19-జనవరి-2009
లప్పంగిరిగిరి - 7
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* ఎవరితోనో gtalk లో ఇంపార్టంట్ విషయం చాటుతుంటే, ఎప్పుడూ పగటి పూట ఆన్‌లైన్ రాని సనత్‌గాడు రావడంతో షాక్ అయ్యా.
సనత్: ఏరా ఫోటోస్ చూసావా ?
నేను: ఏ హీరోయిన్‌వి, ఎక్కడ ?
సనత్: నీ ఎంకమ్మ. అవి కాదు, నేను తీసిన ఫోటోస్ అప్‌లోడ్ చేసి లింక్ ఇచ్చాను కదరా, ఇంకా చూల్లేదా ?
నేను: ఓ అవా, సారీ మర్చిపోయా.
సనత్: సర్లే, ఇప్పుడు చూడు.
నేను: ఇప్పుడా ?
సనత్: ఏంటి ఇంకా లంచ్‌కు ఎళ్లలేదా ?
నేను: ఇప్పుడే మేసి వస్తున్నా, అందుకే...
సనత్: అంటే...నిన్నూ...ఇప్పుడు చూస్తావా సాయంత్రం నన్నే చూపించమంటావా ?
నేను: అమ్మో వద్దు, నేనే చూస్తా.
అని చూడ్డం మొదలెట్టా
ప్రతి ఫోటో్‌కు ఈడు ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ చూసి భలే నవ్వొచ్చింది, మా ఫోటోగ్రఫి కోర్స్ రోజులు గుర్తొచ్చాయి. సనత్‌గాడు ఫోటోగ్రఫి పిచ్చోడు, అర్జున్ కచ్చోడు, నేను పిచ్-కచ్-చోడిని.

ఒకరోజు ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్ గుండా పోతుంటే అర్జున్ గాడికి ఏదో ఫోన్ కాల్ వచ్చింది, సరిగ్గా వినిపించడంలేదని బండాపమన్నాడు. ఆడు పక్కకెళ్లి మాటాడుతుంటే అక్కడ ఉన్న ఒక స్టాల్‌ను చూసా. అంతే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి, "మీకు కశ్యప్ తెలుసా ?" అన్నాడు. ఇదేదో ఆకస్మిక G.K తనిఖీ కేంద్రంలా వుంది అనుకుని, "హిరణ్య కశ్యప్ తెలుసు" అని ఠక్కున సమాధానం చెప్పాను. ఆడి ఫేస్‌లో క్రాకర్స్ కనిపించాయి.
ఆడు: ఆయనకాదు సార్. ద గ్రేట్ ఫోటోగ్రాఫర్ కశ్యప్ గారు ఫోటోగ్రఫి కోర్స్ పెడుతున్నారు. మీకు ఇంటరెస్ట్ ఉందా ?
నేను: ఓహో, నాకు అంత ఇంటరెస్ట్‌లేదు లేండి.
అని చెప్తే, చాలా మంచి చ్యాన్స్ సార్. ఆయన గోడలు మేడలు దూకి ఫోటోలు తీసి గోల్డ్ మెడల్ సాధించారు, డిస్టింక్షన్ ఇన్ డిప్లొమ ఇన్ ఫోటోగ్రఫి, Powerpoint లో పట్టాదారు పాసు పుస్తకం, MS Word లో వైట్ కార్డ్ (రేషన్ కార్డ్) హోల్డర్ అని ఏవేవో చెప్పాడు. నాకు ఇంటరెస్ట్‌లేదని చెప్పినా వినకుండ పాంప్లెట్ నా చేతిలో పెట్టాడు. అప్పుడే అర్జున్ గాడు రావడంతో వెంటనే బయలుదేరా. లక్కీలీ ఆడికి పాంప్లెట్ ఇవ్వలేదు, ఇచ్చుంటే, '101 ways on how not to use a paper' కోర్స్ లైవ్ డెమో చూపించేవాడు.

రెండు మూడు రోజుల తర్వాత ఎలాగో సనత్ చేతిలో ఆ పాంప్లెట్ పడడంతో భలే ఎగ్జైట్ అయ్యాడు. అలాంటి కోర్స్ కోసమే ఎదురుచూస్తున్నాడంట. ఆడు ఫోటోగ్రఫి గురించి, అర్జున్‌గాడు ప్రియమణి గురించి చెప్పిన రేంజ్‌లో చెప్పడంతో వినలేక చచ్చాను. ఎలాగన్నా నన్ను కూడా ఆ కోర్స్‌కు తీసుకెళ్తే ఆడికో తోడుంటుందని ఆడి తాపత్రయం.
నేను: నీకు చాలా ఇంటరెస్ట్ ఉందిరా, గుడ్.
సనత్: పాషన్ మామా పాషన్. అది ఉంటే చాలు రా. నీకూ పాషన్ ఉంటే రా లేదంటే వద్దు.
అర్జున్: మరి పల్సర్ ఉంటే రాకూడదా ?

అని బైక్‌ల గురించి చెప్పడంతో సనత్‌గాడికి పట్టపగలే తారే జమీన్ పర్ !!!

కట్ చేస్తే నేను, సనత్ ఫోటోగ్రఫి క్లాస్‌లో వున్నాం. నా ఇంటెన్షన్ ఆ కోర్స్ నేర్చేసుకుందామని కాదు, అస్సలు దీన్ని బిజినెస్‌గా ఎలా నడుపుతారు, అసలేం చెప్తారు, ఎంత మంది వస్తారు, ఆళ్ళ రియాక్షన్‌లు ఏంటి...మొదలగు విషయాలు తెలుసుకోవచ్చు అని జాయిన్ అయ్యాను. ఇంకో ముఖ్య కారణం థీరీ అయ్యాక రెండు సార్లు అవుటింగ్ కూడా వుంటుందని చెప్పడంతో ఇంటరెస్ట్ వచ్చింది.

మొదటి క్లాస్‌లోనే నేను జీవితంలో మరచిపోలేని జెర్క్ వచ్చింది. సదరు మాష్టారు గారిది మామూలు తెలివి కాదు. లెస్సన్ మొదలెట్టాక, 'వాట్ ఈజ్ ఫోటోగ్రఫి ?' అన్నాడు. క్లాస్‌లో వున్న 20 మంది తలా ఏదో ఒకటి చెప్పారు. అవన్నీ బోర్డ్ మీద బ్రీఫ్‌గా రాసాడు. తర్వాత ఒక్కొక్క పాయింట్‌ని టచ్ చేస్తూ అది కరెక్టా కాదా అని డిసైడ్ చేసి టిక్/ఇంటు మార్క్‌లు పెట్టాడు. ఇంటు మార్క్‌లు దాదాపు లేనేలేవు. టిక్ ఉన్న వన్నీ కలిపి చదివి, దిస్ ఈజ్ ఫోటోగ్రఫి అన్నాడు. సో మీకు ఫోటోగ్రఫి వచ్చేసింది అన్నాడు. అందరూ తెగ సంబరపడిపోయారు. నాకు మాత్రం దిమ్మ తిరిగి, 'మనసిచ్చు చూడు ' సినిమాలో ప్రకాష్ రాజ్ గుర్తొచ్చాడు. సర్లే ఏదో మొదటి క్లాస్ కదా అనుకున్నా. కాని అస్సలు మ్యాటర్ తర్వాత అర్థమయ్యింది.

ప్రతి రోజూ, 'వాట్ ఈజ్ లెన్స్ అనో వాట్ ఈజ్ అపర్‌చర్ అనో' బోర్డ్ మీద రాయడం, అందరినీ అభిప్రాయాలు చెప్పమనడం. సహజంగా పబ్లిక్‌లో నోటి దూల ఎక్కువ వున్న వారు ఎక్కువగానే వుంటారు కాబట్టి, మినిమం 5 పాయింట్లన్నా వచ్చేవి. అవ్వన్నీ బోర్డ్ పైన రాసి, టిక్ మార్క్‌లు పెట్టి, ఆ పాయింట్ చెప్పిన వాడు సంతోషపడేలా మిగతా వారు ఓస్ ఇంతేనా నేనింకేమో అనుకున్నా ! అనుకునేలా చేసి పాఠం ముగించేవాడు.

మా సనత్‌గాడు ఆయనకి ప్రియ, పికిల్ లాంటి శిష్యుడు. ముందు రోజే ఈడు నెట్‌లో అన్నీ సెర్చ్ చేసి, పాయింట్లు రెడీ చేసుకుని మాష్టారు గారి దృష్టిలో మెరిట్ స్టూడెంట్ అవ్వాలని తెగ ప్రయత్నం చేసేవాడు. క్లాస్‌లో హై-టెక్కు అమ్మాయిలు కూడా ఉండేవారు. గురువు గారు ఆళ్ల పాయింట్‌కు టిక్ పెట్టగానే 'ఎస్ ఐ గాట్ ఇట్ రైట్....' అని తెగ సంబరపడిపోయేవారు.

మాష్టారు గారు తనకు అవార్డ్‌లు తెచ్చిపెట్టిన చిత్రాలను పవర్‌పాయింట్లో చూపించాడు. చాలా మటుకు గూడిసెలలో అష్ట కష్టాలు పడుతున్న వారి లైఫ్ కు సంబందించినవే. కాని అవి ప్లే చేస్తున్నంత సేపు అందరు...అవి అవార్డ్‌లు తెచ్చిపెట్టే ఫోటోస్ లాగే చూసారు కాని కొంచం కూడా మానవత్వం చూపించలేదు.

ఇలా క్లాసులు సాగుతూ ప్రాక్టికల్స్ అని అవుటింగ్ తీసుకెళ్లారు. సిటికి దగ్గర్లోని ఫారెస్ట్ ఏరియాకు ఎళ్తున్న దారిలో అక్కడక్కడా ఆపుతూ ఫోటోస్ తీసుకుంటూ వెళ్ళాం. మా సనత్ గాడి అస్సలు టేస్టేంటో అప్పుడే తెలిసింది. బర్రె గొడ్డు కనిపించడం ఆలస్యం తెగ ఉత్సాహం వచ్చేది వాడికి. ఆడి దృష్టిలో అది బర్రె గొడ్డు కాదు బర్రె good-u.

నాకు మాత్రం ఒక పైపును చూడగానే అవిడియా వచ్చి, మా సనత్ గాడిని పైపుకి అవతల తల పెట్టి నిల్చోమని చెప్పి ఆపోజిట్ ఎండ్ నుంచి పైప్‌లోకి కెమెరా పెట్టి తీసా. ఇలా కొంచం వెరైటీ గానే ఫోటోస్ తీసుకోగలిగాను. కాని బెస్ట్ ఫోటో మాత్రం మా బ్యాచ్‌లో ఒక హై-టెక్కు అమ్మాయిని కుక్క వెంటపడుతుండగా తీసినది.

నెక్స్ట్ అవుటింగ్ దుర్గం చెరువులో జరిగింది. అక్కడ నీళ్ళల్లో బాతులు అప్పుడే బాతింగ్‌కు వచ్చినట్టున్నయి చాలా సరదాగా వున్నాయి.
అంతలోనే సనత్‌గాడు వచ్చి: నీకు అరవం తెలుసా ?
నేను: అరవడం తెలుసు.
ఆడు: అది కాడు బే ఇందాక తమిళ్ అతను నా ఫోటోలు చూస్తూ..ఏదో అనుకుంటూ వెళ్లాడు. సర్లే ఈ బాతును చూడు భలే తీసాలే...

అని చూపిస్తే షాక్ అయ్యి...అ 'బ్బా తూ'....అది కాకి రా కుఫ్లీగా, అని చెప్పడంతో, అవునా అని వాడి మైండ్ బ్లాక్ అయ్యింది. ఏదో జూం లెన్స్ వాడి మొత్తానికి జూం బరా బర్ జూం చేసాడు.

నేను అది మొదటి సారి దుర్గం చెరువును విజిట్ చెయ్యడం. ఇంత బిజీ సిటీలో సీక్రెట్ లేక్‌గా భలే అడ్వెంచరస్‌గా వుంది. అలా అలా లో లో పలికి వెల్లిపోగా చూసుకుంటే అందరికీ చాలా దూరంగా ఎల్లిపోయా. అప్పుడు అనూహ్యంగా ఒక నాచురల్ నెమలిని చూసా. ఇంకా కొండల్లోపలికి వెల్లే ధైర్యం చెయ్యలేకపోయా. తిరిగి వచ్చేటప్పుడు ఒక మంగూస్‌ను చూసా. అమ్మో ఇది వుంటే నియర్ బై పాము గాని వుంటుందా అని భయమేసింది. ఆ తొక్కలే యే ముంటుంది అని త్వరగా వెళ్లాలని బయలుదేరగా, అప్పటివరకు జలకాలాడుతున్న ఆవుల మంద అప్పుడే రోడ్‌పైకి వచ్చి చాలా బద్ధకంగా కదులుతున్నాయి. అందులో ఒకటి నన్నే చూస్తోంది. నేనేం రెడ్ షర్ట్ వేసుకోలేదే అని దానికి చెప్దామని ట్రై చేసా కాని అది నా వైపే సీరియాస్‌గా చూస్తుంటే దడుసుకుని చచ్చా. మళ్లీ బ్యాక్ వెల్దామంటే మంగూస్ భయం. ముందు మంద వెనక మంగూస్ అంటే ఇదేనేమో అనుకున్నా.

ఆ సమయంలో ఆవు సాధు జంతువు కాదు, సాధించే జంతువు అనిపించింది.ఎలాగో ధైర్యం తెచ్చుకుని ఒక పెద్ద బండ రాయి వుంటే ఆవుతో దొంగా పోలిస్ గేమ్ ఆడి అది వెళ్లిపోవడంతో హమ్మయ్య అనుకుని మళ్లీ ట్రాక్ మీదకు రాగానే ఒక కొండ ముచ్చు హాయ్ అంది. మొదట్లో భయపడి చచ్చా కాని అది చాలా కాజువల్‌గా వుండడంతో ఫ్రెండ్‌గా ఫీల్ ఐనట్టుంది థాంక్స్ అనుకుని నెక్స్ట్ స్టెప్ వెయ్యబోయాను అంతే రైట్ సైడ్ చాలా పెద్ద పాము నేను చూస్తుండగానే వెళ్లింది. లైఫ్‌లో ఎన్నో సార్లు పుట్టల దగ్గర...etc పోతుంటే పాముంటుందేమో అని భయపడుతూ వెళ్లిన నేను ఫస్ట్ టైం లైవ్‌గా ఆలాంటి సిటుయేషన్‌లో చూడగానే గుండె గూడ్స్ రైలు అయ్యింది. నెక్స్ట్ సెకండ్‌లో నాకు తెలియకుండానే పరిగెత్తడం స్టార్ట్ చేసా. వామ్మో ఈ రోజేదో రంగు పడేట్టుందే అనుకుంటుండగా ఒక విచిత్రమైన జంతువు రైట్ సైడ్ కొండపైన నుంచి నా ముందుగా వచ్చి వెళుతూ వెళుతూ టక్కున ఆగి నా వైపు ఒక లుక్ ఇచ్చింది. నాకు వెంటనే జంగిల్ బుక్ గుర్తొచ్చింది. అందులో మోగ్లి భుజం మీద ఎత్తుకునే జంతువు అది. అప్పటి నాపరిస్థితికి ఎంత అగ్లీగా తయారయినా మరీ మోగ్లీలా వున్నానా అనిపించింది. దాన్ని ఇంకొంచం అబ్సర్వ్ చేసే చ్యాన్స్ ఇవ్వకుండ బుషెస్‌లోకి వెళ్లిపోయింది. అలా రన్నింగ్ చేసుకుంటూనే మా బాట్చ్‌మేట్స్ దగ్గరకు వచ్చాను.

జరిగిన విషయాన్ని, పాము...కొమ్ములు.....నెమలి....జంగిల్ బుక్...తోక...ఆవు... ఇలా కట్ కట్‌గా ఆయాసపడుతూ చెప్పగా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకుండా నన్ను ఫోటోలు తీసుకుంటున్నారు. మీ కెమరాలకు కామెర్లు రాను, ఓరి బాబు నమ్మండ్రా నిజంగా చూసాను అనగానే ఒక్కడు కూడా జాలిపడకుండా, పాము కనిపించిందా ఐతే ఫోటో తీసావా ? అన్నారు.

నాకు నోట మాట రాక, 'మౌనం గానే ఉండమని మార్నింగ్ నీకు చెబుతోంది, తిరిగే కొద్ది తిప్పలని అర్థమందులో ఉంది ' అని మాంటేజ్ సాంగ్ పాడుకుంటూ...ఇంటికొచ్చి పడుకున్నా.

3 comments
  1. Anonymous January 20, 2009 at 3:25 PM  

    what's meaning of lappamgiriri?

  2. నేస్తం January 20, 2009 at 6:07 PM  

    'మౌనం గానే ఉండమని మార్నింగ్ నీకు చెబుతోంది, తిరిగే కొద్ది తిప్పలని అర్థమందులో ఉంది '
    super :)

  3. neenee sagar January 28, 2009 at 10:03 PM  

    hello bayya nenu cm aitee neku nandi award, pm aitee padma bhushan icheseevaadini(ee award lu enduku istaaroo correst gaa telidu). okkokka lappangirgiri aaNimutyam kadandi.... ippatki aidu articles chadivaa, inkooo araganta loo class undi, class eggotti ainaa migataavi chadivi teerataaa