని ఆప్షన్స్ వున్నా, చాలా మంది మూడు రోజుల నుంచి ట్రై చేస్తునా టికెట్స్ దొరకట్లా/బ్లాక్‌లో కొని వైట్ వాష్ అయ్యాం అని నానా రకాల కష్టాలు ఎందుకు సెప్తారో అర్థం కాదు, 'ఇంటర్నెట్ హై నా !!!'

* జంధ్యాల గారి జయంతి సందర్భంగా 13,14,15 తేదీల్లో రవీంద్ర భారతిలో 'హాస్యోత్సవాలు ' జరుగుతాయని 12 నే తెలుసు. 13 న,

'మండే (monday) ముందు ఏమి వస్తుంది ?' అంటే 'పొగ ' అని సమాధానం చెప్పడం, 'విష్ణువు, లక్ష్మి, శివుడు ' యే యే లింగాలో చెప్పు అని మాష్టారు అడిగితే, 'విష్ణువు పుం లింగం, లక్ష్మి స్త్రీ లింగం, శివుడు శివలింగం' అని విధ్యార్థి సమాధానం చెప్పడంలాంటి జోక్స్‌తో బాగా అలరించారు అని తెలిసినా, 14 న ఖా
ళీగా వున్నా వెళ్లని నాలాంటి బై బర్త్ బద్ధకిస్ట్‌లను ఖాళీ పిస్టోల్ తో కాల్చి కాల్చి చంపాలి.

4 comments
  1. మధురవాణి January 16, 2009 at 1:26 AM  

    as usual....hilarious post :)))))

  2. నాగప్రసాద్ January 16, 2009 at 5:47 AM  

    super :)))

  3. మధు January 16, 2009 at 7:32 AM  

    హ్హాహ్హా..మాష్టారూ మీ డైరీ కేక!!!

  4. Rani January 16, 2009 at 8:37 AM  

    ఇప్పుడె మీ పాత పోస్ట్లన్ని కూడ చదివెయ్యాలి, Friday కూడ ఏం పని చెస్తాం చెప్పండి.
    మీ Profile ఫోటో లొ రాముదు మంచి బాలుడు లా కనిపిస్తున్నారు,
    ఇంత Comedy రాయగలరు అనిపించట్లేదు :P

    keep it up :)