23-జనవరి-2009
లప్పంగిరిగిరి - 11
- అన్ని డైరీలు ఒకేలా ఉండవ్ !!

* గత రెండు మూడు రోజులుగా ఫివరిష్‌గా, హెడ్ ఏకిష్‌గా, స్టమకేకిష్‌గా......ఇలా రకరకాలిష్‌గా ఉండడంతో డైరీ వడ్డీ రోజు రోజుకి పెరిగిపోతోందన్న టెన్షన్‌లో నేనుంటే, ఈ మధ్యే సిటీకి వలస వానరంలా వచ్చిన మా వడివేలుగాడు కాలాడు।

ఆడు: మామా వీకెండ్ బాగా ఎంజాయ్ చెయ్యాలంటే ఈ సిటీలో ఏమున్నాయో సిటికెలో చెప్పు...

నేను: రెయ్ నాకు బాలేదు, తర్వాత చెప్తా

ఆడు: అదేంటి మామా అలా అంటావ్. అయినా నీకేం అయ్యిందిరా ? నువ్వు బండ అని చెప్పుకుంటుంటావ్ కదా ?

నేను: నేనూ అలాగే అనుకునే వాడిని కాని ఇది పాలిష్ బండ అని ఇప్పుడే తెలుస్తోంది. నన్నొదిలెయ్ రా బాబు...

అని ఎంత చెప్పినా వినకుండ, నన్ను సతాయించడంతో సిటీలో మేము ఊరేగిన ప్రముఖ పర్యాటబుల్ ప్లేసెస్‌ని ఆడికి వివరించాను. అవ్వన్నీ ఇక్కడ రాసుకుందామనిపించింది.

* రన్ వే 9, కొంపల్లి:

హైదరాబాద్‌లో ఇప్పుడు మోస్ట్ ఎక్సైటింగ్ ప్లేస్ ఇదే. గో-కార్టింగ్ వల్లే ఇదంతా. మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా థ్రిల్ అయ్యాం. ఫార్ములా 1 రేస్ టైప్‌లో సామాన్యుడు సరదాగా రైడ్ చేసే సౌలభ్యం ఇక్కడుంది. Rs 175కు 4 లాప్స్ (రౌండ్లు) నుంచి 20 లాప్స్ - Rs 600/- వరకు టికట్స్ ఉంటాయి. మా మిత్రబృందంలో మొదట నేనే ధైర్యం చేసి ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యా. లెఫ్ట్ కాలు సైడ్ బ్రేక్ ఉంటుంది, రైట్ కాలు సైడ్ ఆగ్జిలరేటర్ ఉంటుంది, స్టీరింగ్....అని అక్కడ బాయ్ సెప్తుంటే, మావాడొకడు, 'మా మొఖం ముందుంటుంది ' అన్నాడు. వావ్ ఇంతేనా అనుకుని, నేను బయలుదేరా. స్లోగా వెళ్తుంటే ఈజీగా వెళ్లొచ్చు. కాస్త స్పీడ్ పెంచుదామని ట్రై చేసి ఫాస్ట్‌గా పోతుంటే మధ్యలో కొంచం కన్‌ఫ్యూజ్ అయ్యాను. అంతే మైండ్ బ్లాక్ అయ్యింది, దభేల్ మని ఆ ట్రాక్ ఇరువైపులా వున్న టైర్లను గుద్దేసా ! రేస్‌లో వెహికిల్‌ని నడుపుతుంటే ఎంత థ్రిల్ ఉంటుందో గుద్దితే దానికి డబుల్ థ్రిల్ ఉంటుంది అని అప్పుడే తెలిసింది. వాళ్ళ స్టాఫ్ అతను వచ్చి గాడీని గడిలో పెట్టాడు అంతే ఈ సారి మళ్ళీ రయ్ మని పోనిచ్చా. 1 లాప్ బాగానే వెళ్ళాను, అప్పుడంటుకుంది మన పరధ్యానపు రోగం, 'ఛ ఇంత ఈజి అని తెలుసుంటే చిన్నప్పుడే మా బాబుని అడిగి ఇందులో ఎంటర్ అయ్యుంటే బావుండేది, ఇండియా మొత్తంలో నారాయణ్ కార్తికేయన్ ఒక్కడే ఉన్నాడు, అస్సలు కాంపిటిషన్ లేదు. నేనూ ఒక మైఖల్ షూ మేకరో, మైఖల్ మధన కామ రాజో అయ్యుండే వాడిని.....ఛ ' అని అనుకుంటుండగా......దభేల్ మని ఈ సారి తెలియకుండా రెండో సారి గుద్దేసాను. తర్వాత ఈ లోకంలోకి వచ్చి మిగతా లాప్స్ కేర్‌ఫుల్‌గా ఫినిష్ చేసాను. మొత్తానికి మంచి ఎక్స్‌పీరియన్స్.

నెక్స్ట్ మావాడొకడు వెళ్ళాడు. ఎద్దులబండిని ఫార్ములా 1 ట్రాక్ పైన తీసుకొస్తే ఎలా ఉంటుందో ఆడు లైవ్‌గా, లవ్లీగా చూపించాడు. ఆడి డ్రైవింగ్ చూసి నవ్వనోడు లేడు. ఆ స్టాఫ్ వాళ్ళైతే నోరు తెరిచి మరీ, ఇంత వరకు వాళ్ళే ఇలాంటి డ్రైవింగ్ చూల్లేదు అన్నంత రేంజ్లో వెళ్ళాడు మావాడు.

తర్వాత వెళ్ళిన ఇద్ధరు పోటి పెట్టుకుని మరీ పాల్గొన్నారు.

మాలాంటి బ్యాచిలర్ బ్యాచ్‌లే కాకుండా చిన్న చిల్డ్రన్, పెద్ద పేరంట్స్, పెద్ద చిల్డ్రన్, చిన్న పేరంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చెయ్యడం కనిపించింది. గో-కార్టింగ్ కోసమైనా అప్పుడప్పుడు విజిట్ చెయ్యాల్సిన ప్లేస్ అని అందరం అనుకున్నాం.

తర్వాత ఇంకేమున్నాయా అని చూస్తే, ఆర్చరీ కనిపించింది. అది కూడా ట్రై చేసాం, మా ఫ్రెండ్ ఒకడు ఫస్ట్ ట్రై చేస్తే ఎగ్జాట్‌గా టర్గెట్‌లో బాణం పడింది. అందరం భలే నవ్వుకున్నాం, ఎందుకంటే ఆడు ఎయిమ్ చేసింది ఆర్చరీ టార్గేట్ కైతే, బాణం తగిలింది పక్కనే ఉన్న షూటింగ్ స్టాల్ టార్గెట్ పైన. స్విమ్మింగ్‌లో పార్టిసిపేట్ చేస్తే, రన్నింగ్‌లో గోల్డ్ మెడల్ కొట్టే నీలాంటోళ్లని తప్పక ఒలంపిక్స్‌కు పంపాల్సిందే అని ఆడ్ని ఆడుకున్నాం. స్టాల్ అతను చెప్పే డైరెక్షన్స్ ఫాలో ఐతే టార్గెట్ దరిదాపుల్లోనే బాణం వెయ్యొచ్చు అనిపించింది. మొత్తానికి ఈ ఆర్చరీ స్టాల్ కూడా నచ్చింది. షూటింగ్ స్టాల్ ఎందుకనో అవేలబుల్‌గా లేదన్నారు.

స్కేటింగ్ కోర్ట్‌కూడా ఉండడంతో చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది కొంచం డేంజరస్ అని ఫ్రెండ్స్ చెప్పారు. అయినా సరే ట్రై చేద్దాం అనిపించింది. కాని మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అని చెప్పడంతో నిరుత్సాహపడ్డాను.

ట్రెక్కింగ్, నడుముకు ఎదో గట్టి గాల్లో లేపేది లాంటి పిల్లాటలు ఉన్నాయి. అవి కూడా మధ్యాహ్నం 3 తర్వాతే అన్నారు.

ఇండోర్ గేమ్స్‌లో స్నూకర్స్, సెంట్రల్ లాంటి ప్లేసస్‌లో కిడ్స్ జోన్‌లో ఉండే గేమ్స్ ఉన్నాయి. వర్చువల్ రియాలిటి మీద ఏదో గేమ్ ఉన్నింది కాని ట్రై చెయ్యలేదు.

గో-కార్టింగ్ కోసమైతే తప్పక దర్శించాల్సిన ప్లేస్.

ఇదంతా బానే ఉంది కాని రన్ వే 9 ఉండే లోకేషన్ మాత్రం సిటీకి చాలా దూరంగా ఉంది. సికంద్రాబాద్ నుంచి వెళ్తే చాలా చుట్టూ అవుతుంది. ఒక స్నేహితూడు మూసాపేట్ దగ్గర ఉన్న కూకట్‌పల్లి Y జంక్షన్ నుంచి వెళ్లే రోడ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పడంతో గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించా. భలే నచ్చింది రూట్. కూకట్‌పల్లి Y జంక్షన్ నుంచి దిక్కులు చూడకుండా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవడమే. న్యూ బోయిన్‌పల్లి బస్ స్టాప్ వస్తుంది. అక్కడ ఒక లెఫ్ట్ తీసుకుని మళ్ళీ చాలా సేపు దిక్కులు చూడకుండ స్ట్రెయిట్‌గా వెళ్తూ...... ఉంటే, లెఫ్ట్ సైడ్ కొంపల్లి సినీ ప్లానెట్ మల్టిప్లెక్స్ వస్తుంది. ఇదో మంచి లాండ్ మార్క్ అక్కడ. అక్కడ నుంచి లెఫ్ట్ దిక్కు మాత్రమే చూస్తూ వెళ్తే కాసేపయ్యాక రన్ వే 9 వస్తుంది.

సొంత వెహికిల్‌లో వెళ్ళడం బెస్ట్. మేము చాలా మందిమి ఉండడంతో షేర్డ్ ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. అయినా వీజీ గా కూకట్‌పల్లి Y జంక్షన్ నుంచి ఒక ఆటో, న్యూ బోయిన్‌పల్లి బస్ స్టాండ్ నుంచి ఇంకో ఆటో తో చాలా ఈజీగా వెళ్ళిపోయాం.

ఒక వీకెండ్ సొంత వెహికిల్ తీసుకుని, మొదట కొంపల్లి మల్టిప్లెక్స్‌లో మార్నింగ్ షో చూసుకుని (ఇక్కడ టికట్స్ అరౌండ్ 40-50 అంతే అనుకుంటా అన్‌లైక్ 100 ఇన్ అదర్ మల్టిప్లెక్సెస్ మరియూ చాలా ఈజీగా దొరుకుతాయి), ఆ తర్వాత, కొంచం ముందుకు వెళ్తే వచ్చే రన్ వే 9కు 3 గంటల తర్వాత వెళ్ళి అన్నీ గేమ్స్ ఆడేసుకుని, ఇంకొంచం ముందుకు వెళ్తే వచ్చే ధోలా-రి-ధాని, రాజస్థాని హాంగ్ అవుట్ (దీని గురించి నాకు ఏమియును తెలియదు. కాని అక్కడక్కడ వినడం జరిగినది)ని ఒక లుక్కేసుకుని వచ్చెయ్యొచ్చనుకుంటా !!!

మరి కొన్ని ఊరేగే స్పాట్స్ చిన్న బ్రేక్ తర్వాత !!!

1 comments
  1. నేస్తం January 27, 2009 at 3:38 PM  

    ఈ సారి బాగుంది అని అస్సలు చెప్పనంటే చెప్పను.. ఎప్పుడూ హైదరాబాద్ గురించి రాసేస్తున్నారు.. :) ఆ పేరు తప్ప అందులో ప్లేస్ లు తెలియని నాలాంటి వారి సంగతి ఏమిటి .. హ..హ మరి ఉండేది హైదరబాద్ కాబట్టి నా డైరి లో దానిగురించే రాసుకుంటా అనకాపల్లి గురించి రాయను అంటారా... అయితే O.K