17-జనవరి-2009
లప్పంగిరిగిరి - 5
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* "wazz up" అని SMS రావడంతో రోజు మొదలయ్యింది. roof అని బదులిచ్చా. తరువాత రిప్లయ్ రాలేదు. చాలారోజులనుంచి 'వీకెండోఫోబియా' పట్టుకుంది. శుక్రవారం సాయంత్రం, 'వీకెండ్ కదా ఏంటి ప్లాన్స్ ?' అనీ, శనివారం-ఆదివారం, 'వీకెండ్ కదా ఏం చేస్తున్నావ్ ?' అనీ, సోమవారం పొద్దున్న, 'వీకెండ్ అంతా బాగా ఎంజాయ్ చేసావా ?' అనీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అంటుకున్న రోగం ఇది.

ఈ సారి ఎలా బయట పడదామా అని అనుకుంటూ సినిమా కెళ్లాలని డిసైడ్ అయ్యా. 'మస్కా'కు దగ్గర్లోని 'బిగ్' బజార్‌లోని గోల్డ్‌స్పాట్‌లో ఆన్‌లైన్ టికట్స్ ఉండడంతో వెంటనే తీసుకున్నా. ఎళ్ళగానే ఫస్ట్ జెర్క్ పార్కింగ్ రూపంలో తగిలింది. అత్యంత రద్దీగా ఉండే అమీర్‌పేట్‌కు ఎప్పుడైనా వెళ్తే బిగ్ బజార్ పార్కింగ్‌ను వాడుకోండి, O.C గా చాలా భద్రంగా వుంటుంది అని చాలా మందికి సలహాలిచ్చిన నాకు తాటి కాయ బాంబ్ పేలింది. తాటి కాయంత అక్షరాలతో, డిసెంబర్ నుంచి పార్కింగ్ ఫీ కలెక్ట్ చేస్తున్నాం అని ఉంది. ఫ్రీ గా వస్తే ఫెవికాల్‌నైనా చపాతిలోకి నంజుకుని తినే మిత్రబృందానికి ఈ విషాద వార్త ఎలా చెప్పాలా అని బాధపడ్డా.

టికట్ కౌంటర్‌కు రాగానే మరో షాక్. 'బిగ్' బ్రాండ్‌ను బాగా ఫోకస్ చేసే రిలయన్స్ వారు బిగ్-పొడవు-లాంగ్ క్యూ ఉండేట్టు బాగా జాగ్రత్తలు తీసుకున్నారనిపించింది. ఉన్న మూడు కౌంటర్‌లలో ఒకటి పని చేయకుండా పెట్టి బోరింగ్ దగ్గర నీళ్ళకోసం ఆంటీలు వేయిట్ చేసే మాదిరి సీన్ సృష్టించగలిగారు.

చాలామందిలాగే నాకు వెయిటింగ్ వాసన పడదు. సరే ఈ సారికి అడ్జస్ట్ అవుదాం అనుకుని, 'టైం రా టైం' అనుకుంటుంటే ఎవడో ఎనకనుంచి 11:30 అయ్యింది అన్నాడు. ఎనక్కు తిరిగి, తిరిగి కౌంటర్ ఇచ్చే మూడ్ కూడా లేకున్నింది. ఎందుకింత లేట్ అవుతోందా అని గమనిస్తే, 'మనకొచ్చిన కన్‌ఫర్మేషన్ SMS/ప్రింట్ అవుట్ చూపించాక, క్రెడిట్ కార్డ్ అడుగుతారు, అది వెరిఫై చేసాక, ఒక ఫారం ఫుల్‌గా ఫిల్ చేసి సంతకం పెట్టమని మనకు ఇస్తారు ' ఇవన్నీ విజయవంతంగా పూర్తయితేనే టికట్ చేతులోకివస్తుంది. ఈ 'బిగ్' ప్రొసీజర్ చూసి, 'ఛీ మా బతుకు, చీమ బతుకు అయ్యింది ' అనుకుని మొత్తానికి థియేటర్ ఏంట్రన్స్ వరకు వెళ్ళిపోయా.

వరసగా నిల్చున్న 5 మంది సెక్యూరిటీ వాళ్ళను చూసి సర్‌ప్రైజ్ అయ్యా. ఒక హిందీ మీడియం సెక్యూరిటి గార్డు చెతులు పైకెత్తమని సిగ్నల్ ఇవ్వడంతో అలానే చేసా. చెక్ చేస్తూ చేస్తూ నడుము దగ్గరకు రాగానే హిందీ, మీడియంగా మాత్రమే తెలిసిన నేను 'నో......ముఝె చక్కిలిగిలిగిలి హై' అని గట్టిగా అరిచా.

ఆడు: "క్యా సాబ్" అన్నాడు. నాకు ఆ టైంలో,

'కసబ్' అన్నాడనిపించి బెంబేలెత్తిపోయా. అలా అరవడం వల్ల టెర్రరిస్ట్ కసబ్ తో పోలుస్తున్నారని డవుట్ వచ్చింది. ఈ సారి 'నో....నహి...నో...నహీ' అని దీనికి బదులిచ్చా. ఆడు మళ్లీ, 'క్యా సాబ్...క్యా హువా' అనగానే విషయం అర్థమయ్యి కాస్త హవా వచ్చింది. తేరుకుని ఆడికి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యడానికి ట్రై చేసా.

"ముఝే ఇధర్ ఉధర్ టచ్ కర్నే సే.....కుచ్ కుచ్ హోతా హై "

అనగానే అందరూ నవ్వారు. నన్ను ఇంక చెక్ చెయ్యకుండానే వదిలేసారు. సో ఫ్యూచర్‌లో తీవ్రవాది ఐతే ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది అని అవిడియాను ఫోన్‌లో రికార్డ్ చేసుకుని పెట్టుకున్నా. ఎందుకంటే మనం గజ-గజని కాబట్టి.

నా సీట్ కరెక్ట్‌గా జంట జంటల మధ్య పడింది. ఇద్దరు జంటల ముద్దుల స్త్రేన్‌జరయ్యానన్నమాట అనుకున్నా. సినిమా మొదలయినప్పుడు అంతా బానే వున్నారు. ఫస్ట్ ఫైట్ స్టార్ట్ అయ్యాక, రౌడీ తల మీద బిందె పెట్టి హీరో కొట్టే సీన్‌కు నా కుడి పక్కనోడు ఎగిరెగిరి నవ్వుతుండడం చూసి షాక్ అయ్యా. కొన్ని వేల సినిమాల్లో అలాంటి సీన్ వున్నా ఇంకా ఎందుకు పెడుతున్నారా అన్న నా చిరకాల డవుట్ క్లారిఫై అయ్యింది. ఎవడ్రా డైనాసర్‌లు అంతరించిందన్నోడు అనిపించింది ఆ జంటను చూసి. ఈడేమో నవ్వాసురుడిలా వున్నాడు, ఆయన వైఫ్ ఏమో హిడింబీకి అక్కలా, హీ-మాన్‌కు చెల్లెలుగా వుంది. ఆమె మాత్రం డ్యూయట్ సాంగ్స్ అప్పుడు మాత్రమే భర్తతో కలిసి నవ్వేది. ఇలాంటి పాటలకు కూడా నవ్వొచ్చు అని మొదటసారి అనిపించింది. మొదట్లో 'ఓరినీ నోట్లో 'నో లాఫింగ్' బోర్డ్ పెట్టా ' అని అరవాలనిపించినా, సీరియస్ సీన్లలోకూడా, ముఖ్యంగా హన్సిక ఏడ్చే ప్రతి సీన్‌లోను నా పక్కనోడు విరగబడి నవ్వుతుండడం చూస్తూ నేనూ నవ్వుకున్నా. మొత్తానికి మస్కా సినిమాను ఈ మస్కిటో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో చూడాల్సి వచ్చింది. AC బదులు దోమల మందు వదిలితే నాలాంటి ప్రేక్షకులు సేవ్ అవుతారని థియేటర్ వాళ్ళకు సలహా కూడా ఇవ్వాలనిపించింది.

నా లెఫ్ట్ సైడ్ ఒక జంట ఉందన్న విషయమే మర్చిపోయాను, అంత సైలెంట్‌గా వున్నారు. రైట్ సైడ్ మాత్రం చాలా వైలెంట్‌గా వున్నారు. దేవుడున్నాడనిపించింది. లెఫ్ట్ సైడ్ చూసి, 'ఎక్స్ క్యూజ్ మీ, మీరు బ్రతికే వున్నారా ? అనీ, రైట్ సైడ్ చూసి 'ఎక్స్ క్యూజ్ మీ, మీరు ఎప్పుడు పోతారు ? అనీ అడగాలనిపించింది. నాకెందుకులే అని భయపడుతూ బయటపడ్డా.

ఒకటి-రెండు ఫ్లోర్స్ దిగగానే ఫుడ్ బజార్ చూసి ఫ్లాష్ బాక్ గుర్తొచ్చింది. ఒక సారి మిట్ట-సాయంత్రం ఇక్కడకు షాపింగ్‌కు వచ్చాను. మొత్తం తిరగగా తిరగగా కాసేపటికి కళ్ళు తిరిగాయి. ఏదన్న శీతలపానీయం తీసుకుందామని ఫుడ్ బజార్ ఫ్లోర్‌కు వస్తే, బిల్ కౌంటర్‌లో ప్యాసెంజర్ రైల్ అంత క్యూ ఉంది. కోక్ టిన్ కనబడటంతో తీసుకున్నా కాని అక్కడ ఎవరు స్టాఫ్ లేకుండడంతో దాన్ని పట్టుకుని క్యూలో నిల్చున్నా. రైలు గంటకు 0.000000000001 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుండడంతో నా వల్ల కాదని కోక్ టిన్ ఓపెన్ చేసి తాగడం స్టార్ట్ చేసా. టిన్ పూర్తయింది కాని క్యూ అలాగే వుంది, ఇంకా ఓపికగా వుంటే ఓ.ఫి వార్డ్‌కు వెళ్ళాల్సి వస్తుందని వెళ్ళిపోయా.

నేను చేసిన ఈ ద్రోహం నాకు ఫ్లాష్ బ్యాక్ రూపంలో గుచ్చి గుచ్చి చంపింది. ఒక కోక్ టిన్ నేను రిలయన్స్ వారికి రుణపడిపోయానే అని బాధపడ్డా, వెంటనే ఒక కోక్ టిన్ కొని టాప్ ఫ్లోర్ కెళ్లి ఆ బిల్డింగ్‌కి కోకాకిభిషేకం చెయ్యాలనిపించింది. కాని అలా చేస్తే ప్రదీప్ రావత్‌కు పోలియో చుక్కలు ఏసినట్టుంటుంది అని లైట్ తీసుకున్నా.

* మా ఇంటి కాంపౌండ్ దగ్గరకు రాగానే ఒక బృహత్తరమైన ట్యూన్ మైండ్‌లోకి వచ్చింది. దానికి రాన్‌డం లిరిక్స్ యాడ్ చేసి, 'నిన్నే నేను చూడాలి..ఏదో నీకు చెప్పాలి ' అని పాడుకుంటూ, చేత్తో తాలం వేసుకుంటూ, ఇంటి తాళం తీద్దామని అనుకుంటుండగా మన గజ-గజిని విషయం గుర్తొచ్చి, ట్యూన్ మర్చిపోతాం అని ఫోన్‌లో రికార్డర్ ఆన్ చేసి పాడుతుంటే, మా ఈదిలో వుండే పుట్టు-గజ్జి కుక్క ఆజ్ యూజువల్‌గా మొరగడం స్టార్ట్ చేసింది. అయినా సరే ట్యూన్ మర్చిపోతానేమో అని అలాగే పాడి రికార్డ్ చేసుకుని తర్వాత విని జడుసుకున్నా, "నిన్నే నేను చూడాలి...బౌ..బౌ...నీతో ఏదో చెప్పాలి...బౌ..బౌ" అని కుక్క గారి ఫెర్‌ఫెక్ట్ కోరస్‌తో రికార్డ్ అయ్యింది. మొదట్లో భయపడ్డా ఈ ప్రయోగం సినిమాల్లో కూడా చెయ్యొచ్చు కదా అనిపించింది. కుక్కలు, పిల్లులు...ఇలాంటీ వాటితో కోరస్ పాడిస్తే కొక్కొరొక్కే !!!

4 comments
  1. నేస్తం January 18, 2009 at 5:45 PM  

    అన్ని డైరీ లూ ఒక్కలా ఉంటాయో లెవో తెలియదు కాని నీ డైరీ లా ఉండటం చాల కష్టం ..సూపర్ రాస్తున్నావ్ :)

  2. బ్లాగాగ్ని January 18, 2009 at 8:54 PM  

    >> 'కసబ్' అన్నాడనిపించి బెంబేలెత్తిపోయా
    >> ముఝే ఇధర్ ఉధర్ టచ్ కర్నే సే.....కుచ్ కుచ్ హోతా
    >> గజ-గజని
    >> నోట్లో 'నో లాఫింగ్' బోర్డ్ పెట్టా
    LOL. You are rocking. Keep up the good work.

  3. Anonymous January 18, 2009 at 9:43 PM  

    chala bagundi lappangiri part-5. g am eagerly waiting for ur part-6. wat ur mobile number

  4. చైతన్య.ఎస్ January 18, 2009 at 11:14 PM  

    >> ముఝే ఇధర్ ఉధర్ టచ్ కర్నే సే.....కుచ్ కుచ్ హోతా హై

    >>నోట్లో 'నో లాఫింగ్' బోర్డ్ పెట్టా

    >>హిడింబీకి అక్కలా, హీ-మాన్‌కు చెల్లెలుగా

    హ..హా బాగుంది :)